Navjot Singh Sidhu: ఆ ముగ్గురి నియామకమే ముంచిందా?

ప్రధానాంశాలు

Navjot Singh Sidhu: ఆ ముగ్గురి నియామకమే ముంచిందా?

ఈనాడు, దిల్లీ: తన రాజీనామాకు కారణాలేంటో సిద్ధూ బయటపెట్టలేదు. అయితే- రాష్ట్రంలో ఇటీవల జరిగిన మూడు నియామకాలపై అసంతృప్తితోనే ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాణా గుర్జీత్‌సింగ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం, ఇక్బాల్‌ ప్రీత్‌సింగ్‌ సహోతాకు తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు అప్పగించడం, అమర్‌ప్రీత్‌సింగ్‌ డియోల్‌ను అడ్వొకేట్‌ జనరల్‌ను నియమించడం ఆయనకు రుచించలేదని చెబుతున్నాయి. తాజా విశ్లేషణల ప్రకారం.. అధిష్ఠానంతో పోరాడి బలమైన అమరీందర్‌సింగ్‌ను సీఎం పదవి నుంచి తప్పించిన తర్వాత, తనకు సన్నిహితుడిగా పేరున్న దళిత నేత చన్నీకి ఆ పీఠం దక్కేలా సిద్ధూ చేశారు. రాష్ట్రంలో 32% వరకూ ఉన్న దళిత సామాజిక వర్గానికి పార్టీ దగ్గరవుతున్నట్లు సంకేతాలు పంపారు. అనంతరం అధిష్ఠానాన్ని కలిసిన చన్నీ, సిద్ధూ.. రాష్ట్రంలో భవిష్యత్‌ కార్యాచరణ, మంత్రివర్గ విస్తరణ, ఉన్నతాధికారుల నియామకంపై సంప్రదింపులు జరిపారు. అయితే వారం రోజుల్లోనే ఇద్దరి మధ్య సఖ్యత ఆవిరైంది!

దళిత సీఎంను కీలుబొమ్మగా చేసి సిద్ధూనే చక్రం తిప్పుతున్నారన్న భావన పెరగకుండా చూసుకోవాలని అధిష్ఠానం సూచించడంతో చన్నీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. సిద్ధూ సహా పలువురు మంత్రివర్గ సహచరులు సూచించిన సిద్ధార్థ్‌ చటోపాధ్యాయను కాదని.. దళిత సామాజిక వర్గానికి చెందిన ఇక్బాల్‌ను తాత్కాలిక డీజీపీగా నియమించారు. ఒకప్పుడు విజిలెన్స్‌ బ్యూరోలో ఉన్న చటోపాధ్యాయ 2003లో ఓ అవినీతి కేసులో అకాలీదళ్‌ అగ్రనేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ను అరెస్టు చేశారు. ఆయన్ను డీజీపీగా నియమిస్తే.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమర్థంగా దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలికితీసేవారని, అవి వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన ఎజెండాగా మారేవన్నది సిద్ధూ అభిప్రాయం. అడ్వొకేట్‌ జనరల్‌గా డి.ఎస్‌.పట్వాలియాకు బదులు డియోల్‌ను నియమించడమూ ఆయనకు నచ్చలేదు. వివాదాస్పద మాజీ డీజీపీ సమేధ్‌సింగ్‌ సెయినీ తరుఫున అవినీతి కేసులో డియోల్‌ ఇటీవలి వరకు వాదనలు వినిపించారు. ఇసుక కుంభకోణంలో విపరీతమైన ఆరోపణలు ఎదుర్కొని, అమరీందర్‌ మంత్రివర్గం నుంచి వైదొలిగిన వ్యాపారవేత్త రానా గుర్జీత్‌సింగ్‌ను చన్నీ తన కేబినెట్‌లోకి తీసుకోవడమూ సిద్ధూకు రుచించలేదు. ఈ మూడు నియామకాల ద్వారా ప్రతిపక్షాల చేతికి ఆయుధాన్ని ఇచ్చినట్లయిందని ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే కుల్జిత్‌సింగ్‌ నగ్రాకు కేబినెట్‌లో చోటు దక్కకపోవడం, డిప్యూటీ సీఎం రంధావాకు హోం శాఖను కట్టబెట్టడం కూడా సిద్ధూకు అసంతృప్తి కలిగించిందని సమాచారం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని