close

తాజా వార్తలు

‘మా అమ్మ రజనీ సర్‌ ఇంట్లో పనిచేసేది’

నా ఫీజులన్నీ ఆయనే కట్టారు.. ఇప్పుడు తలైవా రుణం ఇలా తీర్చుకుంటున్నా!

చెన్నై: అవసరాల్లో ఉన్న చాలా మందికి సహాయం చేసి అభిమానుల హృదయాలకు మరింత దగ్గరయ్యారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. పలువురి విద్యా, వైద్య ఖర్చుల్ని ఆయనే భరించేవారు. అయితే ఇలాంటి విషయాల్ని ప్రచారం చేసుకోవడానికి రజనీ ఇష్టపడరు. ఇలా రజనీ నుంచి సహాయం పొందిన యువకుడు మధి తాజాగా మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తను పోస్టర్‌, బ్యానర్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు. తలైవా ఫ్యాన్స్‌ క్లబ్‌ సభ్యులు బ్యానర్ల డిజైన్‌ కోసం తన దగ్గరికి వస్తుంటారని, ఇలా ఆయన రుణం తీర్చుకుంటున్నానని తెలిపారు.

రజనీతో తనకున్న బంధం గురించి మధి మాట్లాడుతూ.. ‘మాది పేద కుటుంబం.. మా అమ్మ రజనీకాంత్ సర్‌‌ ఇంట్లో పనిచేసేది. నా స్కూల్‌ ఫీజులను రజనీనే కట్టారు. మా తాతయ్య కూడా ఆయన ఇంట్లోనే పనిచేసేవారు. తాతయ్య కార్పొరేషన్‌ వర్కర్‌.. రజనీ, జయలలిత ఇంటి పరిసరాల్లో శుభ్రం చేసేవారు. ఒక్కోసారి రజనీ ఇంటిలోపల కూడా పనిచేసేవారు. సూపర్‌స్టార్‌ పేపర్‌ చదువుతూ మా తాతయ్యతో మాట్లాడేవారు. ప్రతి ఏడాది దీపావళికి మా కుటుంబం మొత్తం రజనీ ఇంటికి వెళ్లేవాళ్లం. రజనీ మాకు స్వీట్స్‌, బట్టలు ఇచ్చేవారు. ఇంట్లో పనిచేసినందుకు మా తాతయ్యకు కూడా రజనీ డబ్బులు ఇచ్చేవారు’.

‘ఓ ప్రత్యేక సందర్భంలో పోయెస్‌ గార్డెన్‌లో ఉన్న రజనీ ఇంటి ముందు గుంపులుగా పెద్ద ఎత్తున జనం చేరారు. దీంతో మా తాతయ్యను, మరికొందర్ని అడయార్‌‌లోని ఇంటి దగ్గరికి రమ్మని రజనీ చెప్పి పంపారు. తెలుపు రంగు దుస్తులు వేసుకుని కారు నుంచి దిగిన వెంటనే అందరూ ఆయన కాళ్లపై పడటం మొదలు పెట్టారు. అప్పుడు రజనీ ఇలాంటి పనులు చేయొద్దని సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. ఆ గుంపులో రజనీ మమ్మల్ని గుర్తించి, ముందుకు రమ్మన్నారు. మాకు స్వీట్స్‌ ఇచ్చి కాసేపు మాట్లాడారు’.

‘ఓసారి మేం పోయెస్‌ గార్డెన్‌కు వెళ్లినప్పుడు రజనీ ఇంట్లో లేరు. కాసేపు ఉండండని కాపలాగా ఉండే వ్యక్తి‌ మమ్మల్ని ఆపాడు. మేం ఎంత చెప్పినా వినడం లేదు. మమ్మల్ని లత అమ్మ దూరం నుంచి చూసి.. ఎందుకు గేటు వద్ద నిల్చుని ఉన్నారని అడిగారు. జరిగిన సంగతి మా తాతయ్య చెప్పారు. దీంతో మా ముందే ఆమె వాచ్‌మ్యాన్‌పై కేకలు వేశారు. బాగా చదువుకుంటున్నావా? అని ఆమె అడిగిన ప్రతిసారీ నేను నవ్వుతూ ఉండిపోయేవాడ్ని. మేం కష్టాల్లో ఉన్నప్పుడు రజనీ మా కుటుంబానికి చాలా సహాయం చేశారు. ఆయన వల్లే నేను ఉన్నత విద్యను అభ్యసించగలిగాను. కాబట్టి ఆయన రుణం చెల్లించుకోవాలి. అందుకే ఆయన పోస్టర్లు, బ్యానర్లు తయారు చేయడం గర్వంగా, సంతోషంగా ఉంది’ అని మధి ఓ పత్రికతో చెప్పారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.