close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భారత్‌కు బయల్దేరిన తెలుగు విద్యార్థులు

కౌలాలంపూర్‌: కరోనా వైరస్‌ ఆందోళన నేపథ్యంలో మలేసియా రాజధాని కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో చిక్కుకున్న సుమారు 150 మంది తెలుగు విద్యార్థులు ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరారు. కరోనా భయంతో పలు దేశాల నుంచి భారత్‌కు వచ్చే విమానాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో దాదాపు 350 మంది భారతీయులు కౌలాలంపూర్‌తో పాటు ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా విమానాశ్రయాల్లో మంగళవారం పడిగాపులు కాశారు. చిక్కుకున్న వారిలో ఏపీలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు.. తెలంగాణ నుంచి హైదరాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. మంగళవారం ఉదయమే విమానాశ్రయాలకు చేరుకున్న వారంతా అర్ధరాత్రి వరకు అక్కడే వేచిచూడాల్సి వచ్చింది. 

చివరికి కౌలాలంపూర్ విమానాశ్రయం నుంచి దిల్లీ, విశాఖపట్నాలకు ఎయిర్‌ ఏషియా విమానాలను అనుమతిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రకటించారు. దీంతో ఆ విద్యార్థులకు ఊరట లభించింది. ఈ క్రమంలో కౌలాలంపూర్‌లో చిక్కుకున్న సుమారు 150 మంది తెలుగు విద్యార్థులు ఈ మధ్యాహ్నం ఎయిర్‌ ఏషియా విమానంలో విశాఖకు బయల్దేరారు. విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపింది. సీఎంవో, ఏపీ భవన్‌ అధికారులు సమన్వయం చేసుకుంటూ విదేశాంగ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపారు.



మరిన్ని