
తాజా వార్తలు
కుల్దీప్ను తీసుకోకపోవడం ఆశ్చర్యం
గబ్బా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్ఇండియా మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్‌ను తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించిందని మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. మూడో టెస్టులో విహారి, అశ్విన్, బుమ్రా, జడేజా గాయపడడంతో కొత్తగా శార్దుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాలో మంచి రికార్డు ఉన్న కుల్దీప్ను కాదని అనుభవం లేని ఆటగాళ్లను ఎంపిక చేయడం అర్థం కాలేదని అగార్కర్ పేర్కొన్నాడు.
గతంలో శాస్త్రి ఏం చెప్పాడంటే..
2019 పర్యటనలో మంచి ప్రదర్శన చేసిన కుల్దీప్ను హెడ్‌కోచ్ రవిశాస్త్రి మెచ్చుకున్నాడు. విదేశీ పర్యటనల్లో రెండో స్పిన్నర్‌ను తీసుకోవాల్సి వస్తే కుల్దీప్నే తీసుకుంటామన్నాడు. అలాంటిది ఈ పర్యటనలో అతడికి ఒక వన్డే, ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే అవకాశం ఇచ్చారని అగార్కర్ గుర్తుచేశాడు. ఇప్పుడు నాలుగో టెస్టులోనూ ఎంపిక చేయకపోవడంతో కుల్దీప్ నిరుత్సాహం చెంది ఉంటాడని చెప్పాడు. గత ఆసీస్ పర్యటన తర్వాత అతడే నంబర్ వన్ స్పిన్నర్‌గా ఉన్నాడని, ఆ సిరీస్ తర్వాత మళ్లీ టెస్టులు ఆడలేదని మాజీ పేసర్ అన్నాడు.
ఈ మ్యాచ్‌లో జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఆల్‌రౌండర్‌గా తీసుకున్నా ఇంకో స్పిన్నర్‌గా కుల్దీప్ను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు. అతడి చేరికతో బౌలింగ్ విభాగం మరింత సమతుల్యంగా ఉండేదని అగార్కర్ అభిప్రాయపడ్డాడు. కుల్దీప్ తన బౌలింగ్‌తో వైవిధ్యం ప్రదర్శిస్తాడని, గత పర్యటనలోనూ ఆసీస్‌లో అద్భుతంగా రాణించాడని అగార్కర్ పేర్కొన్నాడు. అతడిని ఈ మ్యాచ్‌లో ఎంపిక చేయకపోవడం తనని ఆశ్చర్యానికి గురిచేసిందని వివరించాడు.
ఇవీ చదవండి..
‘అశ్విన్ ఒక్కడే 800 వికెట్లు తీస్తాడు’
60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..