close

తాజా వార్తలు

ఆదమరిస్తే... అనేక సమస్యలు 

కంటికి రెప్పలా సరిహద్దుల కాపలా

ఆదమరిస్తే... అనేక సమస్యలు 

బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు (హిందువులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులు, పార్శీలు) పౌరసత్వం కల్పించేందుకు ప్రభుత్వం తీసుకువస్తున్న పౌరసత్వ సవరణ బిల్లు ఈశాన్య భారతంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో  నెగ్గాల్సి ఉంది. ఈ బిల్లుతో ఈశాన్య ప్రాంతం, ముఖ్యంగా అసోమ్‌లో ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ దేశాలతో భారత్‌ సరిహద్దుల స్థితిగతులపై సమీక్ష ఇది...

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు సరిహద్దుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. ఎత్తయిన ఇనుప కంచెలు, గోడల నిర్మాణం ద్వారా సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాయి. పశ్చిమాసియా దేశమైన ఇజ్రాయెల్‌ ఈ విషయంలో ఇతర దేశాలకన్నా ఎంతో ముందంజలో ఉంది. తన చుట్టూ ఈజిప్టు, లెబనాన్‌, సిరియా, జోర్డాన్‌ వంటి శత్రురాజ్యాలున్న ఈ యూదు దేశం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ చీమ చిటుక్కుమన్నా పసిగట్టే ఎలక్ట్రానిక్‌ నిఘా పరికరాలను అమర్చి భద్రతను పటిష్ఠపరచింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, భారత్‌ పరిస్థితి భిన్నంగా ఉంది. సరిహద్దుల్లో కంచె నిర్మాణం దశాబ్దాల తరబడి కొనసాగుతున్నా ఇప్పటికీ కొలిక్కి రాకపోవడం ప్రభుత్వాల చిత్తశుద్ధిని సందేహాస్పదం చేస్తోంది. ఫలితంగా బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసలతో ఈశాన్య భారతం ముఖ్యంగా అసోం సతమతమవుతోంది. పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లతో జమ్ము-కశ్మీర్‌లో ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. చైనా సరిహద్దుల్లో ఏకంగా ఆ దేశ సైన్యమే తరచూ అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిముల్లోకి చొరబడుతూ చికాకులు సృష్టిస్తోంది.

కొలిక్కిరాని కంచె నిర్మాణం 
దేశంలోని 17 రాష్ట్రాలు ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దులను కలిగి ఉన్నాయి. ఈశాన్య భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌, అసోమ్‌, నాగాలాండ్‌, మిజొరం, మణిపూర్‌, త్రిపుర, మేఘాలయ; పశ్చిమాన రాజస్థాన్‌, గుజరాత్‌; ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమ్‌ బంగ, సిక్కిం, జమ్ము-కశ్మీర్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు వివిధ దేశాలతో సరిహద్దులను పంచుకుంటున్నాయి. భారత్‌ మొత్తం పదిహేను వేల కిలోమీటర్లకుపైగా భూ సరిహద్దుతో పాటు శ్రీలంక, మాల్దీవులు, ఇండొనేసియా, థాయ్‌లాండ్‌, పాక్‌, బంగ్లాదేశ్‌, మియన్మార్‌లతో సుమారు 7,516 కిలోమీటర్ల తీరప్రాంత సరిహద్దు కలిగి ఉంది. భూ సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌ సరిహద్దు అత్యంత కీలమైనది. 4,096 కిలోమీటర్లు గల ఇది ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద అంతర్జాతీయ సరిహద్దు. ఇందులో దాదాపు 3,326 కిలోమీటర్ల మేరకు కంచె నిర్మాణం జరిగింది. ఈ ఏడాది ఆఖరు కల్లా మిగిలినదాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం. అసోం, త్రిపుర, మిజోరం, మేఘాలయ, పశ్చిమ్‌ బంగ రాష్ట్రాలు బంగ్లాతో సరిహద్దు కలిగిఉన్నప్పటికీ, అసోమ్‌తో గల 262 కిలోమీటర్లు, పశ్చిమ్‌ బంగతో గల 2,217 కిలోమీటర్ల సరిహద్దు కీలకమైనది. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న కంచె నిర్మాణం నేటికీ ఓ కొలిక్కి రాకపోవడం ప్రభుత్వాల వైఫల్యాన్ని చాటుతోంది. సరిహద్దుల్లో కొంతప్రాంతం కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, పిల్ల కాల్వలు, నదులతో నిండి ఉండటం కంచె నిర్మాణానికి అడ్డంకిగా ఉంది. వరదల తాకిడికి కొన్ని పాత కట్టడాలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల భూసేకరణ సమస్యాత్మకంగా ఉంది. సరిహద్దుల్లో 802 బీవోపీ (బోర్డర్‌ అవుట్‌ పోస్ట్‌)లను నెలకొల్పి సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) కాపలా కాస్తోంది. అసోమ్‌లో 40 లక్షల మంది బంగ్లాదేశ్‌ అక్రమ వలసదారులు ఉన్నట్లు నిరుడు జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) ద్వారా గుర్తించారు. అసోమ్‌లోని ధూబ్రి, కరీంగంజ్‌ జిల్లాలు బంగ్లా అక్రమ వలసదారుల కేంద్రాలుగా మారాయి. దేశవ్యాప్తంగా రెండు కోట్లకు పైగా బంగ్లాదేశ్‌ అక్రమ వలసదారులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్‌ రిజిజు 2016 నవంబరులో రాజ్యసభకు వెల్లడించారు. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువేనని, అనధికారికంగా మూడు కోట్ల మంది వరకు ఉంటారన్న అంచనాలున్నాయి. బంగ్లాదేశ్‌ అక్రమ వలసదారుల్లో కొంతమంది కేరళ వెళుతున్నారు. అక్కడ కార్మికులకు ఉపాధి అవకాశాలు ఉండటం ఇందుకు కారణం.

బంగ్లాదేశ్‌తో గల పశ్చిమ్‌ బంగ సరిహద్దులో ఇంకా సుమారు 631 కిలోమీటర్ల ప్రాంతంలో కంచె నిర్మాణం జరగాల్సి ఉంది. ఇందుకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా ఉంది. మమతా బెనర్జీ ప్రభుత్వం భూసేకరణ విషయంలో కేంద్రానికి సహకరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలోని మాల్దా, ముర్షీదాబాద్‌, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో బంగ్లా వలసదారులదే పైచేయిగా మారింది. బంగ్లా నుంచి వచ్చిన ముస్లిం వలసదారులు కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా మారారన్న పేరుంది. వీరి మద్దతుతోనే గతంలో దివంగత కాంగ్రెస్‌ నేత అబ్దుల్‌ ఘనీఖాన్‌ చౌదరి 1980 నుంచి మరణించేంతవరకు (2006) వరకు మాల్దా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కొంతకాలం కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇప్పుడు ఆయన సోదరుడు అబూ హసేమ్‌ఖాన్‌ చౌదరి కాంగ్రెస్‌ నుంచి మాల్దా ఎంపీగా ఉన్నారు. బంగ్లాదేశ్‌ తరవాత భారత్‌లోకి ఎక్కువమంది వలస వచ్చేది నేపాల్‌ నుంచే. అయితే బతుకుతెరువు కోసం వలస వచ్చే నేపాలీలతో శాంతిభద్రతల సమస్య లేదు. హిమాలయ పర్వత రాజ్యంతో గల 1,751 కిలోమీటర్ల సరిహద్దుల్లో ఎటువంటి కంచె నిర్మాణం లేదు. కేవలం సరిహద్దులను గుర్తించే రాతి స్తంభాలు (పిల్లర్లు) మాత్రమే ఉన్నాయి. సహస్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ) 455 బోర్డర్‌ అవుట్‌ పోస్టు (బీవోపీ)ల ద్వారా గస్తీ కాస్తోంది. రెండు దేశాల మధ్య రాకపోకలకు సంబంధించి పాస్‌పోర్టు, వీసా వంటి ఆంక్షలూ లేవు. గుర్తింపు కార్డుల ఆధారంగా నేపాలీలు, భారతీయులు ఇరు దేశాలను సందర్శించవచ్చు. సరిహద్దుల్లో ఆంక్షలు లేకపోవడం అవాంఛనీయ ఘటనలకు ఆస్కారమిస్తోంది. మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా కొనసాగుతోంది. గతంలో నేపాల్‌ కేంద్రంగా ఉన్న ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేవారు. భద్రత పెంపులో భాగంగా మొదటి దశలో బిహారులోని రక్సౌల్‌, జొగబని, రెండోదశలో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సునౌల్‌, రుపైదిహల్లో ఏకీకృత చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నారు.

డ్రాగన్‌ బుసలు

ఆదమరిస్తే... అనేక సమస్యలు 

చైనాతో సరిహద్దు ప్రత్యేకమైనది. మెక్‌మహన్‌ రేఖ రెండు దేశాలనూ విడదీస్తోంది. దీన్ని చైనా గుర్తించడం లేదు. జమ్ము-కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు చైనాతో 3,488 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. 142 బోర్డర్‌ అవుట్‌ పోస్టు (బీవోపీ)ల ద్వారా సైన్యంతో పాటు ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) గస్తీ నిర్వహిస్తున్నాయి. వీటిల్లో అన్నింటికన్నా అరుణాచల్‌ సరిహద్దే అత్యంత సమస్యాత్మకమైనది. యావత్తు అరుణాచల్‌ తనదేనంటూ చైనా మొండిగా వాదిస్తోంది. ప్రజల పరంగా అక్రమ వలసలు లేవు. అయితే చైనా సైన్యమే ఆ పాత్ర పోషిస్తుండటం గమనార్హం. తరచూ చొరబాట్లతో ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. డ్రాగన్‌ సైనికులు సరిహద్దులు దాటి చికాకులు కల్పిస్తున్నారు. డోక్లామ్‌ ఉదంతం ఇందుకు నిలువెత్తు నిదర్శనం. రెండు దేశాల మధ్య కంచె నిర్మాణం చేపట్టలేదు.

చొరబాట్లతోనే తంటాలు 
భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత సున్నితమైనది, సంక్లిష్టమైనది. ఈ ప్రాంతంలో తరచూ ఉద్రిక్తతలు చెలరేగుతుంటాయి. దీనికి ప్రపంచంలోనే ప్రమాదకరమైన సరిహద్దుగా పేరుంది. రెండు దేశాలనూ నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ- లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌) విడదీస్తోంది. ఉభయ దేశాలు 3,323 కిలోమీటర్ల సరిహద్దులు కలిగి ఉన్నాయి. జమ్ము-కశ్మీర్‌ 1,225 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటుండగా ఇందులో 740 కిలోమీటర్లలో నియంత్రణ రేఖ విస్తరించి ఉంది. పంజాబ్‌ 553, రాజస్థాన్‌ 1,037, గుజరాత్‌ 508 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. 2016 డిసెంబరు నాటికి కశ్మీర్‌ వెంట 186, పంజాబ్‌ వెంట 462, రాజస్థాన్‌ వెంట 1,018, గుజరాత్‌ వెంట 261 కిలోమీటర్ల మేరకు కంచె నిర్మాణం పూర్తయింది. చాలాచోట్ల కొండలు, గుట్టలు, వాగులు, వంకలు ఉండటంతో కంచె నిర్మాణానికి అడ్డంకిగా మారింది. పాక్‌ నుంచి అక్రమ వలసలు లేకపోయినా, భద్రతాదళాల కన్నుగప్పి ఉగ్రవాదుల చొరబాట్లు జరుగుతున్నాయి. రాజస్థాన్‌ సరిహద్దులో ఎడారి ప్రాంతమూ ఉంది. పాకిస్థాన్‌తో గుజరాత్‌ భూ సరిహద్దుతో పాటు తీరప్రాంత సరిహద్దునూ కలిగి ఉంది. తీరప్రాంత సరిహద్దు భద్రత పూర్తిస్థాయిలో పటిష్ఠంగా లేదు. పాక్‌ నుంచి సముద్రం మీదుగా వచ్చిన ఉగ్రవాదులు 2008లో ముంబయిలో నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే.

అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, మిజోరం, మణిపూర్‌ రాష్ట్రాలు 1,643 కిలోమీటర్ల సరిహద్దును మియన్మార్‌తో పంచుకుంటున్నాయి. అసోం రైఫిల్స్‌ ఇక్కడ గస్తీ తిరుగుతుంటాయి. మియన్మార్‌ నుంచి అక్రమ వలసలు లేవు. మణిపూర్‌ రాష్ట్రంలోని ‘మోరె’ వద్ద ఇరు దేశాల సరిహద్దులు చీలిపోతాయి. ఈ సరిహద్దు ప్రశాంతమే. భూటాన్‌తో 699 కిలోమీటర్ల సరిహద్దును భారత్‌ పంచుకుంటోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ 217, అసోం 267, పశ్చిమ్‌ బంగ 183, సిక్కిం 32 కిలోమీటర్ల సరిహద్దును ఈ దేశంతో కలిగి ఉన్నాయి. 132 బోర్డర్‌ అవుట్‌ పోస్టుల ద్వారా సహస్ర సీమాబల్‌ సరిహద్దుల రక్షణ బాధ్యతలను నిర్వహిస్తోంది. శ్రీలంక, మాల్దీవులు, థాయ్‌లాండ్‌, ఇండొనేసియాలతో గల తీరప్రాంత సరిహద్దు ప్రశాంతమే. శ్రీలంకతో చిన్నపాటి సమస్యలు తప్ప ఇతర దేశాలతో ఇబ్బందులు లేవు. తమిళ జాలర్లు అప్పుడప్పుడు శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించడం, లంక జాలర్లు భారత్‌ జలాల్లోకి రావడం వంటి చెదురుమదురు ఘటనలు తప్ప ఇతర సమస్యలు లేవు. కంచె లేనందువల్ల కలిగే ఇబ్బందులను ఈశాన్య భారతం, ముఖ్యంగా అసోం ఎదుర్కొంటోంది. ఇతర దేశాలతో ఎలా ఉన్నప్పటికీ బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో కంచె నిర్మాణం సత్వరం పూర్తి చేయాలి. భద్రతను పటిష్ఠపరచాలి. ఈ దిశగా అడుగులు వేయడం కేంద్రం తక్షణ కర్తవ్యం!

- గోపరాజు మల్లపరాజు

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.