close

తాజా వార్తలు

ఇప్పటికీ తేలని కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత!

దిల్లీ: రేపటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కానీ పార్లమెంటులో రెండో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌ మాత్రం ఇప్పటికీ లోక్‌సభ పక్షనేతను ప్రకటించలేదు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని పట్టుబడుతున్న రాహుల్‌ గాంధీయే ఈ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని ఇటీవల ఊహాగాలు వినిపించాయి. రాహుల్‌ నిష్క్రమణను పార్టీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాజపాను ఎదుర్కొనే సమర్థ నాయకుడు ఎవరన్న దానిపై పార్టీలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అయినా ఇప్పటికీ స్పష్టత రాలేదు. 

16వ లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేతగా వ్యవహరించిన మల్లికార్జున ఖర్గే ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో మరో నేతను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అందుకు గాంధీ కటుంబానికి విధేయుడిగా ఉండడంతో పాటు, హిందీ, ఆంగ్ల భాషలపై పట్టున్న నాయకుడు ఎవరన్న దానిపై పార్టీలో అంతర్మథనం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు శశిథరూర్‌, మనీశ్‌ తివారీ, బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్‌ రంజన్‌ చౌదరి, కేరళకు చెందిన కే.సురేశ్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో కొంతమందికి రెండు భాషలపై అంతగా పట్టులేని నాయకులు ఉన్నారు. కేరళకు చెందిన కే.సురేశ్‌.. పార్టీకి ఎంతో కాలంగా విధేయుడిగా ఉన్నారు. అయితే ఈయనకు హిందీ, ఇంగ్లీష్‌లో అంతగా ప్రావీణ్యం లేదు. బెంగాల్‌కు చెందిన అధిర్‌ చౌదరిది కూడా దాదాపు ఇదే పరిస్థితి. దీంతో వీరివురు రేసులో వెనకబడే అవకాశం ఉంది. 

ఇక మిగిలింది శశిథరూర్‌, మనీశ్‌ తివారీ. థరూర్‌కి ఆంగ్ల భాషలో ఉన్న ప్రావీణ్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ హిందీలో మాత్రం కాస్త వెనకబడే ఉన్నారు. దీనికి తోడు సునంద పుష్కర్‌ కేసు ఆయనకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనీశ్‌ తివారీకి అవకాశాలు మెండుగా ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు ఆయన సమర్థంగా నిర్వహించారు. అలాగే రెండు భాషలపై తివారీకి మంచి అవగాహన ఉండడం కలిసొచ్చే అంశం. సమావేశాలు ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో సభలో పార్టీ నేతతో పాటు, డిప్యూటీ లీడర్, చీఫ్‌ విప్‌, విప్‌ నియామకాలు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ ఎంపికల్లో ఉత్తర, దక్షిణాది సమీకరణాలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.