close

తాజా వార్తలు

Published : 29/10/2020 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తొలి అడుగు ముంబయిదే!

 ఖాతాలో ఎనిమిదో విజయం
 బెంగళూరుకు మరో ఓటమి

అబుదాబి

ముంబయి మురిసింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యంతో ఎనిమిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్‌-13 ప్లేఆఫ్స్‌లో స్థానమిక లాంఛనమే. బుమ్రా అద్భుత బౌలింగ్‌కు సూర్యకుమార్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌ తోడైనవేళ బెంగళూరును ముంబయి మట్టికరిపించింది. యువ ఓపెనర్‌ పడిక్కల్‌ శ్రమ వృథా అయింది. ఏడు విజయాలతో ప్లేఆఫ్స్‌ ముంగిట ఉన్న కోహ్లీసేనకు ఇది వరుసగా రెండో ఓటమి.
ముంబయి ఇండియన్స్‌ అదరగొట్టింది.  బుధవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఓడించింది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (74; 45 బంతుల్లో 12×4, 1×6) మెరవడంతో మొదట బెంగళూరు 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. భారీ స్కోరు చేసేలా కనిపించిన ఆ జట్టును బుమ్రా (3/14) గట్టి దెబ్బతీశాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్యకుమార్‌ యాదవ్‌ (79 నాటౌట్‌; 43 బంతుల్లో 10×4, 3×6) చెలరేగడంతో లక్ష్యాన్ని ముంబయి 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
భగ్గుమన్న సూర్య: ముంబయి ఛేదనలో సూర్యకుమార్‌ యాదవ్‌ ఆటే హైలైట్‌. ఎంత బాగా ఆడుతున్నా టీమ్‌ఇండియాకు ఆడే అవకాశం రాకపోవడంతో సెలక్టర్లకు తన సత్తాను ఇంకా నిరూపించాలనుకున్నాడేమో ఏమో.. అతడు మరింత రెచ్చిపోయాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ముంబయి లక్ష్యం దిశగా సాగింది అంటే కారణం సూర్యకుమారే. 6వ ఓవర్లో డికాక్‌ (18) నిష్క్రమించేటప్పటికి స్కోరు 37. అప్పుడు క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌.. ధనాధన్‌ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఏ దశలోనూ తగ్గలేదు. ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ సాగిపోయాడు. చక్కని డ్రైవ్‌లు, స్వీప్‌లతో అలరించాడు. మరోవైపు వికెట్లు పోతున్నా అతడి దూకుడుతో సాధించాల్సిన రన్‌రేట్‌ ఎప్పుడూ ముంబయికి అందుబాలోనే ఉంది. మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ 25 పరుగులు చేయగా.. సౌరభ్‌ తివారి (5) విఫలమయ్యాడు. కృనాల్‌ (10; 10 బంతుల్లో 1×4), హార్దిక్‌ (17; 15 బంతుల్లో 2×6)ల కొద్దిపాటి సహకారంతో ముంబయిని సూర్యకుమార్‌ లక్ష్యం వైపు నడిపించాడు. పొలార్డ్‌ (4 నాటౌట్‌) కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆఖరి ఓవర్లో సిరాజ్‌ బౌలింగ్‌లో చూడచక్కని ఫోర్‌తో జట్టుకు విజయాన్నందించాడు. చాన్నాళ్లకు మ్యాచ్‌ ఆడిన స్టెయిన్‌ వికెట్‌ తీయకుండా 43 పరుగులు సమర్పించుకున్నాడు.

పడిక్కల్‌ మెరిసినా..: మొదట బెంగళూరు చేసింది తక్కువ స్కోరే. ఎందుకంటే ఘనంగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆ జట్టు 11.1 ఓవర్లలోనే 94/1తో నిలిచింది. ఓవైపు చెలరేగి ఆడుతున్న యువ ఓపెనర్‌ పడిక్కల్‌.. మరోవైపు కెప్టెన్‌ కోహ్లి. ఆ తర్వాత విధ్వంసక వీరుడు  డివిలియర్స్‌ వరుసలో ఉన్నాడు. దీంతో బెంగళూరు భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ బలమైన ఆరంభాన్ని వృథా చేసుకుంటూ అనూహ్యంగా తడబడింది. మరొక్క బ్యాట్స్‌మన్‌ కూడా నిలవకపోవడంతో బెంగళూరు మరో 70 పరుగులు మాత్రమే జోడించగలిగింది. ముఖ్యంగా బుమ్రా అద్భుత బౌలింగ్‌తో ఆ జట్టును దెబ్బతీశాడు. ముందు కోహ్లి (14 బంతుల్లో 9)ని ఔట్‌ చేయడం ద్వారా అతడు మ్యాచ్‌ గమనాన్ని మార్చాడు. రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో సిక్స్‌, రెండు ఫోర్లతో పడిక్కల్‌ జోరు కొనసాగించినా.. బెంగళూరు ఎన్నో ఆశలు పెట్టుకున్న డివిలియర్స్‌ (15; 12 బంతుల్లో 1×4, 1×6)ను పొలార్డ్‌ ఎక్కువసేపు నిలువనివ్వలేదు. 17వ ఓవర్లో మెయిడెన్‌ వేసిన బుమ్రా దూబే, పడిక్కల్‌ను ఔట్‌ చేయడంతో బెంగళూరు భారీ స్కోరు ఆశలు తెరపడ్డట్లయింది. మోరిస్‌ (4) కూడా త్వరగా ఔట్‌ కాగా.. గుర్‌కీరత్‌ (14 నాటౌట్‌), సుందర్‌ (10 నాటౌట్‌) అభేద్యంగా 26 పరుగులు జోడించారు. ఫిలిప్‌ (33; 24 బంతుల్లో 4×4, 1×6)తో కలిసి ఇన్నింగ్స్‌ మొదలెట్టిన పడిక్కల్‌ ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాక ముంబయి బౌలర్లు పంజుకున్న తీరు అద్భుతం. చివరి అయిదు ఓవర్లలో వాళ్లు 35 పరుగులే ఇచ్చారు. ముఖ్యంగా పదునైన పేస్‌తో బుమ్రా..   బెంగళూరు పతనాన్ని శాసించాడు. 17, 19 ఓవర్లలో బౌలింగ్‌ చేసిన అతడు కేవలం అయిదు పరుగులిచ్చాడంతే.
బెంగళూరు ఇన్నింగ్స్‌: ఫిలిప్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 33; పడిక్కల్‌ (సి) బౌల్ట్‌ (బి) బుమ్రా 74; కోహ్లి (సి) తివారి (బి) బుమ్రా 9; డివిలియర్స్‌ (సి) రాహుల్‌ చాహర్‌ (బి) పొలార్డ్‌ 15; దూబె (సి) సూర్యకుమార్‌ (బి) బుమ్రా 2; మోరిస్‌ (సి) ప్యాటిన్సన్‌ (బి) బౌల్ట్‌ 4; గుర్‌కీరత్‌ సింగ్‌ నాటౌట్‌ 14; వాషింగ్టన్‌ సుందర్‌ నాటౌట్‌ 10; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164; వికెట్ల పతనం: 1-71, 2-95, 3-131, 4-134, 5-134, 6-138;  బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-40-1; బుమ్రా   4-1-14-3; హార్దిక్‌ పాండ్య 4-0-27-0; ప్యాటిన్సన్‌ 3-0-35-0; రాహుల్‌ చాహర్‌ 4-0-43-1; పొలార్డ్‌ 1-0-5-1
ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) గుర్‌కీరత్‌ (బి) సిరాజ్‌ 18; కిషన్‌ (సి) మోరిస్‌ (బి) చాహల్‌ 25; సూర్యకుమార్‌ నాటౌట్‌ 79; సౌరభ్‌ తివారి (సి) పడిక్కల్‌ (బి) సిరాజ్‌ 5; కృనాల్‌ పాండ్య (సి) మోరిస్‌ (బి) చాహల్‌ 10; హార్దిక్‌ పాండ్య (సి) సిరాజ్‌ (బి) మోరిస్‌ 17; పొలార్డ్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (19.1 ఓవర్లలో  5 వికెట్లకు) 166; వికెట్ల పతనం: 1-37, 2-52, 3-72, 4-107, 5-158
బౌలింగ్‌: మోరిస్‌ 4-0-36-1; స్టెయిన్‌ 4-0-43-0; సుందర్‌ 4-0-20-0; సిరాజ్‌  3.1-0-28-2; చాహల్‌ 4-0-37-2


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.