close

ప్రవాసుల కోసం కొత్త విధానం

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కసరత్తు
వంద దేశాల్లో పార్టీ విభాగాలు: ఎంపీ కవిత

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రసమితి ప్రవాస విభాగాలను వంద దేశాలకు విస్తరిస్తామని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బ్రిటన్‌, అమెరికాలతో మొదలైన తెరాస ప్రవాస శాఖలు ప్రస్తుతం 33 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని, త్వరలో మరో 67 దేశాల్లో వాటిని ఏర్పాటు చేసి, ఆయా దేశాల్లో గులాబీ జెండాలను ఎగురవేస్తామన్నారు. త్వరలోనే తెలంగాణ ప్రవాసుల విధానాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలిపారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ దీనిపై కసరత్తు చేస్తున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెరాస శ్రేణులు ప్రవాసులకు అండగా ఉండాలన్నారు. తెరాస ప్రవాస విభాగం 8వ వార్షికోత్సవం శనివారం తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగింది. ఇందులో కవిత ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘‘దేశ విదేశాల్లోని ప్రవాసులు తెలంగాణకు గొప్ప ఖ్యాతి తెస్తున్నారు. ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్‌ విదేశాలకు వెళ్లి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. ఆయన సూచనలతో విదేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలు వివిధ పేర్లతో సంఘాలు పెట్టుకుని పనిచేసిన విషయం తెలంగాణ సమాజం మరువదు. ప్రవాసుల కష్టాలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అమెరికా, గల్ఫ్‌ వంటి దేశాల్లో అక్కడి తెలంగాణవాసుల కోసం ఇక్కడ పార్టీకి వారధులుగా ప్రవాస విభాగాలు పనిచేయాలి. ప్రవాసుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. కొత్త ప్రవాస విధానం వచ్చాక పెద్దఎత్తున కార్యక్రమాలుంటాయి’’ అని కవిత తెలిపారు. అంతకుముందు ఆమె తెలంగాణ తల్లికి, ఆచార్య జయశంకర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రవాస విభాగం వార్షికోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకు కోసి పంచారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దేవీప్రసాద్‌, తెరాస ప్రవాస విభాగం వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం, బ్రిటన్‌ అధ్యక్షుడు అశోక్‌ దూసరి, న్యూజిలాండ్‌ శాఖ కోశాధికారి అభిలాష్‌ రంగినేని, అమెరికా ప్రతినిధులు సుధీర్‌, సురేశ్‌, రమేశ్‌, ఖతార్‌ ప్రతినిధి అభిలాష్‌ బండి పాల్గొన్నారు.


 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.