అభివృద్ధి కోసం భాజపాకు ఓటేయండి: నడ్డా

తాజా వార్తలు

Published : 22/03/2021 16:10 IST

అభివృద్ధి కోసం భాజపాకు ఓటేయండి: నడ్డా

గువహటి: అసోంలో దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర భద్రతకు ప్రాధాన్యం ఇవ్వలేదని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. సోమవారం రాజ్‌గఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా నడ్డా కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్‌ పార్టీ అసోం సంస్కృతిని దెబ్బతీసింది. రాష్ట్ర భద్రతను ఆ పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదు. దాని ఫలితమే ఈ రోజు సమస్యలు పెరిగిపోయాయి. సరిహద్దుల్లో రాష్ట్రంలోకి అక్రమ చొరబాట్లు పెరిగిపోయాయి. కాంగ్రెస్‌ అవకాశవాద రాజకీయాలు చేస్తోంది. ఓవైపు కేరళలో ముస్లిం లీగ్‌తో పొత్తు పెట్టుకుని.. మరోవైపు అసోంలో బద్రుద్దీన్‌ అజ్మల్‌(ఏఐయూడీఎఫ్‌) పార్టీతో జతకట్టడానికి సిద్ధమైంది’ అంటూ కాంగ్రెస్‌పై నడ్డా విమర్శలు గుప్పించారు.  

‘భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల్లో దేశంలో ఉన్న 2.5కోట్ల గృహాలను విద్యుదీకరించాం. నరేంద్రమోదీ ప్రభుత్వం వెదురుకు సంబంధించిన చట్టాలను సరళీకృతం చేసింది. అంతేకాకుండా 75 హెక్టార్లలో వెదురుకు సంబంధించిన పారిశ్రామిక పార్కును నిర్మిస్తోంది. రాష్ట్రంలో 3.3లక్షల మందికి స్థలాలు లీజుకు ఇచ్చాం. అంతేకాకుండా రహదారులను కూడా అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో ఖడ్గమృగాల వేటను నిర్మూలించాం. సరిహద్దుల్లో ఉపగ్రహల ద్వారా నిఘా పెంచి భద్రతను కట్టుదిట్టం చేశాం. కాబట్టి రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే భాజపాకు ఓటేయాలి’ అని నడ్డా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని