close

తాజా వార్తలు

మహిమ ముగిసినట్లేనా..!

ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌లో భారత్‌ ప్రయాణానికి అనూహ్యంగా సెమీస్‌లోనే తెరపడింది. ఆర్తనాదాలు అయిపోయాయి. విశ్లేషణలు పూర్తయ్యాయి. తర్వాతేంటి? మామూలుగా అయితే భారత్‌ ఆడే తర్వాతి సిరీస్‌ మీద అందరి దృష్టీ నిలిచి ఉండాలి! కానీ ఇప్పుడు భారత క్రికెట్‌ అభిమానులందరి చర్చలూ ధోని చుట్టూనే తిరుగుతున్నాయి! ఇంతకీ అంతర్జాతీయ క్రికెట్లో ధోని ప్రస్థానం ముగిసిందా లేదా? అతను చివరి మ్యాచ్‌ ఆడేశాడా? ఆడబోతున్నాడా? అసలతను రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నాడా లేదా? ప్రకటించేట్లయితే ఎప్పుడు? ఈ ప్రశ్నలు అభిమానుల మెదళ్లను తొలిచేస్తున్నాయి! ధోని ఆట నచ్చక అతను రిటైర్‌ కావాలని డిమాండ్‌ చేసేవాళ్లు కొందరైతే.. అతడికేం తక్కువ, రిటైర్మెంట్‌ వద్దే వద్దంటున్న వాళ్లు ఇంకొందరు.. ఆట ఎలా ఉన్నా ధోని రిటైర్మెంట్‌ అనివార్యం అంటున్నారు మరికొందరు! ఇంతకీ ధోని మనసులో ఏముంది.. అతనేం చేయబోతున్నాడు..?

ప్రపంచకప్‌తోనే ధోని అంతర్జాతీయ కెరీర్‌ ముగియొచ్చన్నది అందరూ అంచనా వేసిన విషయం. భారత క్రికెట్‌కు ఎనలేని సేవలందించిన ధోని కోసం టీమ్‌ఇండియా కప్పు గెలిచి అతడికి ఘనమైన వీడ్కోలు పలుకుతుందని అభిమానులు ఆశించారు. అదే జరిగితే కప్పు గెలవగానే ధోని తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని కూడా ప్రకటించేవాడేమో! కానీ ఊహించనిది జరిగింది. భారత జట్టు ఫైనల్‌ కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ మ్యాచ్‌ ముగిసిన కొన్ని నిమిషాల నుంచే ధోని రిటైర్మెంట్‌ గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మ్యాచ్‌ రోజు రాత్రే మహి తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ధోని ఏమీ స్పందించలేదు. మహి రిటైర్మెంట్‌ గురించి కోహ్లీని అడిగితే.. అతను తమకేమీ చెప్పలేదన్నాడు. ధోని మద్దతుదారులేమో అతడిప్పుడే రిటైర్‌ కావద్దంటూ సామాజిక మాధ్యమాల్లో ఉద్యమాలు చేస్తున్నారు.

ప్రపంచకప్‌లో విఫలమయ్యాడా?
ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా వరుసగా గెలుస్తున్నా సరే.. ధోని బ్యాటింగ్‌ విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ధోని బ్యాటింగ్‌ వేగం గురించి ఎడతెగని చర్చ నడిచింది. కానీ అతను ఏ పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేశాడన్నది పట్టించుకోకుండా కొందరు విమర్శకులు అతడిపై పడిపోయారు. మొత్తం 8 మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్‌ చేసిన ధోని.. 45.50 సగటుతో 273 పరుగులు చేశాడు. భారత మిడిలార్డర్లో ఎక్కువ పరుగులు అతడివే. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన అతను ఒక పరుగుకే వెనుదిరిగాడు. మిగతా మ్యాచ్‌లన్నింట్లో చెప్పుకోదగ్గ స్కోర్లే చేశాడు. అయితే అఫ్గానిస్థాన్‌, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ల్లో అవసరమైనపుడు బ్యాట్‌ ఝులిపించలేకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. మిగతా వాటిలో కొన్ని ఇన్నింగ్స్‌లను కూడా వేలెత్తి చూపిన వాళ్లు లేకపోలేదు. వెస్టిండీస్‌పై 61 బంతుల్లో 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిస్తే ఇదేం ఇన్నింగ్స్‌ అన్నారు. కానీ వెస్టిండీస్‌ 143 పరుగులకే కుప్పకూలితే కానీ ఆ పిచ్‌పై బ్యాటింగ్‌ ఎంత కష్టమో అర్థం కాలేదు. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో ధోని ఆటను కూడా తప్పుబట్టిన వాళ్లున్నారు. ముందు నుంచి ధోని హిట్టింగ్‌ చేస్తే చివర్లో పరిస్థితి అంత కష్టమయ్యేది కాదన్న లాజిక్‌ కూడా తీశారు. కానీ అప్పటికే ఆరు వికెట్లు పడ్డాయి. ధోని, జడేజాల తర్వాత బ్యాట్స్‌మన్‌ లేడు. వీళ్లిద్దరిలో ఒకరు ఔటవడం ఆలస్యం.. భారత్‌ కుప్పకూలేదే! చివర్లో అదే జరిగింది. ఒకవేళ ధోని షాట్‌కు ప్రయత్నించి ఔటై ఉంటే.. బాధ్యతారాహిత్యంగా ఆడి ఔటయ్యాడనేవారేమో! అసలు అవతల ధోని ఉండబట్టే జడేజా ధీమాగా షాట్లు ఆడగలిగాడన్నది వాస్తవం. జడేజాకు మార్గనిర్దేశం చేస్తూ సాగాడు మహి. జడ్డూ అంత మంచి ఇన్నింగ్స్‌ ఆడటంలో అతడి పాత్ర కీలకం. ధోని ముందు వచ్చి అవతలి ఎండ్‌లో ఉండుంటే.. పంత్‌ గుడ్డిగా షాట్‌ ఆడేవాడు కాదన్న గంగూలీ మాట ఇక్కడ ప్రస్తావనార్హం. ధోని జట్టుకు చేకూర్చే విలువ ఏంటో సూచించే వ్యాఖ్య ఇది. కాబట్టి సెమీస్‌లో భారత్‌ను గెలిపించనంత మాత్రాన మహి ఇన్నింగ్స్‌ను తక్కువగా చూడలేం. ఒకప్పుడు అసాధారణ బ్యాటింగ్‌ విన్యాసాలతో తనకు తానే ఉన్నత ప్రమాణాలు నిర్దేశించుకున్నాడు మహి. దీంతో అతడి నుంచి ప్రతిసారీ అద్భుతాలు ఆశించడం అందరికీ అలవాటైపోయింది. ఆ స్థాయికి ఏమాత్రం తగ్గినా అతడిని విమర్శించేస్తున్నారు. ఎంతటి ఆటగాడికైనా 37-38 ఏళ్ల వయసులో చురుకుదనం తగ్గడం, బ్యాటింగ్‌పై ప్రభావం చూపడం సహజం! మహి కూడా అందుకు మినహాయింపు కాదు! అయితే గతంలో జట్టు కోసం పడ్డ కష్టాన్ని, సాధించిన ఘనతల్ని మరిచిపోయి ప్రస్తుత ఆటపై శూలశోధన జరిపి ధోనీని నిందించడం సబబేనా?
 
ఉంటానంటే ఉండనిస్తారా?
ఒకవేళ మహి ఇంకా కొనసాగాలని కోరుకుంటే జట్టు యాజమాన్యం ఎలా స్పందిసుందో చెప్పలేం. సచిన్‌ అంతటి వాడే 2011 ప్రపంచకప్‌ విజయానంతరం వన్డే జట్టులో ఇంకా కొనసాగుతుంటే రిటైర్మెంట్‌ కోసం సెలక్టర్ల నుంచి ఒత్తిడి ఎదుర్కొన్నాడని, అందుకే ఉన్నట్లుండి వన్డేల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని అప్పట్లో వార్తలొచ్చాయి. మరి ధోని ఇంకా ఆడతానంటే బీసీసీఐ ఆడనిస్తుందా అన్నది సందేహం! ఒక ప్రపంచకప్‌ ముగియగానే తర్వాతి ప్రపంచకప్‌కు సన్నాహాలు మొదలైపోతాయి. యువ ఆటగాళ్లను తీర్చిదిద్దుకునే ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి ధోనీలో ఇంకా ఆట ఉన్నా, అతను కొనసాగే పరిస్థితులైతే భారత జట్టులో ఇప్పుడు లేవు! కాకపోతే తమ ఆరాధ్య ఆటగాళ్లు మైదానంలో మ్యాచ్‌ ఆడుతూ ఘనంగా వీడ్కోలు తీసుకోవాలని ఆశిస్తారు అభిమానులు. ధోని లాంటి దిగ్గజానికి ఆ గౌరవం దక్కాలన్నది వారి అభిప్రాయం. మరి ధోనీలో ఆ కోరిక ఉందో లేదో? మహి గురించి తెలిసిన వాళ్లయితే.. అతను చడీచప్పుడు లేకుండా ఏదో ఒక రోజు రిటైర్మెంట్‌ బాంబు పేలుస్తాడని అంచనా వేస్తున్నారు. ప్రపంచకప్‌లో చివరి మ్యాచ్‌ అవ్వగానే ప్రకటన చేస్తే వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆట నుంచి తప్పుకున్నట్లయ్యేది! అందుకే మహి ఆగాడేమో! అయితే ధోని కెరీర్‌ ముగింపు ఎలా ఉన్నా.. అతడి గొప్పదనం రవ్వంతైనా తగ్గదు. ఆటగాడిగా, వికెట్‌ కీపర్‌గా, కెప్టెన్‌గా, వ్యూహకర్తగా మహి ఘనతలకు సరితూగే క్రికెటర్లు ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే చాలా అరుదుగా కనిపిస్తారు. కెరీర్‌ చరమాంకంలో కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నంత మాత్రాన ధోనీని తక్కువ చేయలేం. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ అతనొక ఛాంపియనే!

ఇన్నాళ్లూ ఉన్నది అతడి కోసం కాదు..
ఇంతకీ ధోని ఇప్పుడే రిటైరవుతాడా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. నిజానికి ధోని మనస్తత్వం ప్రకారం చూస్తే అతనింకా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతుండటమే ఆశ్చర్యం. టెస్టుల్లో ఇంకా ఎంతో ఆట మిగిలున్నా.. విరాట్‌ నాయకత్వ స్థానాన్ని అందుకోవడానికి అర్హత సాధించాడని, జట్టుకు తన అవసరం లేదని అర్థమవగానే.. ఆస్ట్రేలియా సిరీస్‌ (2014) మధ్యలోనే సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడం ధోనీకే చెల్లింది. ఆ లెక్కన చూస్తే ఇంకో అయిదేళ్ల తర్వాత కూడా మహి వన్డేల్లో కొనసాగుతుండటం అనూహ్యమే. అయితే ప్రపంచకప్‌లో తన అనుభవం ఎన్నో రకాలుగా జట్టుకు అవసరం పడుతుందనే అతను ఆటలో కొనసాగాడు. బ్యాట్స్‌మన్‌గా, వికెట్‌ కీపర్‌గా, వ్యూహకర్తగా ధోని చేకూర్చే విలువను గుర్తించే జట్టు కూడా అతనుండాలని కోరుకుంది. ఇప్పటికీ జట్టులో కొనసాగడానికి ఏ రకంగా చూసినా మహి అర్హుడే! కానీ భవిష్యత్‌ దిశగా ఆలోచిస్తే మహి ఇక తప్పుకుని తన స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిందే!


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.