వయసు అంకెలు మాత్రమే.. టోక్యో ఒలింపిక్స్‌లో అత్యంత పిన్న.. పెద్ద వయస్కులు వీరే!

తాజా వార్తలు

Published : 25/07/2021 01:22 IST

వయసు అంకెలు మాత్రమే.. టోక్యో ఒలింపిక్స్‌లో అత్యంత పిన్న.. పెద్ద వయస్కులు వీరే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: వయసు కేవలం అంకెలు మాత్రమే. నిజానికి వయసు తమకేమీ పెద్ద సమస్య కాదని నిరూపిస్తున్నారు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న క్రీడాకారులు. ఈసారి పాల్గొంటున్న అత్యంత పిన్నవారు, పెద్దవారు ఎవరో చూద్దాం.. 

హెండ్‌ జాజా: సిరియానుంచి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న పన్నెండేళ్ల బాలిక . ఇంతవరకూ ఒలింపిక్స్‌లో పాల్గొన్న చిన్నవారిలో ఈమె ఐదవది. సిరియా నుంచి నాలుగు విభాగాల్లో టైటిల్‌ సాధించిన ఏకైక అథ్లెట్‌. 1968లో రుమేనియా నుంచి పాల్గొన్న బీట్రైస్‌ హుస్టియు తర్వాత ఈమెనే అందరికంటే చిన్నది. తన కుటుంబంలోని నలుగురి సంతానంలో ఆఖరుదైన జాజా తన ఐదో ఏట బ్యాట్‌ చేత పట్టింది. ఆరేళ్ల తర్వాత 32 ఏళ్ల లెబనాన్‌ క్రీడాకారిణి మేరియానా సహకియాన్‌ను పశ్చిమాసియా ఒలింపిక్‌ టేబుల్‌ టెన్నిస్‌ క్వాలిఫికేషన్‌ టోర్నమెంటులో ఓడించి, టోక్యోకు ప్రయాణం కట్టింది.


స్కై బ్రౌన్‌: బ్రిటన్‌కు చెందిన పదమూడేళ్ల స్కేట్‌ బోర్డింగ్‌ క్రీడాకారిణి ఈమె. జపాన్‌లోని మియాజకిలో పుట్టింది. యూ ట్యూబ్‌ వీడియోల ద్వారా ఆట నేర్చుకుంది. నైక్‌ సంస్థ స్పాన్సర్‌ చేసిన అత్యంత పిన్నవయస్కురాలిగా గుర్తింపు పొందింది. 2018లో ఏబీసీ డ్యాన్సింగ్‌ విత్‌ ది స్టార్స్‌: జూనియర్స్‌లో గెలుపొందిన మొదటి క్రీడాకారిణి. టోక్యో ఒలింపిక్స్‌కు శిక్షణ పొందుతున్నప్పుడు కిందపడి తలకు, చేతి మణికట్టుకు దెబ్బలు తాకాయి. చేయి విరిగింది. కానీ రెండు నెలల్లోనే కోలుకుని, ఆసుపత్రి పరుపు మీద నుంచే ‘నెవర్‌ బ్రోకెన్‌’ అంటూ ఓ వీడియో షేర్‌ చేసింది. ప్రస్తుతం ప్రపంచ మహిళా పార్క్‌ స్కేట్‌బోర్డర్‌ ర్యాంక్‌లో మూడోస్థానంలో ఉంది. 


కేటీ గ్రైమ్స్‌: అమెరికాకు చెందిన 15 ఏళ్ల స్విమ్మర్‌ ఈమె.  ఐదుసార్లు బంగారు పతకాలు సాధించిన కేటీ లెడెక్కితో 800 మీటర్ల ఫ్రీ స్టైల్‌ స్విమ్మింగ్‌లో పోటీపడి టోక్యోకు అర్హత సాధించింది కేటీ. 1996 ఒలింపిక్స్‌లో పాల్గొన్న అమండా బేర్డ్‌ తర్వాత అత్యంత పిన్న వయస్కురాలైన స్విమ్మర్‌ ఈమె. 


కొలిన్‌ డఫ్పీ:  ఇతను తన మూడో ఏట నుంచే అమెరికాలోని బోల్డర్‌లో ఉన్న పాల్‌ డెర్డా రిక్రియేషన్‌ సెంటర్‌లో క్లైంబింగ్‌ ప్రారంభించాడు. స్థానికంగా ఉండే లైఫ్‌టైమ్‌ ఫిట్‌నెస్‌ వాల్‌ను ఐదేళ్ల ప్రాయంలో అధిగమించినప్పటి నుంచి ఈ క్రీడపై మరింత మమకారం పెంచుకున్నాడు. ఎనిమిదేళ్లప్పుడు ఏబీసీ కిడ్స్‌ క్లైంబింగ్‌ టీమ్‌లో చేరాడు.2021 క్లైంబింగ్‌ వరల్డ్‌ కప్‌లో కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఈసారి ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ క్రీడలో అమెరికా నుంచి పాల్గొంటున్న పిన్న వయస్కుడితడే. 


ఎవీ లేబ్‌ఫార్త్‌: క్యానో స్లాలోమ్‌(ప్రవాహంలో దోనె నడపడం) క్రీడలో అమెరికా నుంచి పాల్గొంటున్న 17 ఏళ్ల బాలిక.  ఏరుకు ఎదురుగా పడవను నడిపే ఆట ఇది.  15 ఏళ్లప్పడు ఆమె ఐసీఎఫ్‌ 19 క్యానో స్లాలోమ్‌ ప్రపంచ కప్‌లో కాంస్యాన్ని, ప్యాన్‌ అమెరికా గేమ్స్‌లో పసిడి పతకాన్ని గెలుచుకుంది. ఈ క్రీడలో అమెరికా నుంచి పాల్గొంటున్న అత్యంత పిన్న వయస్కురాలు. 


ఇక యాభై ఏళ్లు దాటినవారిని చూద్దాం!

నినో సలుక్వాజ్‌: జార్జియా నుంచి షూటింగ్‌లో  పాల్గొంటున్న 52 ఏళ్ల క్రీడాకారిణి. 1988లో సోవియట్‌ రష్యా నుంచి 19 ఏళ్ల ప్రాయంలో ఒలింపిక్స్‌లోకి ఆరంగేట్రం చేసింది. అనేక బంగారు, రజత పతకాలు పొందింది.


ని జియలియాన్‌: లక్సెంబర్గ్‌ నుంచి టేబుల్‌ టెన్నిస్‌లో పాల్గొంటున్న 58 ఏళ్ల క్రీడాకారిణి. 38 ఏళ్ల కింద ఇదే టోక్యోలో ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మొట్టమొదటిసారి బంగారు పతకాన్ని గెలుచుకుంది. మొనాకోకు చెందిన యాంగ్‌ జియోగ్జిన్‌ను 2019లో యూరోపియన్‌ గేమ్స్‌లో ఓడించి టోక్యోకు అర్హత సాధించింది. 


మేరీ హన్నా: గుర్రపు స్వారీ విభాగంలో పాల్గొంటున్న ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఈమె వయసు 66 సంవత్సరాలు. ఈమెకిది ఏడో ఒలింపిక్స్‌. ఈమె నాలుగేళ్లప్పటి నుంచే గుర్రపు స్వారీ చేసేదట. ఒలింపిక్స్‌లో ఇంతవరకూ పాల్గొన్నవారిలో అత్యంత పెద్ద వయస్కుల్లో ఈమె రెండోవారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని