close

ప్రధానాంశాలు

ఆఖరి ప్రయత్నాలు

పుర ఎన్నికల్లో ‘ఉపసంహరణల’కు పార్టీల పాట్లు

ఈనాడు యంత్రాంగం : పురపాలక ఎన్నికల్లో ఉపసంహరణల పర్వం కొనసాగుతోంది. మంగళవారం గడువు ముగియనుండటంతో పార్టీలు ఆఖరి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఫలితంగా పలువురు సోమవారం నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నంలోగా తిరుగుబాటు అభ్యర్థులందర్ని విరమింపచేస్తామని పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార తెరాసలో అభ్యర్థిత్వాల కోసం తీవ్రమైన పోటీ ఉండటంతో బుజ్జగింపుల పర్వం కొనసాగింది. కొన్ని చోట్ల హామీలు, తాయిలాలు ఇస్తున్నట్లు తెలిసింది. మరికొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు నామినేషన్లు దాఖలు చేసినవారితో నేరుగా మాట్లాడి సముదాయించారు. సాధ్యమైనన్ని వార్డులను ఏకగ్రీవం చేసే ప్రయత్నాలను తెరాస నేతలు సోమవారమూ కొనసాగించారు.

మరో 10 వార్డుల్లో ఒక్కొక్కరే
నామినేషన్ల ఉపసంహరణ నేపథ్యంలో సోమవారం నాటికి మరో 10 వార్డుల్లో ఒక్కో అభ్యర్థే బరిలో మిగిలారు. దీంతో ఈ స్థానాలు ఏకగ్రీవమైనట్లే. ఆదివారం వరకు రాష్ట్రంలో 16 వార్డుల్లో ఒక్కొక్కరే పోటీలో ఉన్నారు. దీంతో సోమవారం వరకూ 26 వార్డులు ఏకగ్రీవమైనట్లే. వీటిలో 24 వార్డుల్లో తెరాస అభ్యర్థులుండగా రెండు వార్డుల్లో ఎంఐఎం వారున్నారు.

* వికారాబాద్‌లో 14 వార్డు నుంచి రామస్వామి, సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో 8వ వార్డు తెరాస అభ్యర్థి కొలన్‌ రోజారాణి మాత్రమే బరిలో ఉన్నారు. రామస్వామి కాంగ్రెస్‌ నుంచి నామినేషన్‌ వేయగా ఆదివారం రాత్రే తెరాసలో చేరారు.
* వరంగల్‌ గ్రామీణ జిల్లా పరకాల పురపాలక ఎన్నికల్లో సోమవారం మరో రెండు వార్డుల్లో తెరాస అభ్యర్థులే మిగిలారు. ఆదివారం నాలుగు స్థానాలు ఏకగీవ్రం కాగా.. సోమవారం  13వ వార్డులో శనిగరం రజనీ, 15వ వార్డులో చందుపట్ల సుజాత ఎన్నిక లాంఛనమే.
* తొర్రూరు మున్సిపాలిటీలో సోమవారం 12వ వార్డు తెరాస అభ్యర్థి సురేందర్‌రెడ్డి ఎన్నిక ప్రకటించాల్సి ఉంది.
* బోధన్‌ పరిధిలోని 19వ వార్డు అభ్యర్థిని ఖమరున్నీసా బేగం (తెరాస) ఎన్నిక ప్రకటించడమే తరువాయి. ఇదే జిల్లాలోని భీమ్‌గల్‌ పురపాలక ఎన్నికల్లో భాగంగా ఏడో వార్డు నుంచి పోటీ చేసిన తెరాస అభ్యర్థిని ఎంఏ.ఖైరున్నీసా బేగం ఒక్కరే బరిలో మిగిలారు.
* ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో రెండు, వైరాలో ఒక వార్డు తెరాసకు ఏకగ్రీవమయ్యాయి. సత్తుపల్లి 17వ వార్డు తెరాస అభ్యర్థి వేములపల్లి పుష్పలత ఒక్కరే పోటీలో మిగిలారు. ఆరో వార్డు తెరాస అభ్యర్థి తోట సుజలరాణి ఏకగ్రీవం కానున్నారు. ఇక్కడ ఆమెతోపాటు ఆమె భర్త గణేశ్‌ కూడా నామినేషన్‌ వేశారు. మంగళవారం ఆయన ఉపసంహరించుకోనున్నారు.
* వైరా మూడో వార్డులో తెరాస తరపున నామినేషన్‌ వేసిన ఏదుమూరి పద్మజ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.