close

తాజా వార్తలు

వల్సాద్‌ లోక్‌సభ స్థానం ‘అదరహో’...

గాంధీనగర్‌: గుజరాత్‌లోని వల్సాద్‌ లోక్‌సభ నియోజక వర్గానికి దేశంలోనే ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ పార్టీకి చెందిన అభ్యర్థి విజయం సాధిస్తారో కేంద్రంలో ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం ఉంది. ఈ సారి కూడా ఈ విషయం రుజువైంది. భాజపా అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ కేసీ పటేల్ ఈ స్థానం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, వల్సాద్‌ అభ్యర్థి జీతూ చౌదరిపై 3.53 లక్షల ఓట్ల ఆధిక్యం భాజపా అభ్యర్థికి వచ్చింది. కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలోనే మరోసారి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ‘నిజమే.. ఇది చాలా పవిత్రమైన స్థానం. ఇక్కడ విజయం సాధించిన పార్టీయే కేంద్రంలోనూ విజయం సాధిస్తుందని మరోసారి రుజువైంది’ అని పాటిల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అందరూ ‘అదరహో’ అనేలా ఈ స్థానం గుర్తింపు తెచ్చుకుంది. గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలున్నాయి. వల్సాద్‌ స్థానం ఎస్సీ రిజర్వ్.   

* 1977లో మొరార్జీ దేశాయ్‌ ఆధ్వర్యంలో కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికల్లో వల్సాద్‌ నుంచి ఆ పార్టీ నేత ననుభాయి పటేల్ గెలిచారు.

* 1980 నుంచి 1989 మధ్య మొదట ఇందిరా గాంధీ, ఆ తర్వాత రాజీవ్‌ గాంధీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కొనసాగింది. ఆ సమయంలో కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌ భాయి పటేల్‌ వల్సాద్‌లో ఎంపీగా గెలిచారు.

* 1989లో వీపీ సింగ్ ఆధ్వర్యంలో జనతాదళ్‌ ప్రభుత్వం ఏర్పడింది. ఆశ్చర్యంగా ఆ ఎన్నికల్లో అదే పార్టీ అభ్యర్థి అర్జున్‌భాయి పటేల్‌ గెలుపొందారు. 

* 1991లో మళ్లీ ఎన్నికలు జరగగా కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ భాయ్‌ పటేల్‌ విజయం సాధించారు. పీవీ నర్సింహరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.     

* 1996లో భాజపా అభ్యర్థి వల్సాద్‌లో గెలిచారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఆధ్వర్యంలోని భాజపా కేంద్రంలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

* 1998, 1999ల్లోనూ ఇక్కడ భాజపా అభ్యర్థి గెలిచారు. కేంద్రంలో వాజ్‌పేయీ ప్రభుత్వం ఏర్పాటైంది.

* 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి కిషన్‌ పటేల్ గెలిచారు. కేంద్రంలో మన్మోహన్‌ సింగ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

* 2009లోనూ కిషన్‌ పటేల్‌ వల్సాద్‌లో విజయం సాధించారు. మళ్లీ కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏ-2 ప్రభుత్వం వచ్చింది. 

* కాంగ్రెస్‌ నేత, రెండు సార్లు ఎంపీగా గెలిచిన కిషన్‌ పటేల్‌ను 2014 లోక్‌సభ ఎన్నికల్లో కేసీ పటేల్ ఓడించారు. కేంద్రంలో భాజపా సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈ సారి కూడా అదే జరిగింది. 

 


 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.