close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అప్పుల ఊబిలో రాష్ట్రం

 టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ఆరోపణ

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే ప్రభుత్వం రూ. మూడు లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఆదివారం క్విట్‌ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో జాతీయ పతాకాన్ని ఉత్తమ్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు మల్లు భట్టివిక్రమార్క, కె.జానారెడ్డి, వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ సహా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే సీఎం కేసీఆర్‌ కొత్త సచివాలయంపైనే దృష్టి సారించారని ఉత్తమ్‌ ఆరోపించారు. గ్రావిటీ ద్వారా 6.3 టీఎంసీల నీరు వచ్చే కృష్ణా ప్రాజెక్టులను చేపట్టలేదన్నారు. మంత్రిమండలి పేరుతో కృష్ణా అపెక్స్‌ కమిటీ సమావేశం వాయిదా వేయించడం సరికాదన్నారు. జీహెచ్‌ఎంసీ, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు సూచించారు. దివంగత సీనియర్‌ నేత నంది ఎల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నంది ఎల్లయ్య సంతాప సభ నిర్వహిస్తామని తెలిపారు. సోమవారం సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నంది ఎల్లయ్య సంతాప సభలను నిర్వహించాలన్నారు.
ఉపరాష్ట్రపతి సంతాపం
ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఎల్లయ్య సోదరుడు కృష్ణకు ఆదివారం ఆయన లేఖ రాశారు. ‘‘క్రమశిక్షణ, నిబద్ధత, చిత్తశుద్ధితో ముందుకుసాగిన ఎల్లయ్య రాజకీయ జీవితం ఆదర్శమైంది. వివాదరహితమైంది. చట్టసభల్లో ఆయన పాత్ర అనుసరణీయం. కుటుంబ సభ్యులు, తెలంగాణ ప్రజలకు ఎల్లయ్య లేని లోటు తీర్చలేనిది’’ అని లేఖలో వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
గొప్ప నాయకుడిని కోల్పోయాం: రాహుల్‌
దళిత హక్కుల కోసం గొంతెత్తిన నంది ఎల్లయ్య మరణం బాధాకరమని.. కాంగ్రెస్‌ పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ ఒక ప్రకటనలో నివాళులర్పించారు.
నారాయణ్‌పేట- కొడంగల్‌
ఎత్తిపోతలు చేపట్టాలి: రేవంత్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్‌: నారాయణ్‌పేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధ్దరించి పనులు చేపట్టాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించకుంటే ప్రజలతో కలసి పోరాడతామని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగలేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి సామర్థ్యాన్ని ఒక టీఎంసీకి కుదించినందున నారాయణ్‌పేట, కొడంగల్‌ ప్రాంతాలకు నీరు రాదని పేర్కొన్నారు. నారాయణ్‌పేట-కొడంగల్‌ పథకానికి రూ.1450 కోట్లు వెచ్చిస్తే 1.07 లక్షల ఎకరాలకు నీరొస్తుందని తెలిపారు. ఏపీ జారీ చేసిన 203 జీవో తెలంగాణకు శాపంగా మారుతుందని చెప్పినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.