close

తాజా వార్తలు

పార్టీ ఏర్పాటుపై మౌనం వీడని రజనీ

‘లోక్‌సభ’పై పార్టీల దృష్టి

పొత్తులు, ఎత్తుల్లో తలమునకలు
ఈనాడు డిజిటల్‌, చెన్నై

పార్టీ ఏర్పాటుపై మౌనం వీడని రజనీ

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే పలు పార్టీలు కూటములపై దృష్టి సారించాయి. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు ఎలా వేయాలనే ఆలోచనలో నిమగ్నమయ్యాయి. సినీ నటుడు కమల్‌హాసన్‌ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. కానీ, మరో నటుడు రజనీకాంత్‌ మాత్రం ఇంకా పార్టీ ప్రారంభంపై ఓ స్పష్టత ఇవ్వడం లేదు. ఎన్నికల వేళ ఆయన అడుగులు ఎటు సాగుతాయనే అంశం ఆసక్తికరంగా మారింది.వరుస చిత్రాలతో వచ్చిన జోష్‌తో మరిన్ని సినిమాలపై దృష్టి నిలుపుతున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌... ఆ స్థాయిలో రాజకీయంగా అడుగులు వేయడం లేదు. ఏడాది క్రితం రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన ప్రకటన చేశారు. ఆ తర్వాత అనేక ప్రకటనలు, రజనీ మక్కల్‌ మండ్రం సభ్యులతో సమావేశాలు, క్రమశిక్షణ చర్యలు, ఇటీవల టీవీ ఛానల్‌ ప్రారంభం తదితర విషయాలతో హడావిడి కనిపించింది. పార్టీ ప్రారంభం విషయంలో మాత్రం ఆయన ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడటం, రాష్ట్రంలో ఇప్పటికే ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు అవకాశం, ప్రధాన పార్టీల్లోని పరిణామాలు ఇతర అంశాలు రజనీ రాజకీయ పార్టీ ప్రారంభం ఎప్పుడన్న అంశంపై మరింత ఆసక్తిని పెంచాయి. నూతన సంవత్సరంలో అలాంటి ప్రకటన చేస్తారని ఎదురు చూసిన ఆర్‌ఎంఎం సభ్యులు, అభిమానులకు నిరాశే మిగులుతోంది. ఆయన సోదరుడు ఇటీవల మాట్లాడుతూ.... త్వరలో రజనీకాంత్‌ పార్టీ ప్రారంభం ఉంటుందని నిరాశలో ఉన్నవారిలో కొంత జోష్‌ నింపే ప్రయత్నం చేశారు. కానీ రజనీకాంత్‌ అభిమానులు, ఆర్‌ఎంఎం సభ్యులు కూడా కొందరు పార్టీ ప్రారంభంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం రజనీ వ్యూహంపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఈ పరిణామాల మధ్యనే రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పొత్తులకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఇప్పటికే దాని మిత్రపక్షాలతో ముందుకు వెళ్లడానికి నిర్ణయించింది. అధికార పార్టీ సైతం ఫలితం ఏదైనా భాజపా నేతృత్వంలోని ఎన్డీయేతో కలిసి సాగేందుకు ప్రయత్నం చేస్తోంది. వారం రోజుల్లో ఈ పొత్తులపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మారిన పరిస్థితులు
దాదాపు సంవత్సరం క్రితం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులకు, ఇప్పటికి అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ మేరకు పరిణామాలు చోటుచేసుకున్నాయి. గతేడాది ఆరంభంలో అధికార అన్నాడీఎంకేలో పలువురు నాయకులు తమ ఆధిపత్యం చాటుకోవడానికి ప్రారంభమైన ప్రయత్నాలు క్రమంగా బలహీన పడుతూ వచ్చాయి. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నేతృత్వంలో కలిసికట్టుగా ముందుకు సాగి లోక్‌సభ, ఇతర ఎన్నికల్లో విజయం సాధించాలన్న స్థాయికి అధికార పార్టీ ఉంది. ఆ మేరకు పార్టీలోని సీనియర్‌ నాయకులు సైతం తమ వైఖరిని వెల్లడించారు. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కూడా గతేడాది దిగ్గజ నేత కరుణానిధిని కోల్పోయింది. ఆ లోటును కనిపించకుండా చేసిన కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ ఆ మేరకు పార్టీని ఈ సారి ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని పట్టుదలతో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో గెలుపొంది సంచలనం సృష్టించిన టీటీవీ దినకరన్‌ కూడా రాష్ట్రంలో ఐదు దశాబ్దాల అన్నాడీఎంకే, డీఎంకే పాలన తర్వాత ఏఎంఎంకేని అధికారంలోకి తీసుకురావాలన్న వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఈసారి ఎలాగైనా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ లోక్‌సభ స్థానాలు ఉన్న రాష్ట్రంలో సాధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని ఆశపడుతున్న భాజపా, కాంగ్రెస్‌లు కూడా స్థానిక పార్టీలతో పొత్తులపై దృష్టిపెట్టాయి. మిత్రపక్షం కాంగ్రెస్‌తోనే నడుస్తామని ఇప్పటికే స్పష్టత ఇచ్చిన డీఎంకే... ఆ మేరకు భాజపా కూటమిలో చేరబోమని ఆ పార్టీ అధినేత స్టాలిన్‌ తేల్చిపారేశారు. దీంతో పాత, నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకేతో ఎలాగైనా జట్టుకట్టాలన్న లక్ష్యంతో భాజపా పావులు కదిపింది. అందుకు అనుగుణంగా పరిస్థితులను సృష్టించి అన్నాడీఎంకేకు వేరే దారిలేకుండా చేసింది. ఈక్రమంలో ఆ రెండు పార్టీలు పొత్తు, పోటీ స్థానాలపై కసరత్తు ప్రారంభించాయి. ఇవి వారంలో తేలనుండగా... వీటితోపాటు పీఎంకే తదితర పార్టీలను కూడా తమతో చేర్చుకోవాలని నిర్ణయించాయి. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ, పొత్తు అంశాలను సరైన సమయంలో పార్టీ తేలుస్తుందని ఎంఎన్‌ఎం అధినేత కమల్‌హాసన్‌ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు అందరి దృష్టి రజనీకాంత్‌పై పడింది.

