బెంగాల్‌ను మరింత బలంగా మారుస్తా: మమతా

తాజా వార్తలు

Published : 02/01/2021 00:29 IST

బెంగాల్‌ను మరింత బలంగా మారుస్తా: మమతా

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏర్పాటై నేటికి 23 ఏళ్లు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. రోజు రోజుకూ మరింత బలమైన రాష్ట్రంగా తయారు చేస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంకల్పించారు.  తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏర్పాటై నేటితో 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ట్వీట్‌ చేశారు. పార్టీనే తల్లిగా, ఆస్తిగా భావించి అహర్నిశలు పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను ఆమె అభినందించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచారని కొనియాడారు. ‘‘తృణమూల్‌ కాంగ్రెస్‌కు నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. 1998 నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం. లక్ష్యాలను చేరుకునేందుకు ఎంతో కష్టపడ్డాం. ప్రజల కోసం భవిష్యత్‌లో శ్రమిస్తూనే ఉంటాం’’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. 

దాదాపు 25 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీతో కలిసి అడుగులు వేసిన తర్వాత, కొన్ని రాజకీయ కారణాల వల్ల 1998, జనవరి 1న మమతా బెనర్జీ తృణమూల్‌ కాంగ్రెస్‌ను స్థాపించారు. అయితే పార్టీ స్థాపించిన వెంటనే తృణమూల్‌ ప్రస్థానం నల్లేరుమీద నడకలా సాగలేదు. 34 ఏళ్లపాటు అధికారంలో ఉన్న వామపక్షాలను ఓడించి.. 2011లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ దీదీనే విజయం వరించింది.

2021లో పశ్చిమబెంగాల్‌లో మరోసారి శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మాత్రం తృణమూల్‌కు భాజపా ప్రధాన పోటీదారుగా నిలుస్తోంది. ప్రధానిగా మోదీ రెండో సారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో భాజపా బలం క్రమంగా పుంజుకుంటోంది. ఇప్పటికే పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కీలక నేత సువేందు అధికారితోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయారు. మరికొంత మంది కూడా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికలను ఎదుర్కోవడం మమతా బెనర్జీకి అంతసులువేం కాదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి

ఒకే దేశం..ఒకే ఎన్నిక సాధ్యమేనా?

సీఎం మాట తప్పారు: బండి సంజయ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని