గిబ్స్‌.. హ్యాంగోవర్‌.. రికార్డు ఛేదన 

తాజా వార్తలు

Published : 13/03/2021 01:25 IST

గిబ్స్‌.. హ్యాంగోవర్‌.. రికార్డు ఛేదన 

ఆసీస్‌పై దక్షిణాఫ్రికా చారిత్రక విజయం..

ప్రపంచ క్రికెట్‌లో వన్డే ఫార్మాట్‌ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,276 వన్డేలు(పురుషుల విభాగం) జరిగాయి. అందులో అన్ని జట్లూ కలిపి 20 సార్లు 400 కన్నా ఎక్కువ స్కోర్లు సాధించాయి. ఇన్ని మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారి అభిమానులను అలరించినా.. ఒక్క మ్యాచ్‌ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. అదే 2006 మార్చి 12న జోహెనస్‌బర్గ్‌ వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య ఐదో వన్డే.


పాంటింగ్‌ విధ్వంసం..

తొలుత ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 434 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఇది ఆరోజు తొలి ఇన్నింగ్స్‌ వరకు వన్డేల్లో అత్యధిక స్కోర్‌ కావడం విశేషం. రికీ పాంటింగ్‌(164; 105 బంతుల్లో 13x4, 9x6) భారీ శతకానికి తోడు మైఖేల్‌ హస్సీ(81; 51 బంతుల్లో 9x4, 3x6), సైమన్‌ కటిచ్‌(79; 90 బంతుల్లో 9x4, 1x6) రాణించడంతో కంగారూలు అత్యధిక స్కోర్‌ సాధించి రికార్డు సృష్టించారు.


ఆ రికార్డునే బద్దలు కొట్టారు..

ఇక రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభం కాకముందే ఆస్ట్రేలియా స్కోర్‌ చూసి వారంతా ఆ జట్టు విజయం లాంఛనమే అనుకున్నారు. తర్వాత దక్షిణాఫ్రికా 3 పరుగులకే ఓపెనర్‌ డిప్పెనార్‌(1) తొలి వికెట్‌ కోల్పోవడంతో ఆస్ట్రేలియాపై అంచనాలు పెరