నందిగ్రామ్‌ బరి.. దీదీ వ్యూహమేంటి?

తాజా వార్తలు

Updated : 05/03/2021 17:15 IST

నందిగ్రామ్‌ బరి.. దీదీ వ్యూహమేంటి?

నందిగ్రామ్‌.. 14ఏళ్ల క్రితం భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల పోరాటంతో దద్దరిల్లిన నేల. మూడు దశాబ్దాల వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ మమతా బెనర్జీకి అధికారం కట్టబెట్టిన ప్రాంతం. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి కీలక సంగ్రామానికి వేదిక కాబోతోంది. పదేళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతూ హ్యాట్రిక్‌ విజయంపై దృష్టిపెట్టిన సీఎం దీదీ.. ఈసారి తన నియోజకవర్గమైన భవానీపూర్‌ను వదిలి.. నందిగ్రామ్‌లో అడుగుపెట్టారు. అటు మమతకు పోటీగా కీలక నేత సువేందు అధికారిని రంగంలోకి దించేందుకు భాజపా సిద్ధమవుతోంది. మరి అధికారి కుటుంబానికి పెట్టనికోటలా ఉన్న ఈ ప్రాంతం నుంచి దీదీ పోటీ వెనుక వ్యూహమేంటి..? దశాబ్దం కిందట మమతను సీఎం కుర్చీపై కూర్చోబెట్టిన నందిగ్రామ్.. మరోసారి ఆమెకు అధికార పగ్గాలు అందిస్తుందా..?

కమ్యూనిస్టుల కోటకు దీదీ.. దాదా బీటలు 

పశ్చిమ బెంగాల్‌లో తూర్పు మేదినీపూర్‌ జిల్లాలో ఉన్న నందిగ్రామ్‌ ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. అయితే 2007లో ఓ ఇండోనేషియా కంపెనీ కోసం వామపక్ష ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దాదాపు మూడు నెలల పాటు సాగిన ఆ ఉద్యమాన్ని మమతా బెనర్జీ, సువేందు అధికారి(దాదా) ముందుండి నడిపించారు. ఈ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్యమం తర్వాత సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. 2009లో జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్‌ పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించింది. ఆ తర్వాత 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై పెను ప్రభావం చూపించింది. మూడు దశాబ్దాల పాటు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన కమ్యూనిస్టులను పడగొట్టి దీదీ అధికారంలోకి వచ్చారు. 

శక్తిమంతమైన ‘అధికారి’..

2007లో నందిగ్రామ్‌ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది అధికారి కుటుంబమే. ఈ ప్రాంతంలో వీరికి మంచి పట్టుంది. గతంలో రెండుసార్లు తమ్లుక్‌ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన సువేందు.. 2016 ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి  శిశిర్‌ అధికారి, పెద్ద అన్నయ్య దివ్యేందు అధికారి కూడా కాంటి, తమ్లుక్‌ ఎంపీలుగా ఉన్నారు. సువేందు తూర్పు మిడ్నాపూర్‌లో బలమైన నేత కావడంతో పాటు పశ్చిమ మిడ్నాపూర్‌, బంకురా, పురూలియా, ఝార్‌గ్రామ్‌, బిర్భుంలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు 40 అసెంబ్లీ స్థానాల్లో వీరికి మంచి బలముంది. నందిగ్రామ్‌ ఉద్యమంలో మరణించిన కుటుంబాలతోనూ సువేందుకు అనుబంధం ఉంది.

దీదీ ఆగమనం వెనుక..

నందిగ్రామ్‌ ఉద్యమంతో మమతకు మహిళా నేతగా గొప్ప పేరొచ్చింది. అదే ఆమెను సీఎం పీఠంవైపునకు నడిపించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నందిగ్రామ్‌ బాధ్యతలను పూర్తిగా సువేందుకే అప్పగించారు. టీఎంసీలో మమతకు సువేందు అత్యంత సన్నిహితుడు కూడా. అలాంటి నేత పార్టీని వీడి.. భాజపాలో చేరడం దీదీకి గట్టి షాకే అని రాజకీయ నేతలు భావించారు. అయితే ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మల్చుకునేందుకే దీదీ నందిగ్రామ్‌ రణరంగంలోకి దిగారు. 

జంగల్‌మహల్‌, నందిగ్రామ్‌లో పాపులారిటీ ఉన్న సువేందు అధికారి కుటుంబం ప్రచారం భాజపాకు అదనపు బలం. ఇలాంటి సమయంలో దీదీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే అధికారి కుటుంబం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నందిగ్రామ్‌పైనే ఎక్కువ దృష్టిపెట్టే అవకాశముంది. అలా వారిని ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చెక్‌ పెట్టేందుకే మమత బరిలోకి దిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్యమం నాటి ఛరిష్మాను ప్రజలకు గుర్తుచేసి ఓటర్లను ఆకట్టుకోవాలని దీదీ ప్రణాళిక. అంతేగాక, నందిగ్రామ్‌లో ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. సువేందు ఇప్పుడు భాజపాలో చేరడంతో వీరంతా ఆయనకు మద్దతివ్వరని దీదీ విశ్వాసం. మరోవైపు ఇక్కడ ఎస్సీ ఓటర్లు కూడా తృణమూల్‌కు మద్దతుగా ఉంటున్నారు. నందిగ్రామ్‌ వంటి కీలక స్థానం నుంచి పోటీ చేసి.. గెలుపుపై తన ధీమాను బహిరంగంగా వ్యక్తపర్చుకోవాలని దీదీ యత్నిస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీపై సానుకూల ప్రభావం చూపిస్తాయని దీదీ విశ్వాసం.

మరో కారణం కూడా.. 

అయితే మమత నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగడానికి మరో కారణమూ లేకపోలేదు. గతంలో ఆమె భవానీపూర్‌ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో దాదాపు లక్ష ఓట్ల మెజార్టీతో దీదీ విజయం సాధించగా.. 2016లో మాత్రం ఆమె గెలుపు మార్జిన్‌ 25వేలకు పడిపోయింది. అంతేగాక, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ వార్డులో భాజపా కంటే తృణమూల్‌కు ఓట్లు తక్కువగా వచ్చాయి. దీంతో ఈసారి పోటీ చేస్తే ఓటమి తప్పదని భావించిన దీదీ.. నందిగ్రామ్‌ను పోటీ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

2016లో నందిగ్రామ్‌లో సువేందు 80వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అదే నమ్మకంతో ఈ సారి దీదీని 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని ఆయన గట్టిగా చెబుతున్నారు. లేదంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్‌ విసురుతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఈ పోరు రసవత్తరంగా మారింది.. మరి నందిగ్రామ్‌ ఓటర్లు ఎవరివైపు ఉంటారో.. మే 2నే తెలుస్తుంది..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని