మోదీని గద్దె దించేందుకు ఉద్యమ ప్రణాళిక: ఉత్తమ్‌

ప్రధానాంశాలు

మోదీని గద్దె దించేందుకు ఉద్యమ ప్రణాళిక: ఉత్తమ్‌

ఈనాడు, దిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించి మోదీని గద్దె దింపడానికి ఉద్యమ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రజాసమస్యలపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు అవసరమైన వ్యూహ రచన కోసం పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ నేతృత్వంలో ఏర్పాటైన 9 మంది సభ్యుల బృందం తొలిసారి మంగళవారం దిల్లీలో సమావేశమైంది. ఈ నెల 20 నుంచి 30 వరకు విపక్షాలతో కలిసి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిన కాంగ్రెస్‌ అందులో ఏ అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్నదానిపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. ముఖ్యంగా వంటనూనెలు, నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, మానిటైజేషన్‌ పేరుతో ప్రభుత్వ ఆస్తుల తాకట్టులాంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో చర్చించిన అంశాల ఆధారంగా దిగ్విజయ్‌సింగ్‌ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి పార్టీ అధ్యక్షురాలికి అందజేస్తారన్నారు. దాని ఆధారంగా సోనియాగాంధీ ప్రకటన చేస్తారని ఉత్తమ్‌ పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని