close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. మొదలైన కార్తీక పౌర్ణమి వేడుకలు

కార్తీక పౌర్ణమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. భారీగా తరలివస్తున్న భక్తుల కోసం తిరుపతిలోని కపిలతీర్థం శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో తితిదే ఘనంగా ఏర్పాట్లు చేసింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కపిలతీర్థానికి భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఇక చట్టపరిధిలోనే విచారించి తేలుస్తాం: హైకోర్టు

‘‘టీఎస్ఆ‌ర్టీసీ సమ్మె నేపథ్యంలో చర్చలు జరపాలంటూ ప్రభుత్వానికి, ఆర్టీసీకి, యూనియన్లకు కావాల్సినంత సమయమిచ్చాం. ఎవరూ తగ్గలేదు. చర్చలు జరపాలని కోర్టు ఎవరినీ ఆదేశించజాలదు. ఇక వ్యవహారాన్ని చట్టపరిధిలోని అంశాల ఆధారంగానే తేలుస్తాం’’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టు విచారణ జరిపి నేటికి వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. రాష్ట్రానికి నీలంసాహ్ని

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలంసాహ్ని నియామకానికి మార్గం సుగమం అయింది. ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారశాఖ కార్యదర్శిగా ఉన్న ఆమెను ఆ విధులనుంచి రిలీవ్‌ చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర నియామకాల కేబినెట్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. మీరూ భాగస్వాములు కండి

ఇసుక కొరతతో రాష్ట్రంలో నిర్మాణరంగం కుదేలై.. 125 రకాల వృత్తులు, వ్యాపారాలకు చెందిన 30 లక్షల మంది రోడ్డున పడ్డారని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 14న విజయవాడలోని ధర్నాచౌక్‌ వద్ద తాను ‘12 గంటల నిరసన దీక్ష’ చేపట్టనున్నట్లు వివరించారు. ఇసుక కొరత వల్ల నష్టపోతున్న 125 వృత్తుల, వ్యాపారాల ప్రతినిధులు దీనిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు సోమవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ‘రాజీనామాలు చేయకుంటే.. చావుడప్పులు కొడతాం’

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని లేనిపక్షంలో వారి ఇళ్ల ముందు చావు డప్పులు కొడతామని ఆర్టీసీ ఐకాస కో-కన్వీనర్‌ రాజిరెడ్డి హెచ్చరించారు. ఛలో ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చిన మహిళలపై పోలీసులు కొనసాగించిన దమనకాండకు నిరసనగా ఆర్టీసీ ఐకాస పిలుపు మేరకు సోమవారం ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (ఎల్బీనగర్‌)ల నివాసాల ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. కౌలు రైతులకు భరోసా గడువు పెంపు

రాష్ట్రంలో కౌలురైతులకు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేసేందుకు వచ్చేనెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించాలని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. కౌలురైతుల ఇబ్బందులను దృష్టిలోపెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్నదాతలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

7. సేనకు అందని ద్రాక్ష!

ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ల తోడ్పాటుతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సేనకు మద్దతు ఇచ్చే అంశంపై ఎన్‌సీపీతో మరిన్ని చర్చలు జరపాల్సి ఉందని కాంగ్రెస్‌ చల్లగా చెప్పడంతో అయోమయం మరింత పెరిగింది. దీంతో ఈసారి అవకాశం ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఎన్‌సీపీకి లభించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా సంసిద్ధత వ్యక్తంచేయాలని గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆ పార్టీకి సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ‘అయోధ్య రామాలయ ట్రస్టు’ ఏర్పాటుపై కేంద్రం కసరత్తు షురూ

సుప్రీంకోర్టు సూచించిన ‘అయోధ్య రామాలయ ట్రస్టు’ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు ఆరంభించింది. అధికారుల బృందం సోమవారం సుప్రీం తీర్పుపై అధ్యయనం ఆరంభించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ట్రస్టు ఏర్పాటుకు ఎలా ముందుకెళ్లాలి? ఆలయ నిర్మాణ విషయంలో సాంకేతికంగా అనుసరించాల్సిన పద్ధతులేంటి? అన్న అంశాలపై న్యాయశాఖ, అటార్నీ జనరల్‌ అభిప్రాయాలను వారు కోరనున్నట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. విద్యుత్తు విమానం ఆవిష్కరణ

కాలుష్యానికి తావులేని, నిశ్శబ్ద విమానయానానికి పునాదులు వేసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) అడుగులు వేస్తోంది. పూర్తిగా విద్యుత్‌తో నడిచే తన తొలి ప్రయోగాత్మక విమానాన్ని ఆ సంస్థ ఆవిష్కరించింది. వచ్చే ఏడాది ఇది గగనవిహారం చేయనుంది. ఎక్స్‌-57 ‘మ్యాక్స్‌వెల్‌’ అనే విమానం 2015 నుంచి అభివృద్ధి దశలో ఉంది. ఇటలీకి చెందిన పి2006టీ అనే లోహవిహంగానికి మార్పులు చేర్పులు చేసి నాసా దీన్ని సిద్ధం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. సౌరభ్‌కు రజతం

యువ సంచలనం సౌరభ్‌ చౌదరి ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం కైవసం చేసుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగం ఫైనల్లో 244.5 పాయింట్లు సాధించిన అతడు రెండో స్థానంలో నిలిచాడు. ఉత్తర కొరియా షూటర్‌ కిమ్‌ సాంగ్‌ ప్రపంచ రికార్డు స్కోరు (246.5)తో స్వర్ణం నెగ్గాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.