వాస్తవ జాతీయవాదమే కాంగ్రెస్‌ నినాదం

ప్రధానాంశాలు

వాస్తవ జాతీయవాదమే కాంగ్రెస్‌ నినాదం

అదే హిందుత్వపై ప్రయోగించే అస్త్రం

గాంధీ ఆశ్రమంలో కార్యకర్తలకు శిక్షణ

ఈనాడు, దిల్లీ: సిద్ధాంతపరంగా భాజపాను ఎలా ఎదుర్కోవాలనే విషయమై కాంగ్రెస్‌లో స్పష్టత వచ్చినట్టు కనిపిస్తోంది. భాజపా ఇంతవరకు హిందుత్వ ఆధారిత జాతీయవాదాన్ని ప్రచారం చేస్తుండగా దాన్ని అడ్డుకోవడానికి అసలు జాతీయ వాదం అంటే ఏమిటో ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. దాంతో పాటుగా భాజపా దుష్పరిపాలనపైనా పోరాడాలని భావిస్తోంది.ఇంతవరకు కాంగ్రెస్‌ పార్టీ మధ్యేమార్గాన్ని అనుసరించినా వామపక్ష భావజాలంవైపు కాస్త మొగ్గు చూపించేది. దాంతో హిందుత్వ విధానాలను వ్యతిరేకించేది. ఇప్పుడు ఆ వైఖరిలో మార్పు చేసుకొంది. మధ్యేమార్గాన్ని అనుసరిస్తూ మతపరమైన అంశాలనూ పరిగణనలోకి తీసుకోనుంది. జాతీయవాదం పేరుతో భాజపా ప్రభుత్వం ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి నిజమైన సమస్యలు మరుగునపడేలా చేస్తోందని, దీన్ని ప్రజలకు వివరించాలని భావిస్తోంది. మందబలాన్ని ప్రదర్శిస్తూ దాన్నే జాతీయవాదమని చెప్పుకొంటోందని విమర్శిస్తోంది.

భాజపా అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు వివరించేలా తొలుత కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రతిపాదించింది. ‘‘నిజమైన జాతీయ వాదం అంటే ఏమిటో తొలుత కార్యకర్తలకు శిక్షణ ఇస్తాం. భారతీయత అన్న భావజాలం కోసం స్వాతంత్య్రం ముందు, ఆ తరువాతా కాంగ్రెస్‌ నాయకులు ఎలాంటి త్యాగాలు చేశారో వివరిస్తాం. అందర్నీ కలుపుకొనిపోయే దేశభక్తి కలిగి ఉండడమే నిజమైన జాతీయవాదం. దీన్ని అనుసరించడం ద్వారానే భాజపా-ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ విధానాన్ని ఎదుర్కొంటాం’’ అని ఓ నాయకుడు చెప్పారు. ప్రతి రాష్ట్రం నుంచి అయిదుగురు అనుభవజ్ఞులైన నాయకులను ఎంపిక చేసి ఈ శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. మహారాష్ట్రలోని వార్ధాలో ఉన్న గాంధీ సేవాగ్రాంలో ఈ శిక్షణ ఉంటుందని వివరించారు. ఇక్కడ శిక్షణ పొందినవారంతా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు అవగాహన శిబిరాలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ చాలా రాష్ట్రాల్లో భాజపాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సేనని విపక్షాలు సయితం అంగీకరిస్తున్నాయి. అందువల్ల భాజపాపై పోరులో తమదే ప్రధాన పాత్ర అని, ఇందుకు ‘వాస్తవ జాతీయ వాదం’ అన్నదే ముఖ్యమైన అస్త్రమని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని