close

తాజా వార్తలు

అలిగొచ్చాడు.. అదరగొడుతున్నాడు!

గురు @ విజేత

అతడి రూపం చూడగానే కరీబియన్‌ దీవికి చెందినోడని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అతను పుట్టింది.. పెరిగింది.. క్రికెట్‌ ఆడింది కూడా అక్కడే. మూడేళ్ల ముందు అతను వెస్టిండీస్‌ ఆటగాడే. కానీ ఇప్పుడు ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ తరఫున ఆడేస్తున్నాడు. ఇంగ్లిష్‌ జట్టు తరఫున విదేశీయులు ఆడటం కొత్తేమీ కాదు కదా అనిపించొచ్చు! అయితే మిగతా వాళ్లు ఇంగ్లాండ్‌కు ఆడటం వేరు.. ఆర్చర్‌ ఆడటం వేరు! దీని వెనుక చాలా మలుపులే ఉన్నాయి. ఆ మలుపులేంటో చూద్దాం పదండి.

జోఫ్రా ఆర్చర్‌ తల్లి వెస్టిండియనే. అతడి తండ్రి మాత్రం బ్రిటన్‌కు చెందినవాడు. దీంతో ఆర్చర్‌కు బ్రిటిష్‌ పాస్‌పోర్ట్‌ కూడా ఉంది. అయితే అదున్నంతమాత్రాన అతను నేరుగా ఇంగ్లాండ్‌కు ఆడేయలేదు. అసలు ఆర్చర్‌కు ఇంగ్లాండ్‌కు వచ్చే, ఆ దేశానికి ఆడే ఉద్దేశం కొన్నేళ్ల కిందటి వరకు లేనే లేవు. అతను పుట్టింది పెరిగింది బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో. అతడి తండ్రి ఎన్నో ఏళ్ల కిందటే వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. దీంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాక వెస్టిండీస్‌కు ఆడటం లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆర్చర్‌. వయసు విభాగాల్లో సత్తా చాటిన అతను.. వెస్టిండీస్‌ తరఫున అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడాలని ఆశపడ్డాడు. అయితే ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుకున్నప్పటికీ అతడికి సెలక్టర్లు అవకాశమివ్వలేదు. ఇది అతడిని చాలా బాధపెట్టింది. అదే సమయంలో వెన్ను గాయం ఆర్చర్‌ను ప్రమాదంలో పడేసింది.

అతడి పుణ్యమా అని..
ఈ రోజు ఆర్చర్‌ ఇంగ్లాండ్‌కు ఆడుతున్నాడంటే అందుకు ముఖ్య కారణం క్రిస్‌ జోర్డాన్‌. అతను కూడా కరీబియన్‌ క్రికెటరే. అయితే చాలా ఏళ్ల కిందట వచ్చి ఇంగ్లాండ్‌లో స్థిరపడ్డాడు. దేశవాళీల్లో సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లోనూ అతడి ఆట చూశాం. అనుకోకుండా ఒకసారి జోర్డాన్‌ను కలవడం ఆర్చర్‌ జీవితాన్ని మలుపు తిప్పింది. వెస్టిండీస్‌ క్రికెట్లో తనకు అన్యాయం జరిగిందని బాధ పడుతున్న అతను.. అలిగి ఇంగ్లాండ్‌ వెళ్లిపోవాలనుకున్నాడు. జోర్డాన్‌ను ‘నేను కూడా నీలా ఇంగ్లాండ్‌కు ఆడొచ్చా’ అని అడిగాడు. తనకు బ్రిటిష్‌ పాస్‌పోర్ట్‌ ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించాడు. గాయం నుంచి కోలుకుంటున్న ఆర్చర్‌ను ఒకసారి నెట్స్‌లో బౌలింగ్‌ చేసి చూపమన్నాడు జోర్డాన్‌. అతడి నైపుణ్యం ఆకట్టుకుంది. దీంతో ఇంగ్లిష్‌ కౌంటీల్లో తాను ప్రాతినిధ్యం వహించే ససెక్స్‌ క్లబ్‌ యాజమాన్యానికి ఆర్చర్‌ గురించి చెప్పాడు. సానబడితే క్లబ్‌లో కీలక ఆటగాడవుతాడని చెప్పాడు. తర్వాత అక్కడి కోచ్‌ మార్క్‌ రాబిన్‌సన్‌ ఆర్చర్‌ను రప్పించి.. బౌలింగ్‌, బ్యాటింగ్‌ పరీక్షించాడు. అతడినీ ఈ కుర్రాడి ప్రతిభ ఆకట్టుకుంది. ఈ క్లబ్‌ సాయంతోనే ఆర్చర్‌ వెన్ను గాయం నుంచి కూడా కోలుకున్నాడు.

ఐపీఎల్‌ రేటు అదరహో..
అవకాశం దక్కడం కాదు.. దాన్ని సద్వినియోగం చేసుకోవడం కీలకం. ఆర్చర్‌ ఈ విషయంలో ఎప్పుడూ ముందే ఉంటాడు. 2016లో కౌంటీ క్రికెట్‌ ఆరంభించిన అతను.. ఆ సీజన్‌ అయ్యేసరికి హీరో అయిపోయాడు. బంతితో, బ్యాటుతో మెరుపులు మెరిపించిన తన పేరు కౌంటీల్లో మార్మోగేలా చేశాడు. దాదాపు 150 కిలోమీటర్ల వేగం, కచ్చితత్వంతో కూడిన అతడి బంతులకు బ్యాట్స్‌మెన్‌ బాగా ఇబ్బంది పడ్డారు. ఓ మ్యాచ్‌లో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 72 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో అప్పటిదాకా ఆర్చర్‌కు కాంట్రాక్టు ఇవ్వని ససెక్స్‌.. వెంటనే ఒప్పందం చేసుకుంది. వరుసగా రెండో సీజన్లోనూ రాణించడంతో అతడిపై ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల కన్ను పడింది. గత ఏడాది రాజస్థాన్‌ రాయల్స్‌ విపరీతమైన పోటీ మధ్య ఆర్చర్‌ను దాదాపు రూ.7 కోట్ల రేటు పెట్టి సొంతం చేసుకోవడం విశేషం.

ధనాధన్‌ ఫటాఫట్‌
కౌంటీల్లో, ఐపీఎల్‌లో ఆర్చర్‌ మెరుపులు చూశాక అతను ఏదో ఒక రోజు ఇంగ్లాండ్‌కు ఆడటం ఖాయం అనుకున్నారంతా! కానీ ఆ రోజులు ఇంత త్వరగా వస్తాయని ఆర్చర్‌ సైతం ఊహించి ఉండడు. విదేశీయుడెవరైనా వచ్చి నేరుగా ఇంగ్లాండ్‌కు ఆడేస్తానంటే కుదరదు. ఏడేళ్ల పాటు బ్రిటన్‌ పౌరుడిగా కొనసాగాలి. ఆ లెక్కన ఆర్చర్‌ ఇంగ్లాండ్‌కు ఆడేందుకు ఇంకో నాలుగేళ్లు ఎదురు చూడాల్సింది. కానీ అతడి కోసమే అన్నట్లుగా ఇంగ్లాండ్‌ బోర్డు నిబంధనను మార్చింది. ఏడేళ్ల వ్యవధిని మూడేళ్లకు కుదించింది. దీంతో ఈ ఏడాది మార్చిలోనే ఆర్చర్‌ ఇంగ్లాండ్‌కు ఆడేందుకు అర్హత సాధించాడు. అతడి ప్రతిభ ఇంగ్లిష్‌ సెలక్టర్లను ఎంతో కాలం ఆపలేదు. ఐపీఎల్‌లో అదరగొడుతున్న ఆర్చర్‌ను తర్వాతి నెలలోనే పాకిస్థాన్‌, ఐర్లాండ్‌ సిరీస్‌లకు ఎంపిక చేశారు. మేలో అతను అంతర్జాతీయ అరంగేట్రం చేసేశాడు. ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లోనే సత్తా చాటుకున్న అతడిని ప్రపంచకప్‌కూ ఎంపిక చేయక తప్పలేదు. ముందు ప్రకటించిన ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ జట్టులో ఆర్చర్‌ లేడు. కానీ రెండో దశలో అతడికి అవకాశం దక్కింది. ఆర్చర్‌కు చోటివ్వడం కోసం జట్టులో ఏ ఆటగాడినైనా తప్పించవచ్చని మాజీ ఆటగాడు ఫ్లింటాఫ్‌ చెప్పడం అతడిపై ఉన్న అంచనాలకు అద్దం పట్టేదే. ఈ అంచనాల్ని నిలబెడుతూ ప్రపంచకప్‌లో నిలకడగా రాణించాడు. టోర్నీ అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఇక ప్రపంచకప్‌ ఫైనల్‌ సూపర్‌ ఓవర్లో ఆర్చర్‌ ఒత్తిడి మధ్య ఎంత గొప్పగా బౌలింగ్‌ చేశాడో తెలిసిందే. ప్రపంచకప్‌ గెలవాలన్న దశాబ్దాల కలను నెరవేర్చి కష్టకాలంలో తనను ఆదుకున్న ఇంగ్లాండ్‌కు గొప్ప బహుమతే ఇచ్చాడు ఆర్చర్‌. ఈ ప్రదర్శన చూశాక ఇప్పుడు యాషెస్‌లోనూ అతడికి అవకాశమిచ్చింది ఇంగ్లిష్‌ బోర్డు.

క్రికెట్లో ఒక దేశానికి చెందిన ఆటగాడు.. ఇంకో దేశానికి ఆడొచ్చా?
ఒక దేశ జాతీయ జట్టుకు ఓ ఆటగాడు ప్రాతినిధ్యం వహించేందుకు ఐసీసీ కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ వ్యక్తి ఆ దేశంలో జన్మించి ఉండాలి. లేదా ఆ దేశ పౌరసత్వం కలిగి ఉండాలి. లేదా చివరి నాలుగేళ్లలో ఏడాదికి కనీసం 183 రోజుల చొప్పున ఆ దేశంలో నివసించి ఉండాలి. ఈ మూడు షరతుల్లో దేనికి లోబడి ఉన్నా ఆ ఆటగాడిని ఐసీసీ ఆ దేశం తరఫున పోటీ పడేందుకు అనుమతిస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నిబంధనల్ని ఐసీసీ సడలిస్తుంది కూడా. 2011 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాడైన ఎడ్‌ జాయ్స్‌ను ఐర్లాండ్‌ తరఫున పోటీ పడేందుకు ఇలాగే అనుమతించింది. అతడికి ఐరిష్‌ మూలాలుండటంతో పై మూడు షరతుల్లో వేటికీ లోబడి లేకున్నా ఐర్లాండ్‌కు ఆడేందుకు జాయ్స్‌ను అనుమతించింది ఐసీసీ. అయితే ఐసీసీ షరతులతో సంబంధం లేకుండా ఒక విదేశీయుడిని తమ దేశం తరఫున ఆడించే విషయంలో ఏ దేశానికా దేశంలో క్రికెట్‌ బోర్డులు ప్రత్యేకంగా నిబంధనలు పెట్టుకున్నాయి. భారత్‌ విషయానికొస్తే.. మన దేశ పౌరసత్వం ఉన్న వాళ్లనే ఏ క్రీడలో అయినా జాతీయ జట్టుకు ఆడేందుకు అనుమతిస్తారు. భారత క్రీడా మంత్రిత్వ శాఖ 2008లో ఈ మేరకు నిబంధన తెచ్చింది. దాన్ని అన్ని క్రీడా సంఘాలూ అనుసరిస్తున్నాయి. బీసీసీఐ కూడా మినహాయింపేమీ కాదు. విదేశీ మూలాలున్నప్పటికీ భారత్‌లో స్థిరపడి ఇక్కడి పౌరసత్వం పొందిన రోజర్‌ బిన్నీ, రాబిన్‌ సింగ్‌ లాంటి వాళ్లు భారత్‌కు ఆడారు. అయితే ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల మాదిరి కొన్నేళ్లు దేశంలో నివసిస్తే.. జాతీయ జట్టుకు ఆడే అర్హత పొందే అవకాశం భారత్‌లో లేదు. ఇంగ్లాండ్‌ ఇంతకుముందు తమ దేశంలో ఏడేళ్లు నివసించిన ఆటగాడిని జాతీయ జట్టులో ఆడేందుకు అనుమతించేది. ఈ మధ్యే ఆ వ్యవధిని మూడేళ్లకు కుదించింది. దీంతో అండర్‌-19 స్థాయి వరకు వెస్టిండీస్‌కు ఆడిన జోఫ్రా ఆర్చర్‌.. ఇప్పుడు ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించగలుగుతున్నాడు. ప్రస్తుత ఇంగ్లాండ్‌ జట్టులోని ఇయాన్‌ మోర్గాన్‌, మొయన్‌ అలీ, అదిల్‌ రషీద్‌.. మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ సహా చాలామందే విదేశీయులు ఇంగ్లాండ్‌కు వచ్చి కొన్నేళ్లు దేశవాళీల్లో ఆడి.. ఆపై జాతీయ జట్టుకు ఎంపికైన వాళ్లే. ఆస్ట్రేలియా జట్టులో ఖవాజా, న్యూజిలాండ్‌ టీంలో ల్యూక్‌ రాంకీ కూడా ఈ కోవలోని వాళ్లే. ఒక ఆటగాడు రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన ఉదంతాలు ప్రపంచ క్రికెట్లో చాలానే ఉన్నాయి. ఈ కోవలో 26 మంది ఆటగాళ్లుండటం విశేషం.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.