బరిలో నిలిచేనా?
రాజకీయ ప్రవేశ ప్రకటన సమయంలో ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని’ రజనీకాంత్‌ స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా పార్టీ ప్రారంభం నాటికి సంస్థాగతంగా బలోపేతం అవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు, అలానే లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో లోక్‌సభ ఎన్నికల బరిలో సూపర్‌స్టార్‌ పార్టీ నిలిచేనా... లేకుంటే బయట నుంచి ఏదైనా ఒక పార్టీకి మద్దతు ఇచ్చి తర్వాత అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని ప్రారంభించి పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడానికి ఆయన అడుగులు వేస్తున్నారా? అనే సందేహాలు నెలకొన్నాయి. గతేడాది చివరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత రజనీకాంత్‌లో తర్జనభర్జన మొదలైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు పార్టీని ప్రారంభించి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేకన్నా అసెంబ్లీ ఎన్నికల వైపే రజనీకాంత్‌ మొగ్గు చూపుతున్నట్లు పరిణామాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. 2017 డిసెంబరు 31న రజనీకాంత్‌ చేసిన రాజకీయ ప్రవేశ ప్రకటనలో కూడా రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పారని, అలానే రజనీ మక్కల్‌ మండ్రం సభ్యత్వంపై పూర్తిస్థాయిలో దృష్టిలో పెట్టి పార్టీ ప్రారంభానికి ముందే సంస్థాగతంగా బలోపేతం అవ్వాలన్న లక్ష్యంతో రజనీ అడుగులు వేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవడం, ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల ఇతర పార్టీ అధికారంలోకి వస్తే తలనొప్పులు తప్పవన్న ఆలోచన, ఇటీవల భాజపాకు వ్యతిరేకంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు వంటివి రజనీకాంత్‌ను ఆలోచనలో పడేసినట్లు చెబుతున్నారు. అందుకే ఆయన పార్టీ ప్రారంభంపై స్పష్టత ఇవ్వలేకపోతున్నట్లు రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.