రాజస్థాన్‌కు మరో పరీక్ష..!
close

తాజా వార్తలు

Updated : 17/10/2020 11:14 IST

రాజస్థాన్‌కు మరో పరీక్ష..!

నేడు కోహ్లీ సేనతో రాజస్థాన్‌ ఢీ..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఐదింట్లో గెలిచిన బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు ఎనిమిది మ్యాచుల్లో కేవలం మూడు విజయాలతో రాజస్థాన్‌ ఏడో స్థానానికి పడిపోయింది. రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే దాదాపు అన్ని మ్యాచుల్లోనూ నెగ్గాల్సిన పరిస్థితి. ఇదిలా ఉండగా.. ఈ రోజు మధ్యాహ్నం 3.30గంటలకు దుబాయ్‌ వేదికగా ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. రాజస్థాన్‌ను చిత్తుచేసి కోహ్లీసేన తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తుండగా.. బెంగళూరుపై గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని స్మిత్‌సేన భావిస్తోంది. అయితే.. ఈ రెండు జట్లు వేర్వేరుగా ఆడిన గత మ్యాచ్‌లో ఓటమై పాలయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నాయి.

రికార్డులేం చెబుతున్నాయంటే..

ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 21సార్లు ఎదురుపడ్డాయి. అందులో 10 మ్యాచుల్లో రాజస్థాన్‌ పైచేయి సాధించింది. తొమ్మిదింట్లో బెంగళూరు గెలిచింది. రెండు మ్యాచులు వర్షం కారణంగా రద్దయ్యాయి. అయితే.. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన చేతిలో రాజస్థాన్‌ ఓడింది. ఆ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది.

గత మ్యాచ్‌ను బట్టి చూస్తే దుబాయ్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంది. టాస్‌ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునేందుకు మొగ్గు చూపించవచ్చు.

బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలి..
గత మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్‌ కోహ్లీ తీసుకున్న నిర్ణయం మ్యాచ్‌ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపించిందని విమర్శలు వచ్చాయి. లెగ్‌స్పిన్నర్లను ఎదుర్కోవడంలో డివిలియర్స్‌ ఇబ్బంది పడతాడన్న కారణంతో అతడిని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించాడు. అయితే.. కోహ్లీ ఎత్తు ఫలించలేదు. డివిలియర్స్‌ త్వరగా ఔటయ్యాడు. డివిలియర్స్‌ను ముందే పంపిస్తే స్కోరు బోర్డులో మార్పు ఉండేదేమో.? ఆ మ్యాచ్‌లో కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. అయితే.. మ్యాచ్‌ ఓడినా క్రిస్‌ మోరిస్‌, చాహల్‌ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. గత మ్యాచ్‌లో ప్రధానంగా బ్యాటింగ్‌ వైఫల్యంతో ఓడిన బెంగళూరు ఈ మ్యాచ్‌కు ఎలా సన్నద్ధమవుతుందన్నది చూడాలి. బౌలింగ్‌లోనూ ఒకరిద్దరు బౌలర్లు ఎక్కువగా పరుగులిస్తున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న రాజస్థాన్‌ బౌలర్‌ జొఫ్రా ఆర్చర్‌ను బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ ఎంత సమర్థంగా ఎదుర్కొంటారన్న దానిపై మ్యాచ్‌ ఆధారపడి ఉంటుంది. 

స్మిత్‌ సేనకు పవర్‌ప్లే ఫీవర్‌..
రాజస్థాన్‌ గడ్డు పరిస్థితుల్లో ఉందనే చెప్పాలి. సీజన్‌ ఆరంభంలో బలంగా కనిపించిన స్మిత్‌సేన క్రమంగా బలహీనమవుతూ వస్తోంది. పవర్‌ప్లేలో ఎక్కువగా వికెట్లు కోల్పోతుండటం ఆ జట్టును కలవరపెడుతోంది. ఆ జట్టు ఇంతవరకు నాలుగుసార్లు ఓపెనర్లను మార్చింది. అయినా ఫలితం లేదు. సంజుశాంసన్‌ మళ్లీ తన దూకుడు ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం ఉంది. స్మిత్‌, స్టోక్స్‌, బట్లర్‌ బ్యాటుతో రాణిస్తే ఆ జట్టు బౌలర్లపై ఒత్తిడి తగ్గుతుంది. మిడిల్ ఆర్డర్లో యువ ఆటగాళ్లు పరాగ్‌, తెవాతియా మెరుపులు మెరిపిస్తున్నారు. బౌలింగ్‌ విషయానికి వస్తే ఆర్చర్‌ ఒంటరి పోరు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఉనద్కత్‌ ఇంతవరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. శ్రేయస్‌ గోపాల్‌, కార్తిక్‌ త్యాగిది కూడా అదే పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే బెంగళూరు కంటే రాజస్థాన్‌ అన్ని విభాగాల్లోనూ కాస్త బలహీనంగా ఉందనే చెప్పాలి. మోరిస్‌ను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తే రాజస్థాన్‌ గెలుపు పెద్ద కష్టమేం కాబోదు. బెన్‌స్టోక్స్‌ ప్రదర్శన అత్యంత కీలకం కానుంది. అన్నింటి కంటే ముఖ్యంగా ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ప్రతి మ్యాచ్‌ గెలవాలన్న సంగతి స్మిత్‌ సేన మదిలో పెట్టుకొని ఆడాల్సి ఉంది.

జట్లు అంచనా..

బెంగళూరు: దేవ్‌దత్‌ పడిక్కల్, ఫించ్, కోహ్లీ(కెప్టెన్), డివిలియర్స్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె, క్రిస్ మోరిస్, ఉదాన, సైనీ, సిరాజ్, చాహల్‌
రాజస్థాన్: స్టోక్స్, బట్లర్, స్మిత్(కెప్టెన్), సంజూ శాంసన్, ఉతప్ప, రియాన్ పరాగ్, తెవాతియా, ఆర్చర్, శ్రేయస్ గోపాల్, ఉనద్కత్, కార్తిక్ త్యాగి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని