ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి పోరాడాలి

ప్రధానాంశాలు

ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి పోరాడాలి

కాంగ్రెస్‌, భాజపాలకు వైఎస్‌ షర్మిల పిలుపు

నిరుద్యోగ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ

స్టేషన్‌కు పాదయాత్ర చేపట్టడంతో అరెస్ట్‌

బోడుప్పల్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌, భాజపాలకు చిత్తశుద్ధి ఉంటే వారి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి నిరుద్యోగుల పక్షాన పోరాడాలని వైతెపా వ్యవస్థాపకురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. రాష్ట్రంలో వందల మంది నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా కాంగ్రెస్‌ మేలుకోలేదని, ఇన్నాళ్లకు నిద్రలేచి కొత్త రాగం అందుకొని ‘గర్జన’లు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అమ్ముడుపోవడంతోనే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంత విచ్చలవిడి ధోరణితో పాలన చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌లో రవీందర్‌నాయక్‌ అనే నిరుద్యోగి గతంలో ఆత్మహత్యకు పాల్పడగా బాధిత కుటుంబాన్ని మంగళవారం ఆమె పరామర్శించారు. అనంతరం పీర్జాదిగూడ ఎగ్జిబిషన్‌ మైదానంలో ఆమె నిరుద్యోగ దీక్షకు కూర్చోగా.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత ‘చలో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌’కు పిలుపునిచ్చి.. కార్యకర్తలతో కలిసి వరంగల్‌ జాతీయ రహదారి మీదుగా షర్మిల పాదయాత్ర చేపట్టారు. పోలీసులు ఆమెను అరెస్టు చేసే ప్రయత్నం చేయగా కార్యకర్తలు అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాట జరిగింది. దీంతో కొద్దిసేపు జాతీయ రహదారిపై షర్మిల బైఠాయించారు. అనంతరం పోలీసులు ఆ పార్టీ ముఖ్య నాయకులను సముదాయించి షర్మిలను అరెస్టు చేసి లోటస్‌పాండ్‌కు తరలించారు. ఆమె వెంట నాయకులు రాఘవరెడ్డి, సురేష్‌రెడ్డి, సోమన్న, సంధ్య తదితరులు ఉన్నారు. ఎగ్జిబిషన్‌ మైదానం జాతీయ రహదారి పక్కన ఉండడంతో షర్మిల దీక్షకు అనుమతి రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అడ్డా కూలీల నిరసన

నిరుద్యోగ నిరాహార దీక్షకు కార్యకర్తలు తక్కువగా రావడంతో పలువురు నాయకులు ఒక్కొక్కరికి రూ.400 ఇస్తామని అడ్డా కూలీలను తీసుకొచ్చారు. దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో అక్కడి నుంచి నాయకులు వెళ్లిపోతుండగా.. తమకు డబ్బులు ఇవ్వాలని కూలీలు నిరసన వ్యక్తంచేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని