close

తాజా వార్తలు

దూరాన్ని దగ్గర చేద్దాం

కొత్తబంగారులోకం

వరుణ్‌కు పదిహేడేళ్లు. అన్నింటికీ స్నేహితులపై ఆధారపడతాడు. సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు.

పద్మ కూతురు నిత్యకు పంతొమ్మిదేళ్లు. నిత్య తీసుకునే అన్ని నిర్ణయాల్లో పద్మ ప్రమేయం ఉండాల్సిందే. తనకు తోచిన సలహాలు ఇచ్చి బలవంతంగా పాటించేలా చేస్తుంది.

- ఇలా వాళ్లకు నచ్చిందే చేయాలని పిల్లలు... తమ మాటే నెగ్గాలనే తల్లిదండ్రులు... ఇద్దరూ పంతం పట్టుకుని కూర్చుంటున్నారు. అదే పెద్దలు, పిల్లల మధ్య దూరం పెంచుతోంది.

దమూడేళ్ల నుంచి టీనేజీ ప్రారంభం అవుతుంది. 18 ఏళ్ల నుంచి యౌవనం మొదలవుతుంది. ఈ పిల్లల్లో శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్లు విడుదలవుతాయి. వీటన్నింటి ప్రభావంతో వారి ఆలోచన విధానమూ మారుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వేచ్ఛ కోరుకుంటారు. తల్లిదండ్రుల సహాయం లేకుండా తాము ఏదైనా చేయగలమని అనుకుంటారు. వారికంటూ ఒక వ్యక్తిత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. స్నేహితులపై ఆధారపడటం మొదలుపెడతారు. తమ ఈడు వారే అర్థం చేసుకోగలరనే భావన వారిలో కలుగుతుంది. ఇదే తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరాన్ని పెంచుతుంది.

పెద్దవాళ్లు అనుమానిస్తారు...

తల్లిదండ్రుల తీరు మరోలా ఉంటుంది. తమ పిల్లలు ఏదీ చెప్పకపోవడంతో... అనుమానించడం మొదలుపెడతారు. ప్రతిదీ ప్రశ్నిస్తుంటారు. ‘ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు...’, ‘ఎవరితో ఛాటింగ్‌ చేస్తున్నావు...’, ‘మీ లెక్చరర్‌తో మాట్లాడమంటావా...’, ‘నీ స్నేహితుల పేర్లు చెప్పు’... అంటూ ఆరా తీస్తారు. వాళ్లు అనుసరించే ప్రతి ఫ్యాషన్‌ని విమరిస్తారు. వీటన్నింటితో పిల్లలూ చెప్పడం మానేస్తారు.

పెద్దవాళ్లు ఏం చేయాలంటే.... 

రోజంతా ఎక్కడ ఉన్నా... సాయంత్రం అందరూ కలిసి భోజనం చేయాలనే నియమాన్ని పెట్టాలి. దాన్ని అధిగమించకూడదని హెచ్చరించాలి.

అన్ని విషయాలు మీకే తెలుసనే ధోరణి వద్ధు అమాయకంగా ప్రశ్నిస్తూ, వాళ్ల నుంచి ఎక్కువ విషయాలు తెలుసుకునేలా చూడండి. పిల్లలు చెప్పేది సాంతం వినాలి. తరువాత వాస్తవాలు ఆలోచించాలి.

ఇంట్లో ఏదైనా చర్చ జరుగుతున్నప్పుడు పిల్లల అభిప్రాయాలు కచ్చితంగా పరిగణించాలి.

వాళ్ల చదువు, అభిరుచులు ఏవైనా సరే... వాళ్ల అభిప్రాయం, ఆసక్తికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకవేళ పిల్లల నిర్ణయం తప్పనుకుంటే అర్థమయ్యేలా వివరించి, నిర్ణయాధికారం వాళ్లకే వదిలేసి చూడండి.

పిల్లలు చేసే పొరపాట్లకు హితబోధ వద్ధు అది వాళ్లకు నచ్చదని అర్థం చేసుకోండి. బదులుగా ‘తప్పు ఎక్కడ జరిగిందో గ్రహించు, దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో నీకు తెలిసే ఉంటుంద’నే పదాలు వాడితే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో వారు చేసిన తప్పులను అవకాశం వచ్చినప్పుడల్లా ఎత్తిచూపే ప్రయత్నం అసలే వద్ధు

పిల్లలకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించడానికి ప్రయత్నించండి. వీలున్నప్పుడల్లా వాళ్లు ఇష్టపడే ప్రదేశాలకు తీసుకెళ్లండి. మీ బంధం దృఢమవుతుంది.

బయట ఏవైనా చిన్న చిన్న గొడవలు జరిగినా వెంటనే పిల్లలపై అరవకండి. ప్రతి దానికి వారినే నిందిస్తే పెద్దవాళ్లు తమను అర్థం చేసుకోరని అనుకుంటారు. వాళ్ల కోణం నుంచి ఆలోచించే ప్రయత్నం చేయడం ఎప్పుడూ మంచిదే.

పిల్లలతో స్నేహితుల్లా వ్యవహరించాలి. సాంకేతికత, ఫ్యాషన్లు... ఇలా రకరకాల అంశాల్ని వాళ్ల నుంచి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించండి.

పిల్లలూ మారాలి...

టీనేజీలోకి రాగానే స్వేచ్ఛ వచ్చేసినట్లు భావించకూడదు. తల్లిదండ్రులు చెప్పేది వినడం నేర్చుకోవాలి. పెద్దవాళ్లు దేన్నైనా తమ అనుభవాల్లోంచే చెబుతారని గ్రహించాలి.

ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు స్నేహితులతో పాటు, పెద్దవాళ్ల సలహాలు, సహాయం తీసుకోవడానికి ప్రయత్నించాలి. మీ మంచి కోరేది తల్లిదండ్రులేనని అర్థంచేసుకోవాలి.

అమ్మానాన్న ప్రశ్నించినా, ఏదయినా విషయాన్ని ఆరా తీసినా... మీకు సమస్య రాకుండా చేయడానికేనని ఆలోచించండి. ఒకవేళ వాళ్లు ఏదయినా అడిగినా... నిదానంగానే సమాధానం చెప్పాలి తప్ఫ.. విషయం దాటేయకూడదు.

పెద్దవాళ్లు మీ నిర్ణయాన్ని కాదనొచ్ఛు మీ ఆలోచనతో ఏకీభవించకపోవచ్ఛు అలాంటప్పుడు వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. పరిస్థితిని వివరించండి. ఒప్పుకోకుండా ఉండరు.

ప్రేమగా చెప్పాలి...

- వేద, హైదరాబాద్‌

మేం ఏదైనా పొరపాటు చేసినప్పుడు కోప్పడినట్లు గట్టిగా చెప్పడం కన్నా... నిదానంగా వివరించాలి. ప్రేమగా చెబితే మేం అర్థంచేసుకుంటాం. కొన్నిసార్లు అవసరం ఉండి ఏదైనా వస్తువు అడిగినప్పుడు వృథా అనడం కన్నా... ఎందుకు వద్దో వివరిస్తే మాకూ తెలుస్తుంది. లేదంటే మేం ఏది అడిగినా కొనివ్వరనే అభిప్రాయం కలుగుతుంది. మాకు చదువొక్కటే కాదు, స్నేహితులు, సరదాలు, ఆటలు ఉంటాయని అర్థంచేసుకుంటే చాలా సమస్యలు తగ్గుతాయి.

ఉదాహరణలతో చెప్పాలి...

- ఏ.శ్రీవిద్య, కరీంనగర్‌

తల్లిదండ్రులు ఎప్పుడూ కఠినంగా ఉండకూడదు. అలా ఉంటే పిల్లలు వారి మనసులో ఏముందో చెప్పడానికి భయపడతారు. మా వయసు వారి ఆలోచనల్లో చాలావరకు గందరగోళం ఉంటుంది. మేం తీసుకునే నిర్ణయాల్లో తప్పుంటే పెద్దవాళ్లు తమ అనుభవాన్ని ఉపయోగించి మంచి చెడులు చెప్పాలి. అంతేకానీ ఒకే మాటలో వద్దు అంటే... మేం అడిగింది ఏదీ ఇవ్వరనే భావన కలుగుతుంది. ఒక పని చెప్పినప్పుడు చేయకూడదు అని కాకుండా... ఎందుకు చేయకూడదో వివరిస్తే బాగుంటుంది. పిల్లల మనసును అర్థంచేసుకుని ప్రోత్సహించాలి. వాళ్లకు నచ్చింది చేయమని ఒత్తిడి తెస్తే మేం గందరగోళానికి లోనవడం ఖాయం.

సరదాగా ఉంటాను...

- గాజుల రజిత, జగిత్యాల

నాకు ఇద్దరు పిల్లలు. బయటి నుంచి రాగానే వాళ్ల రోజు ఎలా గడిచిందో తెలుసుకుంటా. పిల్లలు ఏది చెప్పినా పూర్తిగా వింటా. సరదాగా ఉండేందుకు ప్రయత్నిస్తా. అందరం కలిసే భోంచేస్తాం. ఇలా ఎప్పుడూ వారితోనే ఉండటం వల్ల పిల్లలు ఏ భయం లేకుండా తమ విషయాలు నాతో పంచుకుంటారు. చిన్నప్పటినుంచీ క్రమశిక్షణ అలవాటు చేశా. కొన్నిసార్లు వాళ్లు తాము చేసిందే సరైందనుకుని నా మాట వినరు. ఆ సమయంలో మందలిస్తూనే విషయం అర్థమయ్యేలా చేప్తా.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.