close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గుజరాత్‌ పురపోరులో కమలం హవా

6 నగరపాలికలూ భాజపాకే  
సూరత్‌లో ఖాతా తెరవని హస్తం
అహ్మదాబాద్‌లో 7 చోట్ల ఎంఐఎం పాగా

అహ్మదాబాద్‌: గుజరాత్‌పై తన పట్టును భాజపా మరోసారి నిరూపించుకుంది. నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 576 సీట్లకుగాను ఏకంగా 483 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్‌ కేవలం 55 స్థానాలకే పరిమితమైంది. సూరత్‌లో ఖాతా కూడా తెరవలేకపోయింది. అహ్మదాబాద్‌, రాజ్‌కోట్‌, జామ్‌నగర్‌, భావ్‌నగర్‌, వడోదరా, సూరత్‌ నగరపాలక సంస్థల ఎన్నికలు ఈ నెల 21న జరిగాయి. ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. కమల దళానికి అహ్మదాబాద్‌లో మొత్తం 192 స్థానాలకుగాను 159, రాజ్‌కోట్‌లో 72 సీట్లకుగాను 68, జామ్‌నగర్‌లో 64 స్థానాలకుగాను 50, భావ్‌నగర్‌లో 52 సీట్లకుగాను 44, వడోదరాలో 76 స్థానాలకుగాను 69, సూరత్‌లో 120 సీట్లకుగాను 93 దక్కాయి.
ఆప్‌ శెభాష్‌!
తొలిసారి ఈ ఎన్నికల బరిలో నిలిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మంచి ఫలితాలు రాబట్టింది. 27 సీట్లను గెల్చుకుంది. అవన్నీ సూరత్‌లోనివే. తద్వారా సూరత్‌లో ఆప్‌ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. తొలిసారిగా గుజరాత్‌ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన ఏఐఎంఐఎం అహ్మదాబాద్‌లో ఏడు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.
ప్రధాని మోదీ హర్షం
గుజరాత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాజపా జయభేరి మోగించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సుపరిపాలన, అభివృద్ధి రాజకీయాలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని తాజా ఫలితాలు చాటిచెప్తున్నాయని వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్‌ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తాజా ఫలితాలపై గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీని అభినందించారు. ఆప్‌ ఫలితాలపై ఆ పార్టీ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సంతోషం వ్యక్తం చేశారు.

సాంగ్లీలో భాజపాకు షాక్‌

పుణె: మహారాష్ట్రలోని సాంగ్లీ మిరాజ్‌ కుప్వాడ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికల్లో భాజపాకు ఎదురు దెబ్బ తగిలింది. మెజారిటీ ఉన్నా మేయర్‌ పీఠాన్ని ఆ పార్టీ దక్కించుకోలేకపోయింది. మేయర్‌ పదవికి మంగళవారం జరిగిన ఎన్నికల్లో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన దిగ్విజయ్‌ సూర్యవంశి గెలుపొందారు. వాస్తవానికి ఇక్కడ భాజపా, దాని మిత్రపక్షాలకు 43 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఎన్సీపీ, దాని మిత్రపక్షాల బలం 34 మాత్రమే. మేయర్‌ ఎన్నికల్లో ఐదుగురు భాజపా కార్పొరేటర్లు ఎన్సీపీ అభ్యర్థికి ఓటు వేశారు. మరో ఇద్దరు కమలనాథులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో మేయర్‌ పీఠం ఎన్సీపీ వశమైంది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు