close

తాజా వార్తలు

Updated : 01/10/2020 06:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాయల్స్‌ బ్యాట్లెత్తేశారు..

రాజస్థాన్‌ ఘోరవైఫల్యం
కోల్‌కతా చేతిలో చిత్తు
విజృంభించిన శివమ్‌ మావి, నాగర్‌కోటి

దుబాయ్‌

టీ20 క్రికెట్‌ ఎంత అనిశ్చితితో కూడుకున్నదో! ఎంతలో ఎంత తేడా. గత మ్యాచ్‌లో కొండంత లక్ష్యాన్ని పిండి చేస్తూ రికార్డు బద్దలు కొట్టిన రాజస్థాన్‌ ఈసారి బ్యాట్లెత్తేసింది. కోల్‌కతా బౌలింగ్‌కు దాసోహమంటూ బొక్కబోర్లా పడింది. సంజు మెరుపులు లేవు.. తెవాతియా తెగింపూ లేదు. కనీస పోరాటం కరవైన వేళ చాలా ముందే స్మిత్‌సేన పరాభవం ఖాయమైంది. శుభ్‌మన్‌ నిలకడైన బ్యాటింగ్‌కు యువ బౌలర్లు శివమ్‌ మావి, నాగర్‌కోటిల పదునైన పేస్‌ తోడవడంతో రాజస్థాన్‌ను కోల్‌కతా చిత్తుగా ఓడించింది. తొలి మ్యాచ్‌లో ఓడిన నైట్‌రైడర్స్‌కు ఇది వరుసగా రెండో విజయం..

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అదరగొట్టింది.. బుధవారం   జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై ఘనవిజయం సాధించింది. శుభ్‌మన్‌ గిల్‌  (47; 34 బంతుల్లో 5×4, 1×6), మోర్గాన్‌ (34 నాటౌట్‌; 23 బంతుల్లో 1×4, 2×6), రసెల్‌ (24; 14 బంతుల్లో 3×6) రాణించడంతో మొదట కోల్‌కతా 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఛేదనలో రాజస్థాన్‌ విఫలమైంది. శివమ్‌ మావి (2/20), నాగర్‌కోటి (2/13) ధాటికి 9 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. సంజు శాంసన్‌ (8), తెవాతియా (14) విఫలమయ్యారు. టామ్‌ కరన్‌ (54 నాటౌట్‌; 36 బంతుల్లో 2×4, 3×6) టాప్‌ స్కోరర్‌.
రాయల్స్‌ విలవిల: లక్ష్యం మరీ పెద్దదేమీ కాదు. పైగా గత మ్యాచ్‌లో రికార్డు లక్ష్నాన్ని ఛేదించిన ఊపులో ఉంది రాజస్థాన్‌. కానీ ఆ జట్టు ఛేదన అత్యంత పేలవం. కనీస పోరాటం చేయలేకపోయింది. చకచకా వికెట్లు చేజార్చుకున్న రాయల్స్‌ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఇన్నింగ్స్‌ సగమైనా కాకముందే ఆ జట్టు ఓటమి దాదాపుగా ఖాయమైంది. యువ పేసర్లు శివమ్‌ మావి, నాగర్‌కోటి పదునైన పేస్‌తో రాజస్థాన్‌ను  కకావికలం చేశారు. 42 పరుగులకే ఐదు వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టుకు కోల్‌కతా కోలుకునే అవకాశం ఇవ్వలేదు. రెండో ఓవర్లో స్టీవ్‌ స్మిత్‌ (3) నిష్క్రమణతో రాజస్థాన్‌ పతనం మొదలైంది. ధాటిగా ఆడడానికి ప్రయత్నించిన స్మిత్‌.. కమిన్స్‌ బౌలింగ్‌లో ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌తో వికెట్‌కీపర్‌ కార్తీక్‌కు చిక్కాడు. ఆ తర్వాత శివమ్‌, నాగర్‌కోటి జోరుతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది రాజస్థాన్‌. సూపర్‌ ఫామ్‌లో ఉన్న సంజు.. మిడిల్‌ స్టంప్‌ లైన్‌లో పడ్డ శివమ్‌ బంతిని పుల్‌ చేయబోయి నరైన్‌కు తేలికైన క్యాచ్‌ ఇచ్చాడు. శివమ్‌ తన తర్వాతి ఓవర్లో బట్లర్‌ (21)ను వెనక్కి పంపాడు. ఎనిమిదో ఓవర్లో నాగర్‌కోటి.. ఉతప్ప, పరాగ్‌లను ఔట్‌ చేసి ప్రత్యర్థిని దెబ్బతీశాడు. 42కే సగం వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడ్డా.. గత మ్యాచ్‌ సంచలనం తెవాతియా (10 బంతుల్లో 14) క్రీజులో ఉండడంతో రాజస్థాన్‌లో ఏదో చిన్న ఆశ. కానీ ఓ చక్కని గూగ్లీతో అతణ్ని బౌల్డ్‌ చేయడం ద్వారా ఆ ఆశలకు వరుణ్‌ చక్రవర్తి (2/25) తెరదించాడు. ఆ తర్వాత రాజస్థాన్‌ పరాజయం లాంఛనమే. టామ్‌ కరన్‌ ఆట ఓటమి అంతరాన్ని తగ్గించిందంతే. ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టిన కోల్‌కతా ఆటగాళ్లు చక్కని క్యాచ్‌లు అందుకున్నారు.
రాణించిన శుభ్‌మన్‌, మోర్గాన్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. ఇన్నింగ్స్‌ను గొప్పగా ఏమీ ఆరంభించలేదు. తొలి నాలుగు ఓవర్లలో స్కోరు 25 పరుగులు. ఐదో ఓవర్లో నరైన్‌ (15;  14 బంతుల్లో 2×4, 1×6).. వరుసగా 6, 4తో  జోరందుకున్నట్లు కనిపించినా వెంటనే ఔటయ్యాడు. శుభ్‌మన్‌ మరీ ధాటిగా ఆడకపోయినా, వీలైనప్పుడు చక్కని షాట్లతో బంతిని బౌండరీ దాటిస్తూ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. ఉన్నకాసేపు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన నితీష్‌ రాణా (22; 17 బంతుల్లో 2×4, 1×6) 10వ ఓవర్లో ఔటయ్యేటప్పటికి స్కోరు 82. 12వ ఓవర్లో శుభ్‌మన్‌.. ఆర్చర్‌  బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కానీ విధ్వంసక వీరుడు రసెల్‌ బాదుడు మొదలెట్టాడు. శ్రేయస్‌ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, రాజ్‌పుత్‌ బౌలింగ్‌లో ఓ సిక్స్‌ బాది..కోల్‌కతాకు భారీ స్కోరుపై ఆశలు రేపాడు. కానీ ఎక్కువసేపు నిలవలేదు. మంచి ఊపుమీదున్న దశలో రాజ్‌పుత్‌ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. 15వ ఓవర్లో ఐదో వికెట్‌గా అతడు నిష్క్రమించేటప్పటికి స్కోరు 115. అంతకుముందు ఓవర్లోనే కెప్టెన్‌  దినేశ్‌ కార్తీక్‌ (1) ఔటై ఉండడంతో కోల్‌కతా పోటీ ఇవ్వగలిగిన స్కోరు చేయగలదా అన్న సందేహం  కలిగింది. కానీ మోర్గాన్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో   కోల్‌కతా ఆ జట్టు  కాస్త సంతృప్తిగా ఇన్నింగ్స్‌ను ముగించింది. ధాటిగా ఆడిన మోర్గాన్‌ కమిన్స్‌ (12), నాగర్‌కోటి (8 నాటౌట్‌)తో కలిసి చివరి ఐదు ఓవర్లలో 54 పరుగులు రాబట్టాడు.

మళ్లీ జోడీ కుదిరింది

శివమ్‌ మావి, కమలేశ్‌ నాగర్‌కోటి.. ధనాధన్‌ బ్యాట్స్‌మెన్‌తో కూడిన రాజస్థాన్‌ రాయల్స్‌ను దెబ్బకొట్టిన యువ పేసర్లు. బ్యాటింగ్‌ లైనప్‌లో తొలి ఐదుగురు ఆటగాళ్లలో నలుగురిని పెవిలియన్‌ పంపింది వీరే. బట్లర్‌, శాంసన్‌లను మావి ఔట్‌ చేయగా.. ఉతప్ప, రియాన్‌లను నాగర్‌కోటి పెవిలియన్‌ పంపాడు. ఐపీఎల్‌లో వీరిద్దరూ ఇలా ప్రత్యర్థి జట్టును దెబ్బతీయడం ఇదే తొలిసారి. కానీ కెరీర్లో కొత్తేం కాదు. పేస్‌, స్వింగ్‌, బౌన్స్‌తో బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టే ఈ కుడి చేతివాటం పేసర్లు 2018 అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించిన భారత జట్టు సభ్యులు. ఆ టోర్నీలో తమ పేస్‌తో ఈ ఇద్దరు కుర్రాళ్లు జట్టుకు విజయాలు అందించారు. కలిసికట్టుగా ప్రత్యర్థి పనిపట్టారు. వాళ్ల కోసం ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు పోటీపడేలా చేశారు. ఊహించని ధరకు అమ్ముడుపోయారు. 2018 వేలంలో నాగర్‌కోటి కోసం రూ.3.2 కోట్లు, శివమ్‌ మావి కోసం రూ.3 కోట్లు పెట్టి కేకేఆర్‌ సొంతం చేసుకుంది. అయితే గాయాలు వీళ్లకు సమస్యగా మారాయి. ఆ సీజన్‌లో మావి తొమ్మిది మ్యాచ్‌లు ఆడగా.. నాగర్‌కోటి అసలు మైదానంలోనే అడుగుపెట్టలేదు. గత సీజన్‌కూ దూరమయ్యారు. విరామంలో తిరిగి బలంగా పుంజుకున్నారు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో డైరెక్టర్‌ ద్రవిడ్‌ మార్గనిర్దేశనంలో సరికొత్త ఉత్సాహంతో ఈ సీజన్‌కు అందుబాటులోకి వచ్చారు. ఇన్ని రోజులుగా ఎదురుచూసిన అవకాశం రాగానే రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నారు. ఈ ఇద్దరూ గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులేయగల సమర్థులే.
 

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: శుభ్‌మన్‌ గిల్‌ (సి) అండ్‌ (బి) ఆర్చర్‌ 47; నరైన్‌ (బి) ఉనద్కత్‌ 15; రాణా (సి) పరాగ్‌ (బి) తెవాతియా 22; రసెల్‌ (సి) ఉనద్కత్‌ (బి) రాజ్‌పుత్‌ 24; దినేశ్‌ కార్తీక్‌ (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 1; మోర్గాన్‌ నాటౌట్‌ 34; కమిన్స్‌ (సి) సంజు శాంసన్‌ (బి) టామ్‌ కరన్‌ 12; నాగర్‌కోటి నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 11

మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 174;

వికెట్ల పతనం: 1-36, 2-82, 3-89, 4-106, 5-115, 6-149;

బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-18-2; రాజ్‌పుత్‌ 4-0-39-1; ఉనద్కత్‌ 2-0-14-1; టామ్‌ కరన్‌ 4-0-37-1; శ్రేయస్‌ గోపాల్‌ 4-0-43-0; రియాన్‌ పరాగ్‌ 1-0-14-0; తెవాతియా 1-0-6-1
రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: బట్లర్‌ (సి) వరుణ్‌ (బి) శివమ్‌ మావి 21; స్మిత్‌ (సి) కార్తీక్‌ (బి) కమిన్స్‌ 3; సంజు శాంసన్‌ (సి) నరైన్‌ (బి) శివమ్‌ మావి 8; ఉతప్ప (సి) శివమ్‌ మావి (బి) నాగర్‌కోటి 2; పరాగ్‌ (సి) శుభ్‌మన్‌ (బి) నాగర్‌కోటి 1; తెవాతియా (బి) వరుణ్‌ 14; టామ్‌ కరన్‌ నాటౌట్‌ 54; శ్రేయస్‌ గోపాల్‌ (సి) కార్తీక్‌ (బి) నరైన్‌ 5; ఆర్చర్‌ (సి) నాగర్‌కోటి (బి) వరుణ్‌ 6; ఉనద్కత్‌ (సి) నాగర్‌కోటి (బి) కుల్‌దీప్‌ 9; రాజ్‌పుత్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 7

మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 137;

వికెట్ల పతనం: 1-15, 2-30, 3-39, 4-41, 5-42, 6-66, 7-81, 8-88,   9-106;

బౌలింగ్‌: నరైన్‌ 4-0-40-1; కమిన్స్‌ 3-0-13-1; శివమ్‌ మావి 4-0-20-2; కమలేశ్‌ నాగర్‌కోటి 2-0-13-2; వరుణ్‌ చక్రవర్తి 4-0-25-2; కుల్‌దీప్‌ యాదవ్‌ 3-0-20-1

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.