close

తాజా వార్తలు

ఓటుహక్కుకు మరో అవకాశం 

జిల్లాలో 30,39,670 ఓటర్లు 
ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు, సవరణలకు ఆస్కారం 
ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకుంటే తుదిజాబితాలో పేరు 
పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే

ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కీలక భూమిక పోషిస్తాయి. ఎన్నికల్లో ఓటు వేసి తమకు నచ్చిన నాయకున్ని ఎన్నుకోవాలనే అభిలాష ప్రతీ ఓటరుకు ఉంటుంది. అయితే జాబితాలో పేరు ఉంటేనే ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఓటరు కార్డు ఉన్నా, గత ఎన్నికల్లో ఓటు వేసినా ఎన్నికల సంఘం విడుదల చేసిన తుదిజాబితాలో పేరు లేకుంటే ఓటు వేసేందుకు అవకాశం ఉండదు. ఎన్నికల సంఘం విడుదల చేసే జాబితాలో పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సూచిస్తున్నారు. పేరు లేకపోతే ఫారం-6 భర్తీ చేసి ఓటరుగా నమోదు కావాలని సూచిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో ఇలా 
ఓటు ఉందా? లేదా? సరిచూసుకోవడానికి ఓటరుగా నమోదు చేసుకోవడానికి ‌
www.ceoandhra.nic.in, nvsp.in వెబ్‌సైట్‌లను పరిశీలించవచ్చు. వెబ్‌సైట్‌లో సెర్చ్‌ యువర్‌నేమ్‌ చోట క్లిక్‌ చేసి మీ నియోజకవర్గం, పేరు, ఓటరు గుర్తింపుకార్డు నంబర్‌ నమోదు చేసిన వెంటనే మీకు ఓటు ఉందా లేదా ఉంటే ఏ పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఉందో తెలుస్తుంది. ఈ రెండు వెబ్‌సైట్ల నుంచి ఓటుహక్కు కోసం పేరు నమోదు చేసుకోవచ్చు. నూతన ఓటరు నమోదు ఆప్షన్‌ ఇందులో కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌  చేయగానే ఓటరు నమోదు పత్రం వస్తుంది. అందులో కావాల్సిన భాషను ఎంపిక చేసుకొని వివరాలు నమోదు చేయడంతోపాటు ఫొటో, చిరునామా, నిర్ధారిత పత్రాలను నిక్షిప్తం చేస్తే రసీదు వస్తుంది.

మెసేజ్‌ రూపంలో ఇలా 
ap అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి vote స్పేస్‌ ఇచ్చి మీ ఓటరు గుర్తింపుకార్డు సంఖ్యను ఎంటర్‌ చేసి 92231 66166కు లేదా 51959 నంబర్‌కు పంపిస్తే జాబితాలో పేరు ఉంటే సమగ్ర వివరాలన్నీ మెసేజ్‌లో వస్తాయి.

ఓటరు నమోదు...నిరంతర ప్రక్రియ 
ఓటరుగా నమోదు చేసుకొనేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే ప్రత్యేక కార్యాచరణ నిర్వహించింది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలై నామినేషన్ల స్వీకరణ గడువు చివరిరోజు వరకు కొత్తగా ఓటర్ల నమోదు చేసుకొనే వీలుంది. అయితే ఆ సమయంలో ఎన్నికల పర్యవేక్షణ హడావుడిలో ఉంటారు కాబట్టి అప్పుడు వచ్చిన దరఖాస్తులను విచారించి అర్హులైతే ఓటుహక్కు కల్పించడం కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి ఓటర్లు జనవరి 25 లోగా ఫారం-6 పూర్తిచేసి ఓటు నమోదు చేసుకుంటే తుదిజాబితాలో పేరు నమోదవుతుంది. తహశీల్దార్‌ కార్యాలయంలో జాబితా తహశీల్దార్‌, ఆర్డీవో, పురపాలిక పరిధిలో ఓటర్ల జాబితా సిద్ధంగా ఉన్నాయి. ప్రతి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్‌ బూత్‌ అధికారి అందుబాటులో ఉంటారు. అక్కడే జాబితాలో పేరు ఉందో, లేదో చెక్‌ చేసుకోవచ్చు. పేరు లేకపోతే వెంటనే ఫారం-6లో వివరాలు నమోదు చేసి ఫొటోతోపాటు ధ్రువీకరణపత్రాలు జత చేసి అధికారులకు అందజేస్తే వారు విచారణ చేసి అర్హులైతే ఓటుహక్కు కల్పిస్తారు.

జిల్లాస్థాయిలో వివరాలు తెలియాలంటే 
రాష్ట్ర స్థాయి కాల్‌సెంటర్‌ నంబర్‌ 1950కు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటలలోపు కాల్‌ చేసి జాబితాలో మీ పేరు ఉందా లేదా అడిగి తెలుసుకోవచ్చు. అలాగే జిల్లా కాల్‌సెంటర్‌ నంబర్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్‌.పి.సిసోడియా ఇటీవల వెల్లడించారు. జిల్లాస్థాయిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఇవి పనిచేస్తాయి. 0881 225155 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.