close
Array ( ) 1

తాజా వార్తలు

రాహుల్‌ ద్విపాత్రాభినయం.. పంత్‌కు చేటా?

తాత్కాలిక కీపరే బెస్ట్‌ అంటున్న సోషల్‌ మీడియా

ధోనీ తర్వాత టీమిండియా కీపర్‌గా, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న రిషభ్‌ పంత్‌ గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత పూర్తిగా విఫలమయ్యాడు. గత నెల వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫర్వాలేదనిపించినా అతడి స్థానానికి ఎసరుపెట్టేలా కనిపిస్తున్నాడు తాత్కాలిక వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేనే అందుకు ఉదాహరణ. మిడిల్‌ ఆర్డర్‌లో ధాటిగా ఆడుతూనే వికెట్‌ కీపింగ్‌లో ధోనీని మైమరిపిస్తున్నాడు. 


మహేంద్రుడి తర్వాత ఏం జరిగింది?

టీమిండియా గతేడాది వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌ నుంచి వైదొలిగాక మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఆటకు విరామం తీసుకున్నాడు. అతడికి వారసుడిగా పేరు తెచ్చుకున్న రిషభ్‌పంత్‌ ఆ తర్వాత జరిగిన మూడు సిరీసుల్లో పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక అటు బ్యాటింగ్‌లో, ఇటు కీపింగ్‌లో తడబడ్డాడు. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న వేళ టీమిండియా యాజమాన్యంతో పాటు పలువురు దిగ్గజాలు అతడికి అండగా నిలిచారు. పంత్‌ అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఆటగాడని, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడని అన్నారు. ఈ నేపథ్యంలో గత నెల విండీస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో యువ బ్యాట్స్‌మన్‌ ఫర్వాలేదనిపించాడు. 


స్థానం ఏదైనా.. పరుగులు ఖాయం

మరోవైపు కేఎల్‌ రాహుల్‌ ఈ మధ్య ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసినా నిలకడతో రాణిస్తున్నాడు. ప్రపంచకప్‌లో ధావన్‌ గాయపడిన వేళ ఓపెనర్‌గా మెరిశాడు. తర్వాత సందర్భాన్ని బట్టి జట్టు యాజమాన్యం ఎక్కడ ఆడమంటే అక్కడ బరిలోకి దిగాడు. జట్టు అవసరాలకు తగ్గట్టు తన ఆటలో మార్పులు చేసుకొని అద్భుతంగా కొనసాగుతున్నాడు. డిసెంబర్‌లో విండీస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధావన్‌ మరోసారి దూరమయ్యాడు. అప్పుడు రోహిత్‌కు జోడీగా రాహుల్‌ మళ్లీ ఓపెనర్‌ అవతారమెత్తాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు రోహిత్‌, ధావన్‌ ఓపెనర్లుగా దిగడంతో ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్‌ దిగువ స్థానాల్లో ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే తొలి వన్డేలో వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌గా 47 పరుగులు చేసిన రాహుల్‌ రెండో వన్డేలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 


కొత్తగా ద్విపాత్రాభినయం

ఇదిలా ఉండగా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో బ్యాటింగ్‌ చేస్తూ గాయపడ్డాడు. ఒక బంతి అతడి హెల్మెట్‌కు బలంగా తగలడంతో రెండో ఇన్నింగ్స్‌లో మైదానంలోకి రాలేదు. అతడి స్థానంలో కేఎల్‌ రాహుల్‌ కొత్తగా వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు చేపట్టాడు. అయితే డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌ శతకాలతో చెలరేగి భారత్‌పై విజయం సాధించారు. ఇక రెండో మ్యాచ్‌లో పంత్‌ ఆడకపోవడంతో రాహుల్‌ మరోసారి ద్విపాత్రాభినయం చేశాడు. బ్యాటింగ్‌లో ఎలాగైతే తన ముద్రవేశాడో.. అలాగే కీపింగ్‌లోనూ అద్భుతంగా రాణించాడు. వికెట్ల వెనుక చురుగ్గా కదులుతూ ధోనీకి ఏమాత్రం తక్కువ కాదన్నట్లు మెరిశాడు. తనకు అప్పజెప్పినా కొత్త బాధ్యతల్ని పూర్తిగా నెరవేరుస్తూ.. పంత్‌ స్థానానికే ఎసరు పెట్టేలా ఉన్నాడు. మరో పది నెలల్లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో ఎలాగైనా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు తాత్కాలిక వికెట్‌ కీపర్‌.


పంత్‌ కన్నా రాహులే బెటర్‌ అంటున్న సోషల్‌ మీడియా

రిషభ్‌ పంత్‌ ఇకనైనా బాగా రాణించాలి. అతడికి వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ తన సత్తా చాటాలి. లేదంటే అతడి స్థానాన్ని కేఎల్‌ రాహుల్‌ ఆక్రమించినా ఆశ్చర్యం లేదు. మరోవైపు పలువురు మాజీలు రాహుల్‌కు నిరంతరం కీపింగ్‌ బాధ్యతలు అప్పగించడం సరికాదని అంటున్నారు. అతడిని కేవలం అదనపు కీపర్‌గా మాత్రమే ఉపయోగించుకోవాలని, పూర్తిస్థాయి కీపర్‌గా వద్దని అంటున్నారు. అయితే, సోషల్‌ మీడియాలో మాత్రం పంత్‌ కన్నా రాహులే బాగా ఆడుతున్నాడని, అటు బ్యాటింగ్‌లోనూ ఇటు కీపింగ్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దీంతో భవిష్యత్‌లో ఫంత్‌కు రాహుల్‌ ఎలాంటి సవాళ్లు విసురుతాడో చూడాల్సిఉంది.  

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం, హైదరాబాద్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.