
తాజా వార్తలు
‘‘చావును చాలా దగ్గరగా చూశాను’’
ఇంటర్నెట్‌డెస్క్: చావును దగ్గరగా చూశానని ఫార్ములా వన్ రేసర్, ఫ్రాన్స్ డ్రైవర్ రొమెయిన్ గ్రాస్జీన్ పేర్కొన్నాడు. బహ్రెయిన్ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రి సందర్భంగా గతవారం ట్రాక్ మీదే రోడ్డు ప్రమాదానికి గురైన అతడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తన రేసింగ్ కార్ అదుపుతప్పి బోల్తాపడగా పెద్ద ఎత్తున మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోయింది. దాంతో అతడు కూడా మృతిచెంది ఉంటాడని అక్కడున్నవారు భావించారు. అయితే, వేగంగా వ్యాపించిన మంటల నుంచి వెంటనే తేరుకొన్న అతడు లేచి బయటకు రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. కానీ అప్పిటికే గ్రాస్జీన్ చేతులు, ఎడమకాలికి గాయాలయ్యాయి. హుటాహుటిన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం డిశ్చార్జి అయ్యాడు. ఈ సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడుతూ ఆ ప్రమాద వివరాలను వెల్లడించాడు.
‘చావును చాలా దగ్గరగా చూశాను. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాక మళ్లీ మునుపటిలా ఉండలేను. కార్ అదుపు తప్పగానే సీట్‌బెల్ట్ తీసేశాను. కానీ బయటకు రావడానికి ప్రయత్నిస్తుంటే నా హెల్మెట్‌కు ఏదో అడ్డుగా అనిపించింది. పరిస్థితిని అర్ధం చేసుకొని అలాగే ఉండిపోయా. వెంటనే మంటలు అంటుకోవడం గమనించి ఎలాగైనా బయటపడాలని ప్రయత్నించాను. ఎటువైపు కదిలినా సీట్లో నుంచి పైకి లేవలేకపోయా. దాంతో చావును అతి సమీపంలో చూశా. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రావొద్దని అనుకున్నా. చివరికి నా ముగ్గురు పిల్లలు గుర్తు రావడంతో వాళ్లకోసమైనా బయటపడాలని తీవ్రంగా యత్నించాను. దాంతో గట్టి ప్రయత్నం చేసి బయటపడ్డా. ఇప్పుడైతే ఆ ప్రమాదఘటనకు సంబంధించి భయాలేం లేవు. కానీ, ఇలాంటివి మళ్లీ జరగవని కాదు. అందుకే దాని గురించి అప్పుడప్పుడూ ఆలోచిస్తుంటా’ అని గ్రాస్జీన్ పేర్కొన్నాడు.