‘నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’
close

తాజా వార్తలు

Updated : 17/04/2021 13:05 IST

‘నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి:  తెదేపా నేతలు దొంగ ఓటర్లను పురమాయించి.. వైకాపా దొంగ ఓట్లు వేయిస్తోందని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెదేపా అనుకూల మీడియా పోలింగ్‌ బూత్‌లకు వెళ్లి ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఓటర్లను మీడియా ఇబ్బంది పెట్టడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. 

‘‘నారా లోకేశ్‌ నన్ను వీరప్పన్‌గా ట్వీట్‌ చేశారు. రాజకీయ లబ్ధికోసం ఏదంటే అది మాట్లాడితే ఉపేక్షించం. కిరణ్‌ కుమార్‌రెడ్డితో కలిసి  తెదేపా వాళ్లే ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేశారు. నన్ను స్మగ్లర్‌గా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. తెదేపా తీరు చాలా అభ్యంతరకరం. తిరుపతి ఉప ఎన్నికలో వైకాపాను ఎదుర్కోలేక ముందుగా ప్రణాళిక రచించి దారుణాలు చేస్తున్నారు. తెదేపాకే ప్రజాబలం ఉందా? వైకాపాకి ప్రజా బలం లేదా?. ఫలితాల రోజు తెలుస్తుంది.. ఎవరికి ప్రజాబలం ఉందో. తిరుపతి యాత్రా స్థలం కావడంతో ప్రైవేటు బస్సులు వస్తాయి. ఆ బస్సులు వైకాపావిగా చిత్రీకరించడం దారుణం. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి తెలుసుకుని మసలుకుంటే ఎన్నికల్లో కొనసాగుతారు. లేదంటే ఇవే చంద్రబాబుకు చివరి ఎన్నికలు’’ అని పెద్దిరెడ్డి అన్నారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మీడియా సమావేశం నిర్వహిస్తుండగా తెదేపా తిరుపతి పార్లమెంట్‌ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌ .. కన్వెన్షన్‌ సెంటర్‌ బయట నిరసన చేపట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నరసింహయాదవ్‌తో పాటు తెదేపా నేతలను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని