close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 18/01/2019 04:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శృంగార నగరి.. గజ్జె కడుతోంది

అదరహో.. ఖజురహో

ఏమనాలో తెలియక మౌనం వహిస్తే అంగీకారం.. అదే మౌనం వారం వారం పాటిస్తే వ్రతం.. నెలల కొద్దీ దాన్నే ఆశ్రయిస్తే యోగం.. కానీ, ఆ మౌనమే శతాబ్దాలుగా తిష్ఠవేస్తే.. వీటన్నిటినీ మించిన అద్భుతం!! అవును ఖజురహో అలాంటి అద్భుతమే. ఏ కదలిక లేకుండా మౌనముద్రలో ఉన్న శిల్పాలు మస్తిష్కాన్ని తొలుస్తాయి.. మనసును కదిలిస్తాయి. మనిషిని ఉద్రేకపరుస్తాయి. ఆ మౌనం జీవన పాఠాలు చెబుతుంది. సృష్టి రహస్యాన్ని బోధిస్తుంది. అందుకే ఈ పర్యాటక కేంద్రం ప్రేమికులకు నందనవనం.. కొత్తజంటలకు బృందావనం.. ఇప్పుడు కళాప్రియులకు పలుకుతోంది ఆహ్వానం.. ఫిబ్రవరి 20 నుంచి 26 వరకు ఖజురహోలో అంతర్జాతీయ నృత్యోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా అపురూప శిల్పనగరి స్వరూపం చూసేద్దాం..

శృంగార నగరి.. గజ్జె కడుతోంది

ఖజూర్‌ (ఖర్జూరం) వేలడంతే ఉంటుంది.. మెలికలు తిరిగిన రేఖలతో విచిత్రంగా తోస్తుంది. ఆ పండు పేరిట వెలిసిన ఖజురహో కూడా అంతే.. మధ్యప్రదేశ్‌లో ఓ మోస్తరు పట్టణం మాత్రమే..! కానీ లోనికి వెళ్లే కొద్దీ బయటకు రానివ్వకుండా చేస్తుంది. అక్కడి ఆలయాలపై నిలిచిన ఇసుకరాతి శిల్పాలు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉత్సుకత రేకెత్తిస్తాయి. క్రీస్తుశకం 950-1050 మధ్య చందేలా రాజుల హయాంలో రూపుదిద్దుకున్న ఈ ఆలయాలు భక్తికి, అనురక్తికి సరికొత్త అర్థం చెబుతాయి.

అంతులేని సంపద

శృంగార నగరి.. గజ్జె కడుతోంది

10-11 శతాబ్దాల కాలంలో చందేలా రాజులు ఖజురహో రాజధానిగా మధ్యభారతాన్ని పరిపాలించారు. ఆ సమయంలోనే ఈ ఆలయాలన్నీ వెలిశాయి. కనీవినీ ఎరుగని శిల్పకళను సంతరించుకున్నాయి. కానీ, ఆ రాజులు పోయాక.. ఏ రాజులూ ఇక్కడి సౌందర్యాన్ని గుర్తించలేదు. దీంతో వందల ఏళ్లు ఇక్కడి ఆలయాలు, శిల్పాలు ఏ ఆదరణకూ నోచుకోలేదు. బ్రిటిష్‌ హయాంలో మళ్లీ ఖజురహో గొప్పదనం బయటి ప్రపంచానికి తెలిసింది. ఒకప్పుడు 80 ఆలయాలతో అలరారిన చందేలా రాజధానిలో కాలపరీక్షను తట్టుకొని నిలబడ్డవి 22 ఆలయాలే! ఆ కొన్నే.. ఎన్నో వింతలకు కొలువయ్యాయి. అంతులేని కళకు నెలవయ్యాయి. ప్రతి ప్రతిమా ఆనాటి శిల్పకారుల కల్పనాశక్తికి సాక్షిగా నిలుస్తుంది. అది హిందూ ఆలయమైనా.. జైన మందిరమైనా.. చిన్నదైనా, పెద్దదైనా.. ఏ నిర్మాణమైనా దేనికదే అద్భుతం. అందుకే ఈ ఆలయ సమూహాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఆలయాలను, శిల్పాలను చూసేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. ఇసుక రాళ్లలో మూర్తీభవించిన శిల్పాలను చూసి మైమరచిపోతారు. దేవుళ్లు, అప్సరసలు, యుద్ధవీరులు, సంప్రదాయాలు ఇలా ఎన్నో విశేషాలు ఒకెత్తు.. కామశాస్త్రాన్ని కళాత్మకంగా వర్ణించే శిల్పాలు మరోఎత్తు!

ప్రతి ఆలయమూ ప్రత్యేకమే

ఖజురహోలో ఉన్న ఆలయాలను తూర్పు, పశ్చిమ, దక్షిణ విభాగాలుగా విభజించారు. వీటిలో మతంగేశ్వర ఆలయం అతి ప్రాచీనమైనదిగా చెబుతారు. శిల్పకళ తక్కువగా ఉంటుంది. దీనికి సమీపంలోని లక్ష్మణ మందిరం ప్రత్యేకమైనది. ఖజురహో సౌందర్యమంతా ఈ ఆలయ గోపురాలు, స్తంభాల్లోనే ప్రతిష్ఠితమై ఉంది. మహావిష్ణువు కొలువు దీరిన ఆలయంలో ఉన్న వందలాది శిల్పాలు వేలాది భావాలను స్ఫురింపజేస్తాయి. వరాహ మందిరం మరో అద్భుతం. భారీ వరాహమూర్తి విగ్రహం ఒక అద్భుతం అనుకుంటే.. విగ్రహంపై 674 దేవతా మూర్తులు చెక్కడం మరో విశేషం. కందారియా మహాదేవ అలయం శిల్పకళలో లక్ష్మణ ఆలయానికి పోటీగా కనిపిస్తుంది. ఈ గుడిలో 646 విగ్రహాలు కొలువుదీరాయి. జగదంబ, విశ్వనాథ, సూర్య మందిరాలు యాత్రికులను కళ్లు తిప్పుకోనీయకుండా కట్టడి చేస్తాయి.

కదిలే శిల్పాలు..

ఖజురహోకు ఏడాదంతా పర్యాటకులు వస్తుంటారు. ఈ చారిత్రక నగరి హనీమూన్‌ డెస్టినేషన్‌గా కూడా ప్రసిద్ధి చెందింది. ప్రేమికుల చిరునామాగా కూడా నిలిచింది. ఏటా ఫిబ్రవరి వచ్చిందంటే ఈ మహత్తర పర్యాటక కేంద్రం మహోన్నత సాంస్కృతిక కార్యక్రమానికి వేదికవుతుంది. ఖజురహో నృత్యోత్సవంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వేడుకలో లబ్దప్రతిష్ఠులైన కళాకారులు పాలుపంచుకుంటారు. సంప్రదాయ నృత్య రీతులను ‘కదిలే శిల్పాలా!’ అన్నట్టుగా ఆవిష్కరిస్తారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్‌, ఒడిస్సీ, కథాకళి ఇలా భారతీయ లాస్యాలన్నీ ఒక్కచోట చేరి మలిసంజెకు మంగళహారతులు పడతాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 20 నుంచి 26 వరకు ఖజురహో నృత్యోత్సవ్‌ జరగనుంది. ఈ ఘనమైన వేడుకను కళ్లారా వీక్షించాలన్నా, మనసారా ఆస్వాదించాలన్నా.. అదరహో ఖజురహో అనాల్సిందే!!

చేరుకునేదిలా

ఖజురహో ఝాన్సీ నుంచి 175కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి ఝాన్సీకి రైళ్లు ఉన్నాయి. అక్కడి నుంచి రైలు, రోడ్డు మార్గంలో ఖజురహో చేరుకోవచ్చు.

ప్యాకేజీతో ఈజీగా

ఖజురహో నృత్యోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌ పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఖజురహో విహారంతో పాటు నృత్యోత్సవానికి హాజరవ్వొచ్చు. తిరుగు ప్రయాణంలో చారిత్రక నగరం ఓర్ఛా పర్యటన కూడా ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి మొదలయ్యే ప్యాకేజీ ఝాన్సీ వరకు రైలులో ఉంటుంది. అక్కడి నుంచి ఏసీ కారులో సాగుతుంది. బస, భోజనం ప్యాకేజీలో భాగంగా లభిస్తాయి.
ప్యాకేజీ ధర: రూ.9,700 ఒక్కొక్కరికి (కనీసం నలుగురు ప్రయాణికులు)

మరిన్ని వివరాలకు 98660 69000 నంబర్‌ను సంప్రదించండి.

చుట్టూ మరెన్నో

శృంగార నగరి.. గజ్జె కడుతోంది

ఖజురహో ఆలయాలు చూసిన తర్వాత.. మరే సౌందర్యమూ కంటికి ఆనదు. కానీ, అంతకాకున్నా ఎంతోకొంత అలరించే పర్యాటక కేంద్రాలు ఇక్కడికి సమీపంలో కొన్నున్నాయి. పెన్నా నేషనల్‌ పార్క్‌ (32 కి.మీ), శివసాగర్‌ సరస్సు, రాణె జలపాతం, పాండవ జలపాతాలు, అజయ్‌గఢ్‌ కోట (80 కి.మీ), కలింజర్‌ కోట (25 కి.మీ) ఇలా ఎన్నో ఆకర్షణలు ఖజురహో పర్యటనను పరిపూర్ణం చేస్తాయి.

అమ్మ చుట్టూ 64 మందిరాలు

శృంగార నగరి.. గజ్జె కడుతోంది

దుర్గాదేవిని చతుఃషష్టి (64) ఉపచారాలతో పూజిస్తారు. దీనికి ప్రతీకగా చౌంసట్‌ (64) ఆలయం కనిపిస్తుంది. అమ్మవారికి ఉపచారాలు చేయడానికి గానూ.. దేవీ ఆలయం చుట్టూ 64 మంది యోగినులకు నిర్మించిన మందిరాలివి.

అమితాబ్‌ వ్యాఖ్యానం

ప్రతి రోజూ సాయంత్రం ఆలయాల ప్రాంగణంలో లైట్స్‌ అండ్‌ సౌండ్‌ షో నిర్వహిస్తారు. ఖజురహో గొప్పదనాన్ని తెలియజేస్తూ సాగే వ్యాఖ్యానానికి బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ గాత్రదానం చేశారు.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.