close

తాజా వార్తలు

Updated : 01/12/2019 00:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముగ్గురు రాకుమారులు మూడు మాయా వస్తువులు

పూర్వం ఒక రాజుండేవాడు. అతనికి ముగ్గురు కుమారులు. ఆ ముగ్గురూ తెలివైనవారు, అందంగానూ ఉండేవారు. అయితే ఆ ముగ్గురూ... పక్క రాజ్యానికి చెందిన ఒకే రాకుమారిని ఇష్టపడ్డారు. యువరాణి తండ్రైన మహారాజుకు ముగ్గురిలో తన కుమార్తెను ఎవరికి ఇచ్చి వివాహం జరిపించాలో తోచలేదు. దీంతో ఓ రోజు ఆ ముగ్గురు రాకుమారులను కోటకు పిలిపించాడు.
‘‘మీరు ఎంత దూరమైనా.. వెళ్లండి. మీరు తిరిగి వచ్చే దారిలో మీకు తారసపడే అద్భుతమైన వస్తువును తీసుకురండి. ఎవరు తీసుకొచ్చిన వస్తువు అద్భుతంగా ఉంటుందో వారికే నా కూతురుని ఇచ్చి వివాహం చేస్తాను’’ అని  ముగ్గురిని సాగనంపాడు. రాకుమారులు తలా ఓ దిక్కున వెళ్లారు. చాలా రోజులు దేశమంతా ప్రయాణించారు. చివరికి ముగ్గురు మూడు వస్తువులతో తిరిగి వచ్చి ఓ చోట కలుసుకున్నారు. మొదటి రాకుమారుడు మాయా తివాచీని తీసుకొచ్చాడు. అందులో ఎక్కి కూర్చుంటే ఎంత దూరమైనా కోరుకున్న చోటుకు క్షణాల్లో చేరుకోవచ్చు. రెండో రాకుమారుడు ఒక మాయా దర్పణం తీసుకొచ్చాడు. ఆ దర్పణంలోకి చూసి ఎవరినైనా.. వారు ఎక్కడున్నారో కనుక్కోవచ్చు. మూడో రాకుమారుడు ఒక  మాయా నిమ్మకాయను తీసుకొచ్చాడు. ఆ నిమ్మరసంతో చావుబతుకుల మధ్య ఉన్న వ్యక్తులెవరినైనా తిరిగి బతికించవచ్చు.
ఈ ముగ్గురూ కలుసుకున్న తర్వాత.. అందులోంచి ఒకతను మనం ఇప్పటికి రాకుమారిని చూసి చాలా రోజులవుతోంది. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. ఈ అద్దంతో రాకుమారి ఎక్కడ ఉందో.. ఎలా ఉందో ఓసారి చూద్దాం... అని అనగానే రెండో వ్యక్తి ఆ అద్దాన్ని బయటకు తీశాడు. అందులోంచి ఆ రాకుమారిని చూశాడు. వెంటనే అందులో ఆమె కనిపించింది. కానీ మొహం అంతా చిక్కిపోయి,  బాధపడుతున్నట్లు ఉంది. యువరాణికి ఏదో జబ్బు చేసినట్లు ఉందని గ్రహించారు.
వెంటనే మొదటి రాకుమారుడు మిగతా ఇద్దరినీ మాయా తివాచీ మీద కూర్చోమన్నాడు. ముగ్గురు ఈ తివాచీ ఎక్కి యువరాణి ఉన్నచోటుకు చేరుకున్నారు. అందులో మూడో రాకుమారుడు వెంటనే తన దగ్గర ఉన్న నిమ్మకాయను పిండి ఆ రసాన్ని యువరాణితో తాగించాడు. వెంటనే ఆ యువరాణి తిరిగి మునుపటిలా ఆరోగ్యంగా, అందంగా తయారైంది. దీంతో రాకుమారులు సంతోషించారు, ఇప్పుడు మాలో ఎవరిని వివాహమాడతారు అని యువరాణిని అడిగారు.
దానికి యువరాణి బదులిస్తూ‘‘ముగ్గురి ప్రయత్నాలు నాకు మేలే చేశాయి. ముగ్గురూ గొప్ప వస్తువులతో తిరిగి వచ్చారు. మీలో ఒకరి మాయా దర్పణం నేను ఎలా ఉన్నానో కనుక్కొనేందుకు ఉపయోగపడింది. అది ఎప్పటికీ మీతో పాటే ఉండి పోతుంది. ఇంకొకరి తివాచీ మీద మీరు నా దగ్గరికి వచ్చారు. ఇదీ  జీవితాంతం మీతో పాటే ఉంటుంది’’. మూడో రాకుమారుడి వైపు తిరిగి చూస్తూ.. మీరు నిమ్మరసం ఇవ్వడం వల్లే నా ప్రాణం నాకు దక్కింది. తిరిగి ఎప్పట్లా ఆరోగ్యంగా ఉన్నాను. కానీ నీకు ప్రాణాపాయం జరిగినా కాపాడుకునేందుకు నీ దగ్గర ఇప్పుడు ఆ నిమ్మకాయ లేదు. క్షణం ఆలోచించకుండా నాకోసం ఇచ్చేశారు. కాబట్టి మూడో రాకుమారుణ్ని వివాహమాడేందుకు నేను సిద్ధం’’ అని యువరాణి మిగిలిన రాకుమారులతో అంది. వారూ ఈ నిర్ణయానికి సంతోషించడంతో మహారాజు ఆ ఇద్దరికీ ఘనంగా వివాహం జరిపించారు.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని