close

తాజా వార్తలు

11 ఏళ్ల ప్రతీకారం తీర్చుకున్నాడు..!

మాంచెస్టర్‌: ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన సెమీఫైనల్లో భారత్‌పై న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో కివీస్‌ ప్రపంచకప్‌ ఫైనల్లోకి రెండోసారి అడుగుపెట్టింది. 2008 అండర్‌-19 ప్రపంచకప్‌లో సారథులుగా తలపడిన కోహ్లీ, విలియమ్సన్‌ మరోసారి సెమీస్‌లో తలపడ్డారు. 11 ఏళ్ల క్రితం జరిగిన సెమీస్‌లో కివీస్‌ను ఓడించి భారత్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. కానీ ప్రస్తుతం ప్రపంచకప్‌లో కోహ్లీసేనను మట్టికరిపించి విలియమ్సన్‌సేన తుదిపోరుకు సిద్ధమయ్యింది. 

విలియమ్సన్‌దే పైచేయి..
అండర్‌-19 ప్రపంచకప్‌లో కెప్టెన్లులా అడుగుపెట్టిన విరాట్‌ కోహ్లీ, కేన్ విలియమ్సన్‌ రాణించి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. బ్యాటింగ్‌లో ఇద్దరూ ఎన్నో రికార్డులను అందుకున్నారు. టెస్టుల్లో, వన్డేల్లో బ్యాటింగ్‌ ర్యాకింగ్స్‌లో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. విలియమ్సన్‌ టెస్టులో రెండో ర్యాంకు, వన్డేల్లో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. అయితే సారథిగా మాత్రం కోహ్లీపై విలియమ్సన్‌ పైచేయి సాధించాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో కష్టాల్లో పడిన జట్టును విలియమ్సన్‌ ఎన్నోసార్లు విజయతీరాలకు చేర్చాడు. సెమీస్‌లో కూడా అతను క్రీజ్‌లో నిలబడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కానీ కోహ్లీ కీలక మ్యాచ్‌లో తడబడ్డాడు. ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. జడేజా (77), ధోనీ (50) ఆఖరి వరకు పోరాడినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. ధోనీ లాంటి దిగ్గజం ఉన్నా భారత్ ఫైనల్‌కు చేరలేకపోవడం గమనార్హం.

అప్పుడూ వరుణుడే..
2008 అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత్‌కు న్యూజిలాండ్‌ 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారడంతో డక్‌వర్త్‌ లూయిస్ పద్ధతి ప్రకారం కోహ్లీసేనకు 43 ఓవర్లలో 191 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఓపెనర్‌ గోస్వామితో కలిసి సారథి కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడటంతో భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  
ప్రస్తుత సెమీఫైనల్లోనూ వర్షం పడింది. కానీ రిజర్వుడే ఉండటంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే 5 పరుగులకే టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఆఖరి వరకు జడేజా, ధోనీ విజయం కోసం ప్రయత్నించారు. కానీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్‌ ఫైనల్‌కు చేరింది. కివీస్, భారత్ తలపడిన రెండు సెమీస్‌లోనూ వర్షం పడటం విశేషం.

ప్రతీకారం తీర్చుకున్నాడు!
2008లో విలియమ్సన్‌సేనను ఓడించి భారత్‌ ఫైనల్‌కు చేరింది. తర్వాత ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. కానీ ప్రస్తుత ప్రపంచకప్‌ సెమీస్‌లో కోహ్లీసేనను ఓడించి విలియమ్సన్‌సేన 11 ఏళ్ల ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. 2008 అండర్‌-19 ప్రపంచకప్‌ ఓటమికి విలియమ్సన్‌ నేడు  ప్రతీకారం తీర్చుకున్నాడని, కోహ్లీ అప్పుడు కప్‌ను అందుకున్నట్లు ఈ సారీ విలియమ్సన్ అందుకుంటాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రేపు ఆస్ట్రేలియా×ఇంగ్లాండ్‌ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో న్యూజిలాండ్ ఆదివారం తలపడనుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.