ఒట్టి మాటలు.. ఉత్తుత్తి ఉత్తర్వులు

ప్రధానాంశాలు

ఒట్టి మాటలు.. ఉత్తుత్తి ఉత్తర్వులు

నకిలీ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌ 

బండి సంజయ్‌ విమర్శ

ఈనాడు, దిల్లీ: హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల సమయంలో కుర్చీ వేసుకొని కూర్చొని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారని.. ఇప్పటివరకు ఆయనకు కుర్చీ దొరకలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఇంటికి రూ.10 వేలు ఇస్తానని నకిలీ సంతకం పెట్టారని.. ఆయన నకిలీ ముఖ్యమంత్రి అని, ఆయనది నకిలీ పాలన అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో గురువారం సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో భాజపా గెలుస్తుందని ప్రభుత్వ, ప్రైవేటు సర్వేలు చెబుతుండడంతో అడ్డదారిలో గెలవాలని ముఖ్యమంత్రి తాపత్రయపడుతున్నారన్నారు. దళిత బంధు పేరుతో గిమ్మిక్కుకు పాల్పడుతున్నారన్నారు. ఈటల బావమరిది మధుసూదన్‌రెడ్డి పేరుతో నకిలీ ఐడీలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో అబద్ధపు ప్రచారం చేసే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఆక్రమణల కూల్చివేత పేరుతో ఓ వర్గం ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. పాతబస్తీలో ఆక్రమణలు లేవా.. అక్కడ రహదారులను ఎందుకు వెడల్పు చేయడం లేదని ప్రశ్నించారు. చెరువులు, కుంటలను తెరాస ఎమ్మెల్యేలు, నాయకులే ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ప్రగతిభవన్‌ ముట్టడికి తాము పిలుపునివ్వకపోయినా రాష్ట్రవ్యాప్తంగా భాజపా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని ఆయన విమర్శించారు. 144 సెక్షన్‌ పెట్టి పర్యటించే స్థాయికి మంత్రులు దిగజారారన్నారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి 20 రోజుల క్రితం ధర్నా చేస్తానంటే ఇందిరాపార్కు వద్ద అనుమతి ఇచ్చారని, భాజపాకు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ను నడుపుతున్నది కేసీఆరే. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొన్నది ఆయనే, రేపు కాంగ్రెస్‌ టికెట్లు ఇచ్చేది ఆయనే అని వ్యాఖ్యానించారు. దళితులు, గిరిజనుల సమస్యలపై తాము ధర్నాకు పిలుపునిస్తే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం నాటి ధర్నాను విజయవంతం చేస్తామని తెలిపారు.

*  వైద్య విద్య కోర్సుల్లో ఓబీసీలకు 27%, ఈడబ్ల్యూఎస్‌కు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌  పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని