close

తాజా వార్తలు

ఇది క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌

ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల భావోద్వేగ స్పందన

లండన్‌: ఇంగ్లాండ్‌ జట్టు దశాబ్దాల కల నేరవేరింది. ఇయాన్‌మోర్గాన్‌ సేన చరిత్ర సృష్టించింది. క్రికెట్‌ పుట్టినిల్లు ఇంగ్లాండ్‌ తొలిసారిగా ప్రపంచకప్‌ను ముద్దాడింది. లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లాండ్‌ X న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన ఐసీసీ 12వ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో విజయం దోబూచులాడిన వేళ నాలుగేళ్ల శ్రమకు సరైన ఫలితం దక్కింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి ఇరు జట్లూ సమాన స్కోర్‌ సాధించగా మ్యాచ్‌ టైగా నిలిచింది. తర్వాత సూపర్‌ ఓవర్‌లోనూ సమాన స్కోర్లు సాధించడంతో క్రికెట్‌లోని అసలు సిసలైన మజాను అభిమానులు రుచి చూశారు. ఈ నేపథ్యంలో ఎక్కువ బౌండరీలు బాదిన ఆతిథ్య జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల పోరాట పటిమ ఎంత పొగిడినా తక్కువే. ఇంగ్లాండ్‌ విశ్వవిజేతగా నిలిస్తే న్యూజిలాండ్‌ క్రికెట్‌ ప్రేమికుల మనసు గెలిచింది. ఇంగ్లాండ్‌ విజయంలో కొసమెరుపు ఏంటంటే ఆ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఇతర దేశాల నుంచి వలస వచ్చినవారే. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే.. కివీస్‌ జట్టుకు ప్రపంచకప్‌ను దూరం చేసిన బెన్‌స్టోక్స్‌ మాతృదేశం కూడా న్యూజిలాండే.

మ్యాచ్‌ అనంతరం ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఏమన్నారంటే..

ఈ సమయంలో మాటలు రావడంలేదు. విశ్వవిజేతలుగా నిలవాలని నాలుగేళ్లుగా శ్రమించి సాధించాం. ఇప్పుడు ఛాంపియన్లుగా నిలవడం అద్భుతంగా ఉంది. ఇలాంటి గొప్ప మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌ క్రికెట్‌ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోతుంది. న్యూజిలాండ్‌కి జీవితకాలం క్షమాపణ చెబుతుంటా(ఆఖరి ఓవర్‌లో ఓవర్‌ త్రోకు). సూపర్‌ ఓవర్‌లో జోఫ్రాఆర్చర్‌ దగ్గరికి వెళ్లి ఒక్కటే విషయం చెప్పాను. ఈ ఓవర్‌ ఒక్కటే నీ భవితవ్యాన్ని నిర్ణయించదు. నేను ఇంతకన్నా దారుణ పరిస్థితుల్ని ఎదుర్కొన్నా (2016 టీ 20 ప్రపంచకప్‌లో). ఇక్కడ ఏం జరిగినా అది మన చేతుల్లో లేదు. ఇక చివరగా నా వెన్నంటే ఉండి సహకరించిన కుటుంబసభ్యులు, అభిమానులకు ధన్యవాదాలు.

-బెన్‌స్టోక్స్‌

ఈ విజయం అద్భుతంగా ఉంది. న్యూజిలాండ్‌ జట్టు ఓటమిపై విచారం వ్యక్తం చేస్తున్నా. విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడింది. బెన్‌స్టోక్స్‌ బ్యాటింగ్‌తో పాటు సూపర్‌ ఓవర్‌లో మా ఆటగాళ్ల ప్రదర్శన చాలా బాగుంది. కివీస్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. మ్యాచ్‌ మధ్యలో మమ్మల్ని అనేకసార్లు ఒత్తిడికి గురిచేశారు. కానీ నేను, బెన్‌స్టోక్స్‌ మంచి భాగస్వామ్యం నమోదు చేశాం. లార్డ్స్‌ మైదానంలో ఆడటం గొప్పగా ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానుల మధ్య ఇలా గెలవడం బాగుంది. దీన్ని మాటల్లో చెప్పడం కష్టంగా ఉంది.

-జానీ బెయిర్‌స్టో

ఈ విజయం నమ్మశక్యంగా లేదు. ఈ ఒక్క మ్యాచ్‌తో మొత్తం క్రికెట్‌నే చూశాననిపిస్తుంది. ఇలాంటి ఆట ఎప్పుడూ చూడలేదు. ఇదో అత్యద్భుతమైన విజయం. బ్యాటింగ్‌ చేస్తుండగా ఆఖరి వరకు పోరాడితే రన్‌రేట్‌ పెద్ద సమస్య కాదనిపించింది. మంచి భాగస్వామ్యం చేసి న్యూజిలాండ్‌పై ఒత్తిడి తేవాలనుకున్నాం. అందుకు విలువైన భాగస్వామ్యం నెలకొల్పాలని భావించాం.

-జోస్‌బట్లర్‌

ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇలాంటి టోర్నమెంట్‌ను ఎప్పుడూ చూడలేదు. గ్రూప్‌ దశలో అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నాం. ఒత్తిడిని జయించి గెలుపొందాం. బెన్‌స్టోక్స్ పట్ల గర్వంగా ఉంది. అతడు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ఇక్కడిదాకా వచ్చాడు. ఇప్పుడతడిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.- జోరూట్‌

 

ఇదో అద్భుతమైన మ్యాచ్‌. ఇలా ముగించడం చాలా బాగుంది. కివీస్‌ ఆటగాళ్లకు హ్యాట్సాఫ్‌. ఇప్పుడు జాబిల్లి మీద విహరిస్తున్నట్లు ఉంది. నేను ఔటైనప్పుడు వేరే బ్యాట్స్‌మెన్‌ ఉన్నారని తెలుసు. తప్పకుండా వాళ్లు గెలిపిస్తారనుకున్నా.

-లియామ్‌ ప్లంకెట్‌

మ్యాచ్‌ టైగా నిలవడంతో సూపర్‌ ఓవర్‌ నేనే వేస్తానని ఊహించా. నా జీవితంలో ఇదే అతిపెద్ద విజయం. ఒకవేళ మేం గెలవకపోయుంటే చాలా బాధపడేవాడిని. ఇప్పటికీ నా గుండె వేగంగానే కొట్టుకుంటుంది. అయితే సూపర్‌ ఓవర్‌ వేయకముందే స్టోక్స్‌ నా దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పాడు.- జోఫ్రా ఆర్చర్‌

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.