కేంద్రంతో ధాన్యం కొనిపించే బాధ్యత నాది

ప్రధానాంశాలు

కేంద్రంతో ధాన్యం కొనిపించే బాధ్యత నాది

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌
దళితబంధు పాత పథకమేనని వ్యాఖ్య  

ఇల్లంతకుంట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పండే ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా తాను బాధ్యత తీసుకుంటానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం 31వ రోజు ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్‌లో ప్రారంభమై అనంతారం, ఇల్లంతకుంట, ముస్కానిపేట, కేసన్నపల్లె మీదుగా సాగింది. ఇల్లంతకుంటలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను తప్పుదోవ పట్టిస్తున్న ముఖ్యమంత్రి వారికి క్షమాపణ చెప్పాలన్నారు. దేశంలో కేసీఆర్‌ను మించిన అవినీతిపరుడు లేరని విమర్శించారు. దళితుడిని రాష్ట్రపతి చేసింది భాజపాయేనని అన్నారు. దళిత బంధు పథకం పాతదేనని, నరేంద్రమోదీ ‘స్టాండప్‌ ఇండియా’ పేరుతో ఓ పథకాన్ని ప్రవేశపెట్టి కోటి రూపాయల వరకు రుణాలు ఇచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కొందరు తెరాస నాయకులు తాలిబన్లు, రజాకార్ల లెక్క యుద్ధం చేయాలనడం అవివేకమన్నారు. మేం శివాజీవారసులమై తాలిబన్లు, రజాకార్ల వారసులను తరిమికొడతామన్నారు.

పాకిస్థాన్‌లో జెండా ఎగురవేస్తా

హైదరాబాద్‌ పాతబస్తీలో కాషాయ జెండా పట్టిన పార్టీ భాజపాయేనని బండి సంజయ్‌ పేర్కొన్నారు. అమిత్‌షా అనుమతిస్తే పాకిస్థాన్‌ వెళ్లి జెండా ఎగురవేస్తానని అన్నారు. రాష్ట్ర్రంలో 27 మంది ఇంటర్‌ విద్యార్థులు ప్రభుత్వ తప్పిదం వల్ల ఆత్మహత్య చేసుకుంటే బాధ్యులపై చర్యలు తీసుకోలేదన్నారు. బాధ్యులను అరెస్టు చేయాల్సి వస్తే మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేయాలన్నారు.  కర్ణాటక రాష్ట్రం కోలార్‌ ఎంపీ మునుస్వామి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కొల్లగొట్టిన కోట్లాది రూపాయలను ప్రజలకు పంచాలన్నారు. అనంతరం పలు గ్రామాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు బండి సంజయ్‌ సమక్షంలో పార్టీలో చేరారు.


రూ.31,245 కోట్ల సబ్‌ప్లాన్‌ నిధుల్ని దారి మళ్లించారు
సీఎంకు రాసిన లేఖలో బండి ఆరోపణ

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస ప్రభుత్వం దళితుల్ని ఓటు బ్యాంకుగానే చూస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ఈ ఏడేళ్లలో రూ. 31,245.11 కోట్ల ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఎస్సీలు సమస్యలపై సీఎం కేసీఆర్‌కు సంజయ్‌ సోమవారం 5 పేజీల లేఖ రాశారు. ఏడేళ్లలో ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ. 86,684 కోట్లు కేటాయించి రూ. 55,438.89 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని మండిపడ్డారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో అనేకమంది దళితులు సమస్యలపై తనకు వినతిపత్రాలిచ్చారని పేర్కొన్నారు. ‘‘తెలంగాణకు దళిత సీఎం హామీపై మోసం చేశారు. మాదిగ, మాల భవనాలకు భూమి ఎక్కడ? 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏమైంది? మూడు ఎకరాల భూపంపిణీలోనూ మాట తప్పారు. మరోవైపు కార్పొరేట్‌, స్థిరాస్తి సంస్థలకు భూబ్యాంకు ద్వారా 6 లక్షల ఎకరాలు సేకరించారు’’ అని సంజయ్‌ ఆక్షేపించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని