తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు దీక్ష భగ్నం

తాజా వార్తలు

Updated : 16/02/2021 09:58 IST

తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు దీక్ష భగ్నం

విశాఖ: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్షను అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. శ్రీనివాసరావును దీక్ష శిబిరం నుంచి నగరంలోని కృషి ఐకాన్‌ ఆసుపత్రికి బలవంతంగా తరలించారు. పల్లాను ఆసుపత్రికి తరలిస్తుండగా తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తెదేపా శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు. గత ఆరురోజులుగా పల్లా ఆమరణ దీక్ష చేస్తున్నారు. పల్లా దీక్షకు సంఘీభావం తెలిపేందుకు తెదేపా అధినేత చంద్రబాబు ఈ రోజు విశాఖ రానున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు ముందే పోలీసులు దీక్ష భగ్నం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు‌పరం చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 10న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు దీక్ష చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున తెదేపా నేతలు పల్లా దీక్షకు సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులు సైతం విశాఖ చేరుకుని పల్లా దీక్షకు మద్దతు తెలిపారు. 

దీక్ష కొనసాగిస్తా: పల్లా

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... పోలీసులు అర్ధరాత్రి దీక్ష భగ్నం చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉప సంహరించుకునే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ నిర్వాసితులకు న్యాయం చేయాలని పల్లా డిమాండ్‌ చేశారు.


 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని