పంపకాల్లో తేడాతోనే ఉపఎన్నిక

ప్రధానాంశాలు

పంపకాల్లో తేడాతోనే ఉపఎన్నిక

భాజపా, తెరాస రెండూ దొంగ పార్టీలే
జమ్మికుంట రోడ్‌షోలో రేవంత్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌- జమ్మికుంట, న్యూస్‌టుడే: గల్లీలో కుస్తీ పడుతున్నట్లు నటిస్తూ.. దిల్లీలో దోస్తులుగా మెలుగుతూ భాజపా, తెరాసలు తెలంగాణ ప్రజల్ని మోసగిస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ రెండూ దొంగ పార్టీలేనని వ్యాఖ్యానించారు. కరీంనగర్‌ జిల్లాలోని వీణవంక, జమ్మికుంటల్లో శనివారం నిర్వహించిన రోడ్‌షోలలో ఆయన మాట్లాడారు. ‘‘ఇరవై ఏళ్లు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ కలిసిమెలిసి ఉన్నారు. వారి పంపకాల్లో తేడావల్లే ఈ ఉపఎన్నిక వచ్చింది. వాళ్ల పంచాయితీని ప్రజలపై రుద్దుతున్నారు. 40 రూపాయల పెట్రోల్‌ను 110కి అమ్ముతున్నారు. ఇంధన ధరలతో అటు మోదీ, ఇటు కేసీఆర్‌ ప్రజల నడ్డి విరుస్తున్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఆ రెండు పార్టీలు డబ్బుల మూటలను పంచుతూ ఓట్లు అడుగుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలివ్వని ఈ రెండు పార్టీలకు ఎందుకు ఓటు వెయ్యాలి? 1200 మంది బలిదానాలతో రాష్ట్రాన్ని సాధించుకుంటే ఉద్యోగాలు ఇవ్వకుండా గొర్రెలు, బర్రెలను ఇస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

గజ్వేల్‌.. కేసీఆర్‌ సొంతూరా?
‘‘ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా బరిలో నిలుస్తారు. హుజూరాబాద్‌లో పోటీ చేస్తున్న మా అభ్యర్థి బల్మూరి వెంకట్‌ ఇక్కడి వాడు కాదని తెరాస నాయకులు విమర్శిస్తున్నారు. మరి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ ఆయన సొంతూరా? సిరిసిల్ల కేటీఆర్‌ ఊరా? సిద్దిపేట హరీశ్‌రావుదా? సమాధానం చెప్పాలి. ఎన్నికల కోసమే దళితబంధు డ్రామా ఆడారు. కేసీఆర్‌, మోదీ తలచుకుంటే ఒక్కగంటలో దళితబంధు డబ్బులు ఇవ్వొచ్చు. కానీ వారు అలా చేయడం లేదు. ఎట్టిపరిస్థితుల్లో హుజూరాబాద్‌ గడ్డమీద కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తాం’’ అని రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారు. రెండుచోట్ల నిర్వహించిన రోడ్‌షోలకు జనం అధికసంఖ్యలో హాజరయ్యారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని