close

తాజా వార్తలు

సాహో! సాహస బాలలూ

అనుకోని ప్రమాదం ఎదురైతే పెద్దవాళ్లే కంగారు పడతారు. కానీ ఈ చిన్నారులు మాత్రం చటుక్కున స్పందించారు. మనకెందుకులే అనుకోకుండా. ప్రాణాల్ని పణంగా పెట్టారు. ఎదుటి వారిని రక్షించే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో ఒకరు ప్రాణాలే కోల్పోయారు. వారి ధైర్యం, త్యాగాలకు గుర్తింపుగా జాతీయ స్థాయిలో సాహస బాలల అవార్డుకు ఎంపికయ్యారు. ఏటా దేశవ్యాప్తంగా సాహస బాలలను ఎంపిక చేసే భారత బాలల సంక్షేమ మండలి ఈ ఏడాది 21 మందిని ఎంపిక చేసింది. వారి స్పూర్తిదాయక వీర గాధలు ఇవిగో!

ఉగ్రవాదినే కరిగించింది!

ఉగ్రవాది... ఈ పేరు వింటే పెద్దలే భయపడిపోతారు. కానీ ఇద్దరు పిల్లలు వాళ్లనే ఎదుర్కొన్నారు.

సాహో! సాహస బాలలూ* అది... 2018, ఫిబ్రవరి 10వ తేదీ. తెల్లవారుజామున 5.15 గంటలు. జమ్ములోని సుంజువాన్‌ మిలటరీ క్యాంపుపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఓ ఉగ్రవాది కాల్పులు జరుపుతూ హవల్దార్‌ ఇంట్లో చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న హవల్దార్‌ కూతురు ఎనిమిదేళ్ల హిమ ప్రియ, ఆమె తల్లి ఆ ఉగ్రవాదిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాల్పుల్లో  హిమప్రియ తల్లి గాయంతో పడిపోయింది.  చేతికి గాయమైనా ఏమాత్రం భయపడని హిమ ప్రియ ఆ ఉగ్రవాదితో మాటలు కలిపి మూడు నాలుగు గంటలసేపు మాట్లాడుతూనే ఉంది. దీంతో ఇతర ఉగ్రవాదులు ఆ వైపు రాలేదు. అలా ఆ ఉగ్రవాదిని ఒప్పించి తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లేలా చేయగలిగింది. ఆమె తల్లి, ఇద్దరు చెల్లెళ్లు ప్రాణాలతో బయటపడ్డారు. జాతీయ సాహస పురస్కారాల్లో కీలకమైన ‘భారత్‌ అవార్డు’కు ఈ చిన్నారి ఎంపికైంది.

సాహో! సాహస బాలలూ* సుంజువాన్‌ క్యాంపుపై దాడిలోనే ముగ్గురు ఉగ్రవాదులు సౌమ్యదీప్‌ జనా(13) ఇంటి తలుపులు తట్టారు. ప్రమాదాన్ని గమనించిన జనా తన తల్లినీ, సోదరినీ గదిలో పెట్టి తాళం వేశాడు. ప్రధాన ద్వారం తలుపు తెరుచుకోకుండా తాళం వేసి దానికి అడ్డుగా ఇంట్లో ఇనుప పెట్టెలు పెట్టి తానూ నిలుచున్నాడు. ఎంత ప్రయత్నించినా తలుపు తెరుచుకోక పోవడంతో ఉగ్రవాదులు తుపాకీతో కాల్పులు జరిపి, గ్రెనేెడ్‌ విసిరారు. జనా తీవ్రంగా గాయపడ్డాడు. మూడు నెలల పాటు కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతని శరీరంలో ఎడమ భాగం స్పర్శ కోల్పోయింది. కుటుంబంలో ఇద్దరి ప్రాణాలు కాపాడిన జనా ‘భారత్‌ అవారు’్డకు ఎంపికయ్యాడు.

సాహో! సాహస బాలలూ

స్నేహాన్ని బతికించింది!
పరుల ప్రాణాల్ని కాపాడటం కోసం తన ప్రాణాన్నే పోగొట్టుకుందో బాలిక.

సాహో! సాహస బాలలూ

* దిల్లీకి చెందిన నితిశా నేగి (15) ఫుట్‌బాల్‌ అండర్‌-17 జట్టులో సభ్యురాలు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో పసిఫిక్‌ స్కూల్‌ గేమ్స్‌లో ఆడేందుకు ఈ జట్టు వెళ్లింది. జట్టు సభ్యులంతా అడిలైడ్‌ బీచ్‌కు వెళ్లారు. సముద్ర తీరంలో మిత్రులంతా ఆడుకుంటున్న సమయంలో పెద్ద పెద్ద అలలు ఒక్కసారిగా వచ్చాయి. జట్టు సభ్యులంతా చెల్లాచెదురయ్యారు. స్నేహితురాలు అనన్య అరోరా సముద్రంలోకి కొట్టుకుపోతున్న దృశ్యాన్ని చూసింది నితిశా.  వెంటనే ముందుకు వెళ్లి అనన్యను బలంగా బయటకు నెట్టివేసింది. ఈ క్రమంలో అనన్య ప్రమాదం నుంచి బయటపడింది. కానీ అదే సమయంలో బయటకు వస్తున్న నితిశా మరో అలతో సముద్రంలోకి వెళ్లి మునిగి చనిపోయింది. తన మిత్రురాలిని కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన నితిశా ‘గీతా చోప్రా’ అవార్డుకు ఎంపికైంది.

చిరుతను భయపెట్టాడు!

సాహో! సాహస బాలలూ

గుజరాత్‌కు చెందిన ఆరేళ్ల అజిత్‌ సింగ్‌ తన స్నేహితుడిని కాపాడ్డానికి చిరుతతో పోట్లాడాడు. అడవి సమీపంలోని ఓ గ్రామంలో చిన్నారులు వీధుల్లో ఆడుకుంటున్నారు. ఆ సమయంలో ఓ చిరుత పులి అకస్మాత్తుగా గ్రామంలోకి వచ్చింది. వీధిలో ఆడుకుంటున్న నీలేశ్‌ అనే చిన్నారిని నోట పట్టుకొంది. నీలేశ్‌తో ఆడుకుంటున్న అజిత్‌ సింగ్‌ దానిపై రాళ్లు విసిరాడు. అయినా చిరుత నీలేశ్‌ను వదిలేయకపోవడంతో అజిత్‌సింగ్‌ తన బొమ్మ కారును స్టార్ట్‌ చేసి దానిపై విసిరాడు. కారు చేసే చప్పుడుకు భయపడిన చిరుత నీలేశ్‌ను వదిలేసి పారిపోయింది. చిన్నారి మిత్రుడిని కాపాడిన అజిత్‌సింగ్‌ ‘సంజయ్‌ చోప్రా’ అవార్డుకు ఎంపికయ్యాడు.

కిడ్నాపర్‌ను పట్టించింది!

సాహో! సాహస బాలలూ

రాజస్థాన్‌లోని గోపాలపుర బైపాస్‌ ప్రాంతానికి చెందిన అనికా జైమిని (8) ఇంటి దగ్గర్లోని డెయిరీ నుంచి పాల ప్యాకెట్లు తీసుకొని తిరిగి వస్తోంది. ఓ కిడ్నాపర్‌ ఆమెను అపహరించేందుకు ప్రయత్నించాడు. మోటార్‌ సైకిల్‌పై బలవంతంగా ఎక్కించుకొని వేగం పెంచాడు. వెంటనే దానిపై నుంచి దుమికి అనికా పరుగందుకుంది. కిడ్నాపర్‌ ఆమెను వెంబడించాడు. అనికా కేకలు వేస్తుండటంతో స్థానికులు కిడ్నాపర్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అనికా ‘బాపు గైధాని’ అవార్డుకు ఎంపికైంది.

మంటల్లోంచి కాపాడింది!

సాహో! సాహస బాలలూ

మేఘాలయకు చెందిన పన్నెండేళ్ల కౌమిలియా సోదరుడిని మంటల నుంచి కాపాడింది. వాళ్ల ఇంటి పక్కన ఉన్న ఇంట్లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే అవి భారీగా విజృంభించడంతో కౌమిలియా వాళ్ల ఇంటికి అంటుకున్నాయి. కౌమిలియా వాళ్ల ఇంట్లో 17 ఏళ్ల వయస్సున్న ఆమె అన్న మానసిక దివ్యాంగుడు ఉన్నాడు. మంటలు ఇంటిని చుట్టుముట్టాయి. వెంటనే కౌమిలియా అన్నని మంటల మధ్య నుంచి బయటకు తీసుకువచ్చి ప్రాణాలు కాపాడింది. కౌమిలియా ‘బాపుగైధాని’ అవార్డుకు ఎంపికైంది.

మొసలి పని పట్టి!

సాహో! సాహస బాలలూ

ఒడిశాకు చెందిన సితూ మాలిక్‌ (14) తన మామను మొసలి బారి నుంచి కాపాడాడు. సితూ, అతని మామ బినోద్‌ మాలిక్‌ ఊరు దగ్గర్లోని ఏరు పక్కకు వెళ్లారు. బినోద్‌ మాలిక్‌ చేతులు కడుక్కొనేందుకు ఏటిలోకి దిగాడు. ఆ సమయంలో బినోద్‌ చేతిని హఠాత్తుగా మొసలి పట్టుకుంది. సితూ వెంటనే తేరుకొని తన వద్ద ఉన్న టార్చిలైట్‌ను మొసలి కళ్లపై వేశాడు. దృష్టి మళ్లించే ప్రయత్నం చేశాడు. ఫలితం లేకపోవడంతో వెంటనే పక్కనే ఉన్న వెదురు బొంగుతో మొసలి తలపై కొట్టి బినోద్‌ను వెనక్కు లాగి, రక్షించాడు.

సాహో! సాహస బాలలూ

ఆకతాయిల ఆట కట్టించారు!

సాహో! సాహస బాలలూ

హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ముస్కాన్‌ (17), సీమా (14)కలిసి వస్తుండగా ఓ ఆకతాయి అసభ్యంగా ప్రవర్తించసాగాడు. విసిగిపోయిన సీమా, ముస్కాన్‌ అతనిపై దాడి చేశారు. ఈ ఘర్షణలో ఆకతాయి ఎత్తుగా ఉన్న ప్రాంతం నుంచి ముస్కాన్‌ను నెట్టివేయడంతో ఆమెకు గాయాలయ్యాయి. సీమా, ఆమె స్నేహితులు అతనిని పట్టుకొని మహిళా ఠాణాకు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిపై కేసు పెట్టారు.

సమయస్ఫూర్తితో!

సాహో! సాహస బాలలూ

ఉత్తర్‌ ప్రదేశ్‌కి చెందిన కున్వర్‌ దివ్యాంశ్‌ సింగ్‌ (12), తన చెల్లెలు సమృద్ధి (5)తో కలిసి పాఠశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఓ ఎద్దు సమృద్ధిపై దాడి చేసింది. ఆ చిన్నారిని ఎత్తి వేసి తీవ్రంగా గాయపర్చింది. ఎద్దుతో చెల్లెలి ప్రాణాలకు ప్రమాదం ఉందని గ్రహించిన కున్వర్‌  చేతులతోనే దానిని ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. ఎద్దు తనపైకి వస్తుండటంతో సమయస్ఫూర్తితో స్కూల్‌ బ్యాగ్‌ను దాని తలకు తగిలించాడు. దీంతో అది భయపడి అక్కడి నుంచి పారిపోయింది.

సాహో! సాహస బాలలూ

చిన్నారి పెళ్లికూతుళ్ల్లు కాకుండా!

సాహో! సాహస బాలలూ

ఒడిశా కలహండి జిల్లాకు చెందిన రంజిత (12) ప్రభుత్వ సంక్షేమ వసతిగృహంలో ఉండి చదువుకుంటోంది. ఆమె కన్నా వయసులో చాలా పెద్దవాడైన ఓ తాగుబోతుకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించారు. సెలవుల్లో ఇంటికి వెళితే తనకు పెళ్లి చేస్తారని.. తాను వసతిగృహంలోనే ఉంటానని రంజిత పట్టుపట్టింది. విషయం కలెక్టర్‌ వరకు వెళ్లింది. కలెక్టర్‌ ఓ కమిటీని నియమించి దానిపై విచారణ జరిపించారు. రంజిత చెప్పిన దాంట్లో వాస్తవం ఉండటంతో రంజితతో పాటు ఆమె ఇద్దరి చెల్లెళ్లను ఇంటి నుంచి తీసుకువచ్చి వసతిగృహంలో ఆశ్రయం కల్పించారు. వారి చదువుల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇప్పించారు. ముగ్గురిని బాల్య వివాహాల బారిన పడకుండా కాపాడిన ఘనత రంజితకు దక్కింది.

బాంబుకు భయపడకుండా!

సాహో! సాహస బాలలూ

దిల్లీకి చెందిన పదమూడేళ్ల మణిదీప్‌ కుమార్‌ దీపావళి బాంబు ప్రమాదానికి గురికాకుండా చిన్నారిని కాపాడాడు. దీపావళి రోజున ఒకరు పేల్చిన బాంబు పూర్తిగా ఆరిపోకుండా అలానే ఉంది. ఓ చిన్నారి దానిని పట్టుకొని చూస్తోంది. అది ఏ క్షణమైనా పేలుతుందని మణిదీప్‌ గుర్తించాడు. వెంటనే ఆ చిన్నారి చేతి నుంచి దానిని తీసుకొని దూరంగా విసిరేసే ప్రయత్నంలో బాంబు పేలి మణిదీప్‌కు గాయాలయ్యాయి.

నీళ్లను లెక్కచేయక!

సాహో! సాహస బాలలూ

* ఒడిశాకు చెందిన ఝిలి బాగ్‌ (8) తెగువ చూపి బావిలో పడిపోయిన తన చెల్లిని రక్షించింది. మూడేళ్ల వయసున్న తన చెల్లెలు మిలి బాగ్‌, స్నేహితులు వారి ఇంటి సమీపంలోని పాత ఇంటిలో ఆడుకుంటున్నారు. ఆ సమయంలో మిలిబాగ్‌ ఓ పాడుబడిన బావిలో పడిపోయింది. తన చెల్లిని నీటిలో నుంచి తీసి బావిలో ఓ పక్కకు 20 నిమిషాలకుపైగా నిల్చొంది. ఆలోపు వచ్చిన పెద్దలు అక్కాచెల్లెళ్లను బావి నుంచి బయటకు తీశారు.

సాహో! సాహస బాలలూ

* కర్ణాటకకి చెందిన సి.డి.కృష్ణనాయక్‌ (14) తుంగ నది కాలువ సమీపం నుంచి వెళుతున్న పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులు కాలువలోకి దిగడం గమనించాడు. ఆ చిన్నారులు లోతైన కాలువలో పడిపోయారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోతున్నారు. అంతలో కాలువకు మరోవైపు ఉన్న కృష్ణ నాయక్‌ వెంటనే కాలువలో దూకి వారిద్దరిని రక్షించే ప్రయత్నం చేశాడు. ఒకరిని బయటకు తీసుకువచ్చాడు. ఇంకో చిన్నారి మాత్రం ప్రవాహ వేగానికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు.


సాహో! సాహస బాలలూ

* ఛత్తీస్‌గఢ్‌కి చెందిన రితిక్‌ సాహు (13), ఝగేంద్ర సాహు (11) వారి మిత్రులు సాహిల్‌ టాండన్‌, ఆకాశ్‌ స్వామ్‌తో కలిసి తమ గ్రామ సమీపంలోని నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు.  ప్రవాహం పెరగడంతో సమీపంలోని సుడిగుండంలో చిక్కుకుపోయాడు సాహిల్‌. అతనిని రక్షించేందుకు రితిక్‌, ఆకాశ్‌ ప్రయత్నించారు. సాహిల్‌ చేయి పట్టుకొని లాగుతూ ఆకాశ్‌ స్వామ్‌ సుడిగుండంలోకి పోయాడు. రితిక్‌, ఝగేంద్ర వారిద్దరిని రక్షించే ప్రయత్నం చేశారు. ఆకాశ్‌ స్వామ్‌ను బయటకు తీసుకురాగలిగారు. సాహిల్‌ నది ప్రవాహంలో గల్లంతయ్యాడు.


సాహో! సాహస బాలలూ

* మణిపూర్‌కి చెందిన వహెంగబామ్‌ (13)  చిన్న నీటి ప్రవాహం పక్క నుంచి నడుచుకుంటూ వెళుతుండగా ప్రవాహంలో ఓ ఆకుపచ్చని చొక్కా కనిపించింది. పరీక్షించి చూస్తే ఓ పసి బాలుడు. ఆ ప్రవాహంలోకి దూకి ఆ బాలుడిని బయటకు తీసుకువచ్చాడు.


సాహో! సాహస బాలలూ

* ఒడిశాకు చెందిన పదేళ్ల బిశ్వజిత్‌ వుహాన్‌ తమ గ్రామ సమీపంలోని మచ్చగావ్‌ కాలువలో మునిగిపోతున్న అయిదేళ్ల చిన్నారిని కాపాడాడు.


సాహో! సాహస బాలలూ

* ఛత్తీస్‌గఢ్‌కి చెందిన తొమ్మిదేళ్ల శ్రీకాంత్‌ గంజీర్‌ కాలువలో మునిగిపోతున్న తన నేస్తం ప్రాణాలు రక్షించాడు.


సాహో! సాహస బాలలూ

* కేరళకి చెందిన పదమూడేళ్ల శిగిల్‌.కె నదిలో చేపల పట్టేందుకు తన తల్లి, చెల్లితో కలిసి వెళ్లాడు. వీరిలాగే అదిల్‌, అసిఫ్‌.. వాళ్ల తల్లిదండ్రులు నదికి వచ్చారు. కాలు పట్టుతప్పడంతో అదిల్‌ (17) నదిలో పడిపోయాడు. అసిఫ్‌ అతనిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోగా అతనూ నదిలో పడిపోయాడు. వెంటనే అసిఫ్‌    తండ్రి నదిలోకి దూకాడు. ప్రవాహంలో అతనూ మునిగిపోతుండటంతో శిగిల్‌ పక్కనే ఉన్న పంచెను అసిఫ్‌ తండ్రికి అందించాడు. అది పట్టుకొని అతను బయటకు వచ్చాడు. శిగిల్‌ వెంటనే నీటిలో దూకి అసిఫ్‌ను బయటకు తీసుకువచ్చాడు. అదిల్‌ మాత్రం మునిగిపోయాడు.


సాహో! సాహస బాలలూ

* కేరళకి చెందిన అశ్విన్‌ సజీవ్‌ (9), అశ్విన్‌ టి సనీష్‌ సైకిల్‌ పోటీ పెట్టుకున్నారు. ఇద్దరూ నది గట్టుపై సైకిళ్లు తొక్కుతున్నారు. బ్రేక్‌లు ఫెయిలై సనీష్‌ సైకిల్‌ బ్యాలెన్స్‌ తప్పి నదిలోకి దూసుకుపోయింది. దగ్గర్లో ఉన్న వారు కేకలు వేయడంతో సజీవ్‌ సనీష్‌ నదిలో పడిన విషయాన్ని గమనించాడు. నదిలో దూకి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తన స్నేహితుని ప్రాణాలు కాపాడాడు.

- దూదిపాళ్ళ విజయ్‌, ఈనాడు, దిల్లీ

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.