close

తాజా వార్తలు

మేం ప్రజలనే నమ్ముకున్నాం: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెరాస ప్రభుత్వం ప్రజలనే నమ్ముకుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. గత కాంగ్రెస్‌ పాలన కంటే తెరాస ప్రభుత్వం ఎంతో మేలని ప్రజలు చెబుతున్నారని అన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు తెరాస వైపే వచ్చిందన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై భట్టి విక్రమార్క చెప్పిన మాటలు అందరూ విన్నారు.. ఫలితమేంటో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. సాహసం, త్యాగాలమీదే తెరాస పుట్టిందని, రాజీనామాలు, సవాళ్లు ఎదుర్కోవడం ఇది కొత్తేం కాదని చెప్పారు.

తెలంగాణ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చినట్లు లెక్కలతో సహా వివరించామని, రాష్ట్ర ప్రగతి కోసం అవసరమైతే అప్పులు ఇంకా తెస్తామని వెల్లడించారు. అబద్ధాలు చెప్పాల్సిన ఖర్మ తెరాసకు పట్టలేదని కేసీఆర్‌ పేర్కొన్నారు. మరోవైపు వక్ఫ్‌బోర్డు వ్యవహారాలను సత్వరమే సరిదిద్దుతామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ల విషయమై ఇది వరకే సభలో తీర్మానం చేశామని, మరోమారు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.మెట్రో రైలును పాతబస్తీకి విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏదో ప్రమాదం వస్తోందని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని, అది వాళ్లకే వర్తిస్తుందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ మాకు నీతులు చెప్పక్కర్లేదు..

నైతికత గురించి కాంగ్రెస్‌ పార్టీ మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు. ఉద్యమ సమయంలో తెరాస ఎమ్మెల్యేలను ఏవిధంగా చేర్చుకున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. భాజపా కూడా నలుగురు రాజ్యసభ ఎంపీలను విలీనం చేసుకుందని ఆరోపించారు. గోవా, రాజస్థాన్‌లోనూ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను భాజపా కలుపుకుందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ బద్ధంగానే ఇతర పార్టీల సభ్యులను తెరాసలో విలీనం చేసుకున్నామన్నారు. విలీనం అయితే సాంకేతిక సమస్య ఉత్పన్నం కాదని ఎమ్మెల్యేలకు చెప్పామని తెలిపారు. నీటి లభ్యతలేని ప్రదేశంలో ప్రాజెక్టును ఎట్లాపెడతామని మండిపడ్డారు. జూరాల వద్ద నీటి లభ్యత పూర్తి స్థాయిలో లేదని గ్రహించామన్నారు. తెరాస రాకముందు ప్రతి ప్రాజెక్టునూ అప్పు తీసుకోకుండా కాంగ్రెస్‌ కట్టిందా? అని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని 51 ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీ పరిపాలించిందని గుర్తు చేస్తూ.. కాంగ్రెస్‌, తెదేపా హయాంలో పథకాల పేర్లు మాత్రమే మారాయని, కానీ, పరిపాలన మాత్రం ఇద్దరిదీ ఒక్కటే అని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రూపాయి ఇవ్వనని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నప్పడు... వీర లేరా? అని కాంగ్రెస్‌ సభ్యులను ఉద్దేశించి అన్నారు. ఇప్పుడున్న సభ్యులే అప్పట్లో మంత్రులు కాదా? అని ప్రశ్నించారు. ‘ బీసీలకు మంత్రిపదవి కావాలని కేంద్రాన్ని మేం డిమాండ్‌ చేశాం. మన్మోహన్‌ సింగ్‌, మోదీలను కలిసి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ డిమాండ్‌ చేశాం. రాష్ట్రానికి సంబంధించిన అనేక హక్కులను కేంద్రం తీసుకుంది. రాష్ట్రాలకు ఉన్న చాలా అధికారాలు కేంద్రం అధీనంలోనే ఉన్నాయి. గోవాలో జరిగిన జీఎస్టీ సమావేశంలోనూ రాష్ట్ర అధికారాలపై గొంతెత్తి మాట్లాడాం. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రాంతీయ పార్టీలే. భాజపా, కాంగ్రెస్‌ పెద్దల మాటలను రాష్ట్ర నేతలు పాటించటమే తప్ప మరోమాట లేదు. 50 ఏళ్ల కాలంలో కుల వృత్తులు ధ్వంసం జరిగినవి కాంగ్రెస్‌ హయాంలోనే. నక్సలైట్లు ఎవరి పరిపాలన కాలంలో పుట్టుకొచ్చారు?’ అంటూ కెంగ్రెస్‌పై కేసీఆర్‌ విరుచుకుపడ్డారు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.