close
విద్యాశాఖ మంత్రిని తొలగించాలి 

బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలి 
సీఎంకు ఉత్తమ్‌, భట్టివిక్రమార్క బహిరంగ లేఖ 
విద్యార్థులకు న్యాయం చేయాలని పలువురు నేతల డిమాండ్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డు తీరుపై పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు. తప్పులకు బాధ్యులైన బోర్డు అధికారులను విధుల నుంచి, విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తొలగించి, సమగ్ర విచారణ జరపాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పూర్తి స్థాయిలో పునఃపరిశీలన నిర్వహించాలని, నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఆదుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి లోపాలు పునరావృతం కాకుండా వెంట‌నే ఇంటర్‌బోర్డును ప్రక్షాళన చేయాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సోమవారం ఉత్తమ్‌, భట్టివిక్రమార్క సంయుక్తంగా బహిరంగ లేఖ రాశారు. అధికారుల నిర్లక్ష్యం దాదాపు 9.45 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, తల్లిదండ్రులు, విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా.. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి పరిస్థితిని సమీక్షించకపోవడం దుర్మార్గమని తెలిపారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపై ఉన్న ద్యాస విద్యార్థుల మీద లేదని ధ్వజమెత్తారు. మరోవైపు దిల్లీలో ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం అంశాన్ని గ్లోబరీనా సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా అప్పజెప్పారని విమర్శించారు. ఈ సంస్థ ముఖ్యమంత్రి సమీప బంధువులదనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. 
ముఖ్యనేత ప్రమేయం ఉంది: భాజపా 
ముగ్గురు సభ్యుల కమిటీతో విద్యార్థులకు ఒరిగేదేమీ ఉండదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఈ వ్యవహారం వెనుక రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యనేత ఉన్నారని ఆరోపించారు. ఆయనపై, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ ఫలితాల ప్రక్రియను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడంపై హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాయగా, అవకతవకలు జరిగినందున, రుసుము లేకుండా ప్రభుత్వమే విద్యార్థులకు రీవాల్యుయేషన్‌ జరిపించాలని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.