close

తాజా వార్తలు

సలామ్‌ కృష్ణప్ప: ఆఖరి బంతికి విజయం

దిండిగల్‌: తమిళనాడు క్రికెట్‌ జట్టుకు కర్ణాటక బౌలర్‌ కృష్ణప్ప గౌతమ్‌ చుక్కలు చూపిస్తున్నాడు. ప్రతిసారీ వారికి దక్కాల్సిన విజయాన్ని లాగేస్తున్నాడు. ఆఖరి ఓవర్లో అద్భుతాలు చేస్తున్నాడు. ఈ మధ్యే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఫైనల్లో తమిళనాడు ఓటమికి ఎలా కారణమయ్యాడో తెలిసిన సంగతే. ప్రస్తుతం రంజీ ట్రోఫీలోనూ అదే ఇంద్రజాలం ప్రదర్శించాడు. మ్యాచ్‌ ఆఖరి రోజు.. సమయం సాయంత్రం 5 గంటలు.. ఇంకా మూడు బంతులు వేసేందుకే అవకాశం.. తమిళ సేన అప్పటికే 9 వికెట్లు చేజార్చుకుంది. ఒక్క వికెట్‌ కాచుకుంటే చాలు. ఓటమి తప్పించుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో బంతి అందుకున్న గౌతమ్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి వికెట్‌ తీసి సంచలనం సృష్టించాడు.

దేవదత్‌ పడిక్కల్‌ (78), దేశ్‌పాండే (65) రాణించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు సాధించింది. గౌతమ్‌ (51) తొమ్మిదో స్థానంలో దిగి విలువైన అర్ధశతకం సాధించాడు. ఆ తర్వాత అతడు 6 (40.3 ఓవర్లు) వికెట్లతో చెలరేగడంతో తమిళనాడు మొదటి ఇన్నింగ్స్‌ 307కు ముగిసింది. దినేశ్‌ కార్తీక్‌ (113) శతకంతో మెరిశాడు. పిచ్‌ కఠినంగా మారడంతో రెండో ఇన్నింగ్స్‌లో కర్ణాటక 151 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్‌ 4, విఘ్నేశ్‌ 3 వికెట్లు తీశారు. ఆఖరి రోజు, గురువారం తమిళనాడు 181 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగింది. కృష్ణప్ప గౌతమ్‌ ఏకధాటిగా 31 ఓవర్లు విసిరి 8 వికెట్లు తీసి ప్రత్యర్థిని 154కే కుప్పకూల్చాడు.

ముకుంద్‌ (42), అపరాజిత్‌ (0), అశ్విన్‌ (2), దినేశ్‌ కార్తీక్‌ (17), విజయ్‌ శంకర్‌ (5), సాయి కిషోర్‌ (6), సిద్ధార్థ్‌ (20), విఘ్నేశ్‌ (4)ను పెవిలియన్‌ పంపించాడు. వికెట్లు వరుసగా పడటంతో ఆట రసవత్తరంగా మారింది. ఆఖరి వికెట్‌ తీసేందుకు సమయం, బంతులు ఎక్కువగా లేవు. కేవలం 3 బంతులే ఉన్నాయి. ఈ క్రమంలో బంతిని అందుకొని తన 30.3వ బంతికి విఘ్నేశ్‌ను ఎల్బీ చేసి కర్ణాటకకు విజయం అందించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.