ఏ ఎన్నికలైనా భయపడేది లేదు: ఆదిమూలపు

తాజా వార్తలు

Published : 11/01/2021 01:31 IST

ఏ ఎన్నికలైనా భయపడేది లేదు: ఆదిమూలపు

నెల్లూరు: రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ పంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదల చేశారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సోమవారం నెల్లూరులో రెండో విడత జగనన్న అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి  ప్రారంభిస్తారని తెలిపారు. ఏ ఎన్నికలకైనా వైకాపా ఎట్టిపరిస్థితుల్లోనూ భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎంత చెప్పినా ఎస్‌ఈసీ వినడం లేదని మంత్రి మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులు అనిల్‌కుమార్‌‌, మేకపాటి గౌతం రెడ్డితో కలిసి నెల్లూరులో మంత్రి సురేశ్‌ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నియమావళికి లోబడే నెల్లూరులో జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

అనంతరం మంత్రి అనిల్‌ మాట్లాడుతూ.. ‘‘తొందర్లోనే తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అందులో ఓడిపోతామనే భయం తెదేపా అధినేత చంద్రబాబుకు పట్టుకుంది. అలా జరిగిన తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే మరోసారి ఓటమి చవిచూడాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే తెదేపాకు భవిష్యత్తు ఉండదని ఆయన భావిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏదో విధంగా ఎన్నికలు నిర్వహించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైకాపా వెనకడుగు వేసేది లేదు. కచ్చితంగా వైకాపా విజయం సాధిస్తుంది. తెలుగుదేశం పార్టీకి డిపాజిట్‌ కూడా రాదు.

పవన్‌ వ్యాఖ్యలు అర్థరహితం
తూర్పు గోదావరి జిల్లాలో దివీస్‌ పరిశ్రమ ఏర్పాటుపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న విమర్శలు అర్థరహితంగా ఉన్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనుమతులు ఇచ్చినప్పుడు ఏం మాట్లాడని పవన్‌ ఇప్పుడెందుకు హడావుడి చేస్తున్నారని ప్రశ్నించారు. పరిశ్రమ ఏర్పాటుపై స్థానికుల నుంచి వ్యతిరేకత రాగానే జోక్యం చేసుకున్నాయని వెల్లడించారు. సమస్యలన్నీ పరిష్కారం అయ్యేవరకు నిర్మాణంపై ముందుకు వెళ్లొద్దని పరిశ్రమ యాజమాన్యాన్ని ఆదేశించినట్లు చెప్పారు. పనన్‌ కల్యాణ్ తెలిసి మాట్లాడుతున్నారా? లేక ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? అనేది అర్థం కావడం లేదన్నారు.

ఇవీ చదవండి..

కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి

ఇంగ్లాండ్‌ మహారాణి, రాజుకు కరోనా టీకా..!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని