close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. కేసీఆర్‌ ఎన్ని డెడ్‌లైన్‌లు పెట్టినా వెనక్కి తగ్గం! 

తెలంగాణలో నెల రోజులకు పైగా సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన డెడ్‌లైన్‌ ఈ రోజుతో ముగియనున్న నేపథ్యంలో ఐకాస నేతలు కీలక భేటీ నిర్వహించారు. జేఏసీ నేతలు, రాజకీయ పార్టీలు, సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్లు, ప్రజా సంఘాలతో ఈ అంశంపై చర్చించారు. ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసినా కార్మికులు చెక్కుచెదరలేదని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఎన్ని డెడ్‌లైన్‌లు పెట్టినా సమ్మె యథావిథిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి. 

2. ఉచిత ఇసుక పాలసీ తీసుకురండి: బాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక పాలసీ తీసుకురావాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన తెదేపా పార్టీ పరిశీలకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిర్మాణలు లేకపోవడంతో పనులు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

3. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు..

దేశవ్యాప్తంగా సీబీఐ 169చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. రూ.7000కోట్ల విలువ చేసే బ్యాంకు మోసాల కేసుల నేపథ్యంలోనే ఈ సోదాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంలో ఇప్పటి వరకు 35 కేసులు నమోదైనట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలు సహా దిల్లీ, గుజరాత్‌, హరియాణా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, దాద్రానగర్ హవేలీలోని పలు ప్రాంతాల్లో అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

4. మందుల కొరత లేకుండా చూడండి: జగన్

‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో దాదాపు 45వేల పాఠశాలలు బాగుచేస్తున్నామని, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. తర్వాత దశలో కళాశాలలు, పాలిటెక్నిక్‌, హాస్టళ్లను కూడా బాగుచేస్తామని అన్నారు. వైద్య, విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు కింద అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను కూడా బాగు చేస్తున్నామని,  మందుల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 510 రకాలకుపైగా మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

5. రాజధానిని పులివెందులకు మార్చుకోండి: పవన్‌

సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజధానిని పులివెందులకు మార్చుకుంటే నయమని వ్యాఖ్యానించారు. విశాఖలో నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్‌ మాట్లాడారు. కర్నూలులో హైకోర్టు పెడితే  పులివెందుల నుంచి వెళ్లిరావడం సులువుగా ఉంటుందన్నారు. దీంతో సీఎం జగన్‌కు ఖర్చు కూడా తగ్గుతుందని పవన్‌ ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

6. ముగిసిన విజయారెడ్డి అంత్యక్రియలు

దుండగుడి చేతిలో సజీవదహనమైన అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. నాగోలు శ్మశానవాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. గౌరవ సూచికంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. విజయారెడ్డి చితికి భర్త సుభాష్‌రెడ్డి నిప్పంటించారు. అంతిమయాత్ర పొడవునా రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

7. పీవీ సింధుకు మళ్లీ తొలిరౌండ్‌ షాక్‌

ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధుకు మరో షాక్‌! మరోసారి ఆమెకు తొలిరౌండ్లోనే నిరాశ ఎదురైంది. చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో తన కన్నా తక్కువ ర్యాంకు షట్లర్‌ పాయ్‌ యు (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడింది. ప్రపంచ ఆరో ర్యాంకర్‌ పీవీ సింధు 13-21, 21-18, 19-21 తేడాతో ఓటమి చవిచూసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

8. ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ

ప్రధాని నరేంద్రమోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. ఒడిశాలోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్‌కో థర్మల్‌ ప్లాంట్‌కు కేటాయించాలని లేఖలో సీఎం విజ్ఞప్తి చేశారు. విభజన తర్వాత సింగరేణి కాలరీస్‌ను తెలంగాణకు కేటాయించారని.. బొగ్గు నిల్వల్లో కనీస వాటానూ ఏపీకి ఇవ్వలేదని సీఎం జగన్‌ పేర్కొన్నారు. అదనపు విద్యుదుత్పత్తికి ఏటా 7.5 ఎంఎంటీఏలు అవసరమని లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

9. మార్కెట్‌లో దూసుకెళ్తోన్న ‘కియా సెల్టోస్‌’

ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన దక్షిణకొరియా సంస్థ కియా మోటార్స్‌కు చెందిన కియా సెల్టోస్‌కు అమ్మకాల్లో దూసుకెళ్తోంది. వివిధ వేరియంట్లలో వచ్చిన ఈ మేడిన్‌ ఆంధ్రా కారుకు క్రేజ్‌ పెరగడంతో అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆగస్టు 22న విడుదలైన ఈ కార్ల విక్రయాలు నెలనెలా పెరుగుతూ మార్కెట్‌లో దూసుకెళ్తున్నాయి. ఆగస్టు మాసంలో కియా సంస్థ 6236 కార్లను విక్రయించగా..  సెప్టెంబర్‌లో 7754, అక్టోంబర్‌ మాసంలో రికార్డు స్థాయిలో 12850 కార్లను విక్రయించినట్టు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

10. సినీనటుడు గొల్లపూడికి ఉపరాష్ట్రపతి పరామర్శ

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీనటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. చెన్నై పర్యటనలో ఉన్న వెంకయ్య.. గొల్లపూడి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. మారుతీరావు త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.