close

తాజా వార్తలు

గాలి కూట విషం! 

గాలి కూట విషం! 

గాలి కూట విషం! 
 

కాదేదీ వాయు కాలుష్య పంజాకతీతం.

ఒక్క ఊపిరితిత్తులనే కాదు.. గుండె, మెదడు వంటి కీలకావయవాలన్నింటినీ ఇప్పుడిది ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  గాల్లోని ప్రాణవాయువును హరిస్తూ.. మనల్ని ‘విష సుడిగుండం’లోకి నెడుతోంది. ఆస్థమా, క్షయ, గుండెపోటు, పక్షవాతం, మతిమరుపులాంటి సమస్యలెన్నింటినో మోసుకొస్తోంది.

కాబట్టే ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజాగా వాయు కాలుష్యాన్ని ‘కొత్తరకం పొగాకు’గానూ వర్ణించింది. పొగ తాగటం మూలంగా సంభవించే అనర్థాలన్నీ వాయు కాలుష్యంతోనూ దండెత్తుతున్నాయని అన్యాపదేశంగా హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో వాయు కాలుష్య విపరీత ప్రభావాలు, అనర్థాలపై సమగ్ర కథనం ఈవారం మీకోసం.

గాలి కూట విషం! న ఒంట్లో ప్రతి కణానికీ ఆక్సిజన్‌ అత్యవసరం. ఇది ఏమాత్రం కొరవడినా కణాలన్నీ జావగారిపోతాయి. ఇంతటి కీలకమైన ఆక్సిజన్‌ మనం శ్వాస ద్వారా పీల్చుకునే గాలి నుంచే లభిస్తుంది. ఇది ముందుగా ఊపిరితిత్తుల్లోకి.. అక్కడ్నుంచి రక్తంలోకి చేరుకొని.. హిమోగ్లోబిన్‌తో జతకట్టి అన్నికణాలకు కొత్త ఊపిరిని పోస్తుంది. మరి అలాంటి ప్రాణవాయువే నిర్వీర్యమైపోతే? కాలుష్య కారకాలతో నిండిపోయి విషతుల్యమైపోతే? అవయవాలన్నీ చేవలుడిగిపోవటం ఖాయం. వాయు కాలుష్యం ఇప్పుడు మనల్ని ఇలాంటి విపరీత స్థితిలోకే నెడుతోంది. దీని దుష్ప్రభావాలను ఇప్పటికే చవిచూస్తున్నాం కూడా. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం అత్యధికంగా గల 20 నగరాల జాబితాలో హైదరాబాద్‌ కూడా ఒకటి కావటం దురదృష్టకరం. ఇక దేశ రాజధాని దిల్లీ పరిస్థితి మరింత దయనీయం. వాయు కాలుష్య దుష్ప్రభావాల వల్ల దిల్లీ వాసుల ఆయుర్దాయం సగటున 4.3 ఏళ్లు తగ్గుతుండటం గమనార్హం. అంటే మనం గాలిని కాదు. విష వాయువును పీలుస్తున్నామన్నమాట. ఆరోగ్యం అనగానే అంతా పౌష్టికాహారం, పరిశుభ్రమైన నీరు గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. గాలి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ స్వచ్ఛమైన గాలి మీదా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. తిండి తినకుండా కొద్దిరోజులు బతకొచ్చు. నీరు లేకుండా కొన్ని గంటలు జీవించొచ్చు. కానీ గాలి లేకపోతే? కొన్ని క్షణాలైనా ప్రాణాలు నిలబడవు.  కాబట్టి వాయు కాలుష్యంతో ముంచుకొస్తున్న సమస్యలపై అవగాహన కలిగుండటం    మన తక్షణావసరం. కాలుష్యాన్ని కట్టడి చేయటం ప్రతి ఒక్కరి కర్తవ్యం.

 

గాలి కాలుష్యం మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మంది ప్రాణాలు కోల్పోతుండగా.. వీరిలో సుమారు 24 లక్షల మంది భారతీయులే.

మనదేశంలో ఏటా 10 లక్షలకు పైగా మంది బయటి కాలుష్యంతో.. మరో 10 లక్షల మంది ఇంటి కాలుష్యంతో మృత్యువాత పడుతున్నారని అంచనా.

ముక్కు దురద: కాలుష్య కారకాలు ముక్కులో ప్రవేశించినప్పట్నుంచే అనర్థాలు పొడసూపుతాయి. ఇవి ముక్కు గోడల్లో అలర్జీని ప్రేరేపించటం వల్ల మంట, నీరు కారటం, దురద వంటివి మొదలవుతాయి. కొందరిలో ముక్కు చుట్టూ గల గాలి గదుల్లోనూ సమస్య (సైనసైటిస్‌) తెచ్చిపెట్టొచ్చు. కాలుష్య కారకాలు స్వరపేటికనూ చికాకుకు గురిచేయొచ్చు. దీంతో గొంతునొప్పి, నస వంటివి వేధిస్తాయి. 
ఆస్థమా, సీవోపీడీ: దుమ్ము, ఓజోన్‌, బెంజీన్‌ వంటివి శ్వాసనాళాలను చికాకుకు గురిచేస్తాయి. దీంతో శ్వాసనాళాల గోడలు ఉబ్బిపోయి లోపలి మార్గం కుంచించుకుపోతుంది. ఇది ఆస్థమాకు దారితీస్తుంది. ఫలితంగా దగ్గు, పిల్లికూతలు, ఛాతీలో బరువుగా ఉండటం వంటి లక్షణాలు వేధిస్తాయి. కొందరిలో వాపు ప్రక్రియ ప్రేరేపితం కావటం వల్ల క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీవోపీడీ) తలెత్తొచ్చు. ఇక అప్పటికే ఆస్థమాతో బాదపడేవారికి వాయు కాలుష్యం మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. వీరికి ఆస్థమా మాటిమాటికీ దాడిచేయొచ్చు. లక్షణాలూ తీవ్రంగా వేధించొచ్చు. దీంతో మందులు పెద్దమొత్తంలో తీసుకోవాల్సి వస్తుంటుంది కూడా. 
క్షయ: వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో క్షయ కేసులు పెరుగుతున్నట్టు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అధ్యయనంలో బయటపడింది. నిజానికి క్షయకు మూలం బ్యాక్టీరియా. మరి కాలుష్యానికేంటి సంబంధం? మన ఒంట్లోకి బ్యాక్టీరియా, వైరస్‌ల వంటివి ప్రవేశించకుండా ముక్కులోని సన్నటి వెంట్రుకలు, జిగురుపొర కాపాడుతుంటాయి. ఈ కవచాన్ని వాయు కాలుష్యం దెబ్బతీస్తుంది. దీంతో బ్యాక్టీరియా వంటివి లోపలికి ప్రవేశించటం తేలికవుతుంది. పైగా కాలుష్యంతో రోగనిరోధకశక్తి కూడా క్షీణిస్తుంది. మనదేశంలో సుమారు 40% మందిలో క్షయ కారక బ్యాక్టీరియా ఉందని అంచనా. కాకపోతే అది నిద్రాణంగా ఉంటుంది. రోగనిరోధకశక్తి తగ్గినపుడు విజృంభించి సమస్యగా పరిణమిస్తుంది. ముక్కులోని రక్షణ వ్యవస్థ దెబ్బతినటం వల్ల న్యుమోనియా ముప్పూ పెరుగుతుంది. అరుదుగానే అయినా కొందరిలో వాయు కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కూ దోహదం చేయొచ్చు.

ముక్కు నుంచి గుండె వరకూ..ఎన్నెన్నో సమస్యలు

మన శరీరం శక్తి కోసం ఆక్సిజన్‌ను వినియోగించుకుంటుంది. ఈ క్రమంలో కొన్ని విశృంఖల కణాలు (ఫ్రీరాడికల్స్‌) విడుదలవుతుంటాయి. వీటిని యాంటీఆక్సిడెంట్లు ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేయటమో, ఒంట్లోంచి బయటకు పంపించటమో చేస్తుంటాయి. అయితే కొందరిలో ఈ ప్రక్రియ దెబ్బతిని (ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌) వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రేరేపితమవుతుంటుంది. కాలుష్య కారకాలు అలర్జీ కారకంగానూ పనిచేయొచ్చు. ఫలితంగా ఆస్థమా, సీవోపీడీ వంటి శ్వాసకోశ సమస్యలతో పాటు గుండెజబ్బులు, పక్షవాతం వంటి జబ్బులు దాడిచేస్తున్నాయి.

బయటికే పరిమితం కాదు

నిజానికి వాయు కాలుష్యం కొత్తదేమీ కాదు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథం చరక సంహిత కూడా దీని గురించి ప్రస్తావించింది. కాకపోతే అలనాటి కాలుష్యం తీరు వేరు. అడవి జంతువుల బెడదను తప్పించుకోవటానికి అప్పట్లో పొగలు పెడుతుండేవారు. అదీ ఏవో కొన్నిచోట్ల మాత్రమే. పారిశ్రామిక విప్లవం తర్వాత మనల్ని కొత్తరకం ‘పొగలు’ కమ్ముకోవటం ఆరంభించాయి. ఒకవైపు ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, బొగ్గు గనులు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు.. మరోవైపు వాహనాల వెల్లువతో కాలుష్య భూతం జడలు విప్పుకొంది. అనతికాలంలోనే విశ్వవ్యాప్తంగా కోరలు చాచింది. వాయు కాలుష్యం అనగానే అదేదో పట్టణాలకే పరిమితమని చాలామంది భావిస్తుంటారు. ఇది నిజం కాదు. కాలుష్యం గ్రామీణ ప్రాంతాలనూ వదలటం లేదు. పట్టణాల్లో ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, వాహనాల వంటివి కాలుష్యానికి దారితీస్తుంటే.. పంట వ్యర్థాలు కాల్చటం, వంట చెరకు, కిరోసిన్‌ పొయ్యిల వంటివి గ్రామాల్లో గాలిని పాడు చేస్తున్నాయి. ఇంట్లో రకరకాల అవసరాలకు వాడుకునే వస్తువులతో పాటు వంటగదులు చిన్నగా ఉండటం, లోపలి గాలి బయటకు పోయే ఏర్పాట్లు సరిగా లేకపోవటం వంటివన్నీ ఇంటి కాలుష్యానికి ఆస్కారం కలిగిస్తున్నాయి. మనదేశంలో 74% మంది ఇప్పటికీ వంట కోసం వంటచెరకునే వినియోగిస్తున్నారు. ఇది చాలదన్నట్టు ఇటీవలి కాలంలో దోమలను తరిమే బత్తీలు (మస్కిటో కాయిల్స్‌) కాల్చటమూ ఎక్కువైంది. ఒక దోమల బత్తీ నుంచి వెలువడే పొగ వంద సిగరెట్ల పొగతో సమానం! పైగా తలుపులు వేసుకొని మరీ వీటిని వెలిగిస్తుడటం మరింత ప్రమాదకరంగానూ పరిణమిస్తోంది. పూజ గదుల్లోనూ, అలాగే సువాసనల కోసం వెలిగించే అగరుబత్తీలూ తక్కువేమీ కాదు. అగరుబత్తీల పొగలకు ఎక్కువగా గురయ్యే పూజారుల్లో ఆస్థమా చాలా ఎక్కువగా కనబడుతున్నట్టు పుణెలో నిర్వహించిన అధ్యయనం పేర్కొంటుండటమే దీనికి నిదర్శనం.
చలికాలంలో పొగమంచు కప్పుకొని ఉంటుంది. కాబట్టి కాలుష్యం కదలకుండా ఎక్కడికక్కడే నిలిచిపోతుంది. అందుకే కాలుష్య అనర్థాలు శీతకాలంలోనే ఎక్కువగా చూస్తుంటాం.

సూక్ష్మ ధూళి కణాలతోనే ప్రమాదం

సల్ఫర్‌ డయాక్సైడ్‌, నైట్రోజన్‌ డయాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, సీసం, బెంజీన్‌, కార్బాక్సీలిక్‌ యాసిడ్‌, ఓజోన్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే గాలిని కలుషితం చేస్తున్నవి ఎన్నెన్నో. ఇవి గాలిలోని దుమ్ము ధూళితో కలిసిపోయి చిన్న చిన్న కణాల్లా ఏర్పడతాయి. ఈ ధూళి కణాలు (పార్టిక్యులేట్‌ మ్యాటర్‌) రకరకాల పరిమాణాల్లో ఉండొచ్చు. పెద్ద కణాలు (10 మైక్రాన్ల సైజు కన్నా ఎక్కువుండేవి) కింద పడిపోతాయి. ఇక 2.5 మైక్రాన్ల కన్నా తక్కువుండేవి మనకు అందుబాటులో లేనంత ఎత్తులో ఉండిపోతాయి. వచ్చిన చిక్కంతా 2.5 మైక్రాన్ల నుంచి 10 మైక్రాన్ల పరిమాణంలో ఉండే కణాలతోనే. ఇవి అటు పైకి వెళ్లకుండా.. ఇటు కిందికి చేరకుండా నిరంతరం గాల్లో తేలియాడుతూ తిరుగాడుతుంటాయి. ఇవి మనం శ్వాస తీసుకున్నప్పుడు ముక్కు, శ్వాసనాళం గుండా ప్రయాణించి ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయి పలు అనర్థాలకు దారితీస్తున్నాయి.

పిల్లలపై తీవ్ర ప్రభావం

చిన్నపిల్లల్లో ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందవు. వీరిలో రోగనిరోధకశక్తి కూడా తక్కువే. అందువల్ల పెద్దల కన్నా పిల్లలపైనే కాలుష్యం మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుంది. పట్టణ ప్రాంతాల్లో బడులకు వెళ్లే పిల్లల్లో 20% మంది ఆస్థమాతో బాధపడుతున్నారని అంచనా. అదే గ్రామీణ ప్రాంత పిల్లల్లో 10% మంది ఆస్థమా బారినపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం కాలుష్యమే.

తరుణోపాయమేంటి?

అదృష్టం కొద్దీ దక్షిణాదిలో సముద్రం నుంచి వీచే గాలుల మూలంగా కాలుష్యం చెల్లాచెదరై పోతుంటుంది. అందువల్ల మనకు కాలుష్యం తీవ్రత కాస్త తక్కువనే చెప్పుకోవచ్చు. అయినా దీని అనర్థాలను తేలికగా తీసుకోవటానికి లేదు. కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవటం, కాలుష్యం బారినపడకుండా చూసుకోవటం ద్వారా సమస్యలను కొంతవరకైనా తగ్గించుకోవచ్చు. 
బయటకు వెళ్లినపుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవటం, వీలైతే నాసల్‌ ఫిల్టర్లు ధరించటం మంచిది. 
సిగరెట్లు కాల్చకపోయినా కాలుష్య వాతావరణంలో గడిపితే పొగతాగినట్టే లెక్క. అందువల్ల ట్రాఫిక్‌ కానిస్టేబుళ్ల వంటి వాళ్లు పొగ అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. 
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. దిండు కవర్లు, దుప్పట్లను వారానికి ఒకసారి వేడి నీటిలో ఉతికి, ఎండలో ఆరబెట్టుకోవాలి.  చీపురుతో చిమ్మితే దుమ్ముధూళి గాలిలో కలుస్తుంది. కాబట్టి గచ్చును తడిగుడ్డతో తుడుచుకోవటం మంచిది. వంటింట్లోంచి పొగ బయటకు వెళ్లేలా ఫ్యాన్లు, చిమ్నీల వంటివి ఏర్పాటు చేసుకోవాలి. వంటచెరకు, కిరోసిన్‌కు బదులు గ్యాస్‌ వాడుకోవాలి. మస్కిటో కాయిల్స్‌కు బదులు దోమతెరలు వాడుకోవటం ఉత్తమం. అగరువత్తుల పొగ పీల్చకుండా చూసుకోవాలి. 
పొగ అలవాటు గలవారు ఇంట్లో సిగరెట్ల వంటివి కాల్చకుండా చూసుకోవాలి. 
వాహనాలను, కాలుష్యాన్ని వెదజల్లే కర్మాగారాల వంటి వాటిని నియంత్రించటం చాలా అవసరం. ఇందుకు ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగానూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం ప్రజా రవాణా సదుపాయాలు పెంచటం, వాటిల్లో ప్రయాణాలను ప్రోత్సహించాలి.
బాణసంచాతో కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. దీపావళి తర్వాత దిల్లీ నగరంలో కార్బన్‌ మోనాక్సైడ్‌ స్థాయులు దాదాపు వెయ్యి రెట్లు పెరగటం గమనార్హం. కాబట్టి బాణసంచా విషయంలో నియంత్రణ పాటించటం మంచిది.

గుండె జబ్బులు, పక్షవాతం: మనం శ్వాస ద్వారా తీసుకునే ఆక్సిజన్‌ రక్తంలోని హిమోగ్లోబిన్‌తో జతకూడి ఆక్సీహిమోగ్లోబిన్‌గా మారుతుంది. ఇది కణాలకు చేరుకొని కొత్తశక్తిని అందజేస్తుంది. అయితే కలుషితమైన గాలిని పీల్చినప్పుడు ఆక్సిజన్‌ కన్నా కార్బన్‌ డయాక్సైడ్‌ ఎక్కువమొత్తంలో లోనికి వెళ్తుంది. ఇది హిమోగ్లోబిన్‌తో జతకూడి కార్బాక్సీహిమోగ్లోబిన్‌ ఏర్పడుతుంది. దీంతో గుండె రక్తనాళాలు సంకోచించే ముప్పు పెరుగుతుంది. ఫలితంగా గుండెకు రక్తసరఫరా తగ్గిపోయి గుండెపోటు రావొచ్చు. వాయు కాలుష్యంతో తెల్లరక్తకణాల సంఖ్య కూడా మారిపోతున్నట్టు, ఇది గుండె రక్తనాళాల పనితీరును మార్చేస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడుకు రక్తసరఫరా చేసే నాళాల్లో ఇలాంటి పరిస్థితే ఏర్పడితే పక్షవాతం దాడిచేయొచ్చు. వాయు కాలుష్యంతో అధిక రక్తపోటు ముప్పు పెరుగుతున్నట్టూ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కూడా గుండెజబ్బులు, పక్షవాతం ముప్పులను పెంచేదే. సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటే స్తంభనలోపం, రెటినోపతి వంటి సమస్యలూ దాడిచేస్తాయి. 
అలసట, ఒత్తిడి: మన శరీరానికి అవసరమైన 80% శక్తి శ్వాస ద్వారా తీసుకునే ఆక్సిజన్‌ నుంచే లభిస్తుంది. అందువల్ల కాలుష్య వాతావరణంలో శరీరానికి తగినంత ఆక్సిజన్‌ అందక త్వరగా అలసట ముంచుకొస్తుంది. నిస్సత్తువ, చిరాకు వంటివీ వేధిస్తాయి. కొందరిలో ఇది ఒత్తిడికి సైతం దారితీయొచ్చు. 
నాడీ సమస్యలు:  ఆందోళన, తలనొప్పి, కోపం, చిరాకు, ఏకాగ్రత దెబ్బతినటం, అనుచితంగా విపరీతంగా స్పందించటం వంటి సమస్యలకూ వాయు కాలుష్యానికీ సంబంధం ఉంటున్నట్టు తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అల్జీమర్స్‌, పార్కిన్సన్స్‌ వంటి సమస్యల ముప్పు కూడా పెరుగుతున్నట్టు మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 
నెలలు నిండకముందే కాన్పు: గర్భిణులు కాలుష్య ప్రభావానికి గురైతే పిల్లలు తక్కువ బరువుతో పుట్టే ప్రమాదముంది. నెలలు నిండకముందే కాన్పు కావొచ్చు. కాలుష్యం మూలంగా గర్భస్థ శిశువులో ఊపిరితిత్తులు సరిగా వృద్ధి చెందవు. శ్వాస తీసుకున్నప్పుడు సాగే గుణమూ తగ్గుతుంది. దీంతో పిండానికి ఆక్సిజన్‌ స్థాయులు తగ్గిపోతాయి. ఫలితంగా రకరకాల సమస్యలు రావొచ్చు. 
వృద్ధాప్య ఛాయలు: శ్వాసకోశ వ్యవస్థ మాదిరిగానే చర్మం కూడా కాలుష్య కారకాలను ఎక్కువగానే ప్రభావితమవుతుంటుంది. దీంతో చర్మం త్వరగా ముడతలు పడటం, కళ తప్పటం వంటి సమస్యలు ముంచుకొస్తుంటాయి. కొందరికి చర్మ అలర్జీలు కూడా తలెత్తొచ్చు. 
ఇరత సమస్యలు: కాలుష్య కారకాల ప్రభావంతో కళ్ల మంటలు, దురద, నీరు రావటం వంటివి తలెత్తొచ్చు. కొందరిలో కాలేయ సమస్యలు, కిడ్నీ సమస్యలకూ దారితీయొచ్చు. భారలోహమైన సీసం ప్రభావంతో కడుపులో నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తొచ్చు. సీసం మెదడు పనితీరునూ దెబ్బతీస్తుండటం గమనార్హం. కొందరిలో రక్తహీనత, నిద్ర పట్టకపోవటం వంటి సమస్యలు కూడా తలెత్తొచ్చు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.