close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. శ్రీలంక ఉగ్రదాడి ఇస్లామిక్‌ స్టేట్‌ ముష్కరుల పనే

శ్రీలంక దారుణ మారణకాండ తమ పనేనని అరాచక ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఐఎస్‌ భావజాలం ప్రసారం చేసే అమాక్‌ వార్తా ఏజెన్సీలో ద్వారా ఈ విషయం వెల్లడించింది. అయితే ఇందుకు తగిన ఆధారాలు మాత్రం చూపలేదు. ‘శ్రీలంకలో మొన్న క్రైస్తవ బృందాలపై ఘోర దాడులు చేపట్టింది ఇస్లామిక్‌ స్టేట్‌ బృందం యోధులే’ అని అందులో ప్రకటించింది. కాగా దీనిపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఈస్టర్‌ పర్వదినాన క్రైస్తవులు ప్రార్థన చేస్తుండగా సంభవించిన వరుస బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 321కి చేరింది.

2. ప్రశాంతంగా ముగిసిన మూడో విడత పోలింగ్‌

సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 13 రాష్ట్రాలు,  రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 115 నియోజవకర్గాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున ఓట్ల పండుగలో పాల్గొన్నారు.  సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా మొత్తం  61.31శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా పశ్చిమ్‌ బంగలో 78.94 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. అత్యల్పంగా జమ్ముకశ్మీర్‌లో 12.46శాతం పోలింగ్‌ నమోదైంది.

3. రీవాల్యుయేషన్‌కు అంత సమయమా?: హైకోర్టు

తెలంగాణలో ఇంటర్‌ పరీక్ష ఫలితాల వివాదంపై బాలల హక్కుల సంఘం వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనికి ఎంత సమయం పడుతుందని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ని ప్రశ్నించింది. సుమారు 2 నెలలు పడుతుందన్న ఆయన వాదనపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫెయిలైన 3లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనానికి అంత సమయం ఎందుకని ప్రశ్నించింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై సోమవారం చెబుతామని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు.

4. ఏపార్టీకి ఓటేసినా భాజపాకే: అఖిలేశ్‌

దేశంలో చాలా పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంల్లో ఏ పార్టీ గుర్తుకు ఓటేసినా అవి కమలం గుర్తుకే పడుతున్నాయని యూపీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ ఆరోపించారు. మంగళవారం దేశంలోని 15 రాష్ట్రాల్లో 117 నియోజకవర్గాలకు మూడో విడత పోలింగ్‌ జరుగుతోంది. పలు రాష్ట్రాల్లో ఈవీఎంల వైఫల్యంపై పెద్దఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి.  ‘ ఈవీఎంలో ఏ పార్టీ గుర్తుకు ఓటేసినా మోసపూరితంగా భాజపాకే పడుతోంది. ఈవీఎంలను వినియోగంపై ఎన్నికల సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వలేదు. మొత్తం 350కి పైగా ఈవీఎంలను మార్చారు. రూ.50,000 కోట్లు ఖర్చుపెట్టి నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఇలాంటి మోసాలు జరగడం ఎంత వరకు సమంజసం? ’  అని అఖిలేశ్‌యాదవ్‌ అన్నారు.

5. శ్రీవారి నగలరవాణా దుమారంపై సీఎస్‌కు నివేదిక

తిరుమల శ్రీవారి నగల తరలింపులో వస్తోన్న ఆరోపణలపై విచారణ నివేదిక సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యానికి చేరింది. ఈ వ్యవహారంపై  విచారణ చేపట్టాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ను సీఎస్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో తితిదే ఈవో అనిల్‌ సింఘాల్‌తో పాటు విజిలెన్స్‌, పీఎన్‌బీ అధికారులను మన్మోహన్‌ విచారించారు. అనంతరం మంగళవారం సీఎస్‌తో భేటీ అయి విచారణ నివేదికను ఆయనకు అందజేశారు.

6. యువతులతో అసభ్య ప్రవర్తన: వినయ్‌ వర్మ అరెస్టు!

సూత్రధార యాక్టింగ్‌ స్కూల్‌ యజమాని వినయ్‌వర్మను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల పై దుస్తులు విప్పితేనే నటనలో శిక్షణ ఇస్తానంటూ తనను వినయ్‌ వర్మ వేధించాడని ఓ యువతి షీటీమ్‌ పోలీసులను ఆశ్రయించిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే, తన వద్దకు శిక్షణ కోసంవచ్చిన తొమ్మిది మంది యువతులతో ఆయన అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నారాయణగూడ పోలీసులు వినయ్‌వర్మపై సెక్షన్‌ 354ఏ (నిర్భయ యాక్ట్‌), 506, 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

7. స్వర్ణ కిరీటాల చోరీ నిందితుడి అరెస్టు

తిరుపతిలోని ప్రఖ్యాత గోవిందరాజ స్వామి ఆలయంలో బంగారు కిరీటాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సుమారు 80రోజుల పాటు విచారణ సాగినట్లు తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం మధ్యాహ్నం ఎస్పీ అన్బురాజన్‌ మీడియాకు వెల్లడించారు. విచారణలో భాగంగా ఆలయంలోని మొత్తం 237 సీసీ కెమెరాలను పరిశీలించామని, ఓ వ్యక్తి దొంగతనం చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ఖాందార్‌కు చెందిన ఆకాశ్‌గా గుర్తించామని చెప్పారు.

8. చందా కొచ్చర్‌కు ఈడీ సమన్లు

ఐసీఐసీఐ బ్యాంకు-వీడియోకాన్‌ రుణాల మంజూరు వ్యవహారంలో మనీలాండరింగ్‌ క్రిమినల్‌ కేసును ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మే 3న చందా కొచ్చర్‌, ఏప్రిల్‌ 30న దీపక్‌ కొచ్చర్‌, ఆయన సోదరుడు రాజీవ్‌లు విచారణాధికారి ఎదుట హాజరుకావాల్సి ఉంది. అంతేకాకుండా వారి వ్యక్తిగత, వృత్తి పరమైన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు తీసుకురావాల్సిందిగా వారికి తెలియజేసినట్లు ఈ కేసు విచారణతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులు వెల్లడించారు.

9. భారత క్రికెట్‌లో ధోనీ అత్యుత్తమైన ఆటగాడు.

ఐపీఎల్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ.. భారత క్రికెట్‌కు అత్యుత్తమ సేవలందించాడని కొనియాడాడు టీమిండియా మాజీ కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌. ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ కపిల్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాటల్లో.. ‘ధోనీ ఎంతకాలం క్రికెట్‌ ఆడతాడో ఎవరికీ తెలియదు. అలాగే అతడి శరీరం కూడా ఎంతకాలం పనిభారాన్ని తట్టుకుంటుందో తెలియదు. అతడిలా మరే ఇతర ఆటగాడు దేశానికి అత్యుత్తమ సేవలు అందించలేదు. మనం అతడిని గౌరవించి అభినందనలు తెలపాలి. ఈసారి కూడా ప్రపంచకప్‌ గెలుస్తాడని అనుకుంటున్నా’ అని కపిల్‌ పేర్కొన్నారు.

10. రూ.600లకే జియో బ్రాడ్‌బ్యాండ్‌, ల్యాండ్‌లైన్‌, టీవీ?

టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో ఒక సంచలనం. అతి తక్కువ ధరకే ఉచిత వాయిస్‌ కాల్స్‌, 4జీ డేటాను అందించి కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. కాగా, ప్రస్తుతం రిలయన్స్‌ జియో గిగాఫైబర్‌ను వివిధ పట్టణాలకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బ్రాడ్‌బ్యాండ్‌, ల్యాండ్‌లైన్‌, టీవీ కాంబోలను తీసుకురానున్నట్లు గతంలోనే జియో వెల్లడించింది. ఈ మూడింటి కాంబో ధర నెలకు రూ.600 నిర్ణయించవచ్చని  మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.