తమిళనాట రాజకీయ శూన్యత ఉందా? 
close

తాజా వార్తలు

Updated : 20/02/2021 05:53 IST

తమిళనాట రాజకీయ శూన్యత ఉందా? 

విశ్లేషకులేమంటున్నారు?

తమిళ రాజకీయ ముఖ చిత్రాన్ని తలచుకుంటే వెంటనే గుర్తొచ్చే ఇద్దరు దిగ్గజాలు కరుణానిధి, జయలలిత. ఇద్దరూ రెండు ధ్రువాలుగా తమిళ రాజకీయాలను సుదీర్ఘకాలం పాటు శాసించారు. అక్కడ ఎలాంటి ఎన్నికలు జరిగినా వీరిరువురి పర్యవేక్షణలోనే నువ్వా.. నేనా అన్నట్టు పోటీ పడేవి డీఎంకే, అన్నాడీఎంకే. కానీ వీరిద్దరి మరణంతో రానున్న 2021 అసెంబ్లీ ఎన్నికలకు ఈ దిగ్గజ నేతలు లేకుండా వెళ్తున్నాయి ఆయా పార్టీలు.ఈ నేపథ్యంలో తమిళ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న రాజకీయ శూన్యత మాటేంటి? దాన్ని ఆసరాగా చేసుకొని ఆ రాష్ట్రంలో అడుగు పెట్టిన జాతీయ పార్టీల ఆలోచనలేంటి?

తమిళనాడులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అయితే కరుణానిధి ప్రాతినిధ్యం వహించే డీఎంకే, లేదంటే జయలలిత సారథ్యంలోని ఏఐఏడీఎంకేనే అధికారం మార్చి మార్చి వరించేది. దీంతో మరో నేతకు అవకాశం లేకుండా ఉండేది. దాంతో పాటు వీరిద్దరూ బద్ధశత్రువులుగా ప్రసిద్ధి. ఈ ఇద్దరు నేతలు రాజకీయాల్లో విశేష అనుభవం సొంతం చేసుకున్నారు. ఎన్నో దశల్లో కార్యకర్త స్థాయి నుంచి సీఎంల స్థాయికి చేరుకున్నారు. అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు రాజకీయ యుద్ధక్షేత్రంలో నిలదొక్కుకొనేందుకు ఎన్నో ఆటుపోట్లు తిన్నారు. వారి మాటలు, చేతలతో ప్రజల్లో విపరీతమైన అభిమానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి ఇద్దరు దిగ్గజ నేతలు కొన్ని నెలల వ్యవధిలోనే మరణించడంతో తమిళనాట రాజకీయ శూన్యత నెలకొందనే భావన కలుగుతోంది.

వీరిద్దరి మరణం తర్వాత తమిళనాడులో జరిగిన పరిణామాలను గమనిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. అప్పటివరకు స్తబ్ధుగా ఉన్న జాతీయపార్టీలు తమిళ రాజకీయాల్లో వాటా దక్కించుకొనేందుకు వేగంగా పావులు కదిపాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ స్టాలిన్‌కు మద్దతుగా నిలవగా.. పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం పోరును ఆసరాగా చేసుకొని భాజపా అన్నాడీఎంకే పక్షాన నిలిచింది. వారితో పాటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయి.

అప్పటివరకు తమకేం పట్టనట్టు ఉన్న సినీ ప్రముఖులు కొంతమంది వరుసగా రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడారు. తమిళనాడులో రాజకీయ శూన్యత ప్రస్తావన రావడానికి ఇదే మరో ప్రధాన కారణం. సినీ ప్రపంచంలో రజనీకాంత్‌కు ఉన్న ప్రజాదరణ మాటల్లో చెప్పలేం. ఆయనపై ఎంతో ఆరాధనాభావం పెంచుకున్న తమిళ ప్రజలు రాజకీయాల్లోకి రావాలని దశాబ్దాలుగా కోరుతూనే ఉన్నారు. కానీ ఆయన్నుంచి ఎలాంటి స్పందనా ఉండేది కాదు. హఠాత్తుగా దిగ్గజనేతల మరణం తర్వాత తానూ ప్రజాసేవకు సిద్ధమంటూ ప్రకటించారు. ఆయనతో పాటే లోకనాయకుడిగా కీర్తినందుకొనే కమల్‌హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం)అంటూ పార్టీ పేరు ప్రకటించారు. వీరిద్దరూ రాజకీయాల్లోకి వచ్చేందుకు చూపించిన ఏకైక కారణం రాజకీయ శూన్యతే.

తమిళనాడులోని రెండు ప్రధాన పార్టీల్లో రాజకీయ శూన్యత ఉందన్న ప్రశ్నే వద్దు. అవి ఇప్పటికే సమసిపోయాయి. రాజకీయాల్లో శూన్యతలు ఎక్కువ కాలం నిలబడవు. అన్నాడీఎంకేలో పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య విభేదాలు ముగిసిపోయి ఇద్దరి నాయకత్వంలో ఆ పార్టీ పనిచేస్తోంది. అలాగే, కరుణానిధి చివరి రోజుల్లో డీఎంకే పార్టీకి స్టాలిన్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన మరణం తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఎక్కడా శూన్యత లేదు.- ఎస్‌ మురారి, సీనియర్‌ పాత్రికేయులు 

వాస్తవానికి రెండు ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల్లో కీలక నేతల మరణం తర్వాత కొన్ని వివాదాలు ఏర్పడ్డాయి. అవి పెరిగిపెద్దవై పార్టీల మనుగడనే ప్రమాదంలోకి నెట్టేస్తాయా? అనే సందేహమూ ఒకానొక సందర్భంలో కలిగింది. 

చాలా కాలం తర్వాత తమిళనాడులో కరుణానిధి, జయలలిత లాంటి ప్రజాదరణ కలిగిన నేతలు లేకుండా ఎన్నికలు జరగనున్నాయి. పెద్ద నాయకులు మరణించినా, రాజకీయాల నుంచి తప్పుకున్నా ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతూనే ఉంటుంది. నెహ్రూ మరణించినప్పుడూ ఇలాంటి పరిస్థితులే చూశాం. కానీ లాల్‌బహుదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీ సహా ఎంతో మంది నేతలు వచ్చారు. కాబట్టి రాజకీయాల్లో నాయకత్వ సమస్య ఎప్పుడూ ఉండదు. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. కానీ.. కరుణానిధి, జయలలితకు ఉన్న ప్రజాదరణ స్టాలిన్‌, పళనిస్వామిలకు ఉందా అంటే లేదనే చెప్పాలి. - శ్రీనివాసన్‌ రవిచంద్రన్‌, రాజకీయ విశ్లేషకులు

ఏ రంగంలోనైనా కొన్ని సందర్భాలలో శూన్యతా భావన వస్తుంటుంది. కానీ ఆ పరిస్థితులు ఎంతో కాలం ఉండవని, రోజులు గడుస్తున్న కొద్దీ మారిపోతుంటాయని అంటున్నారు విశ్లేషకులు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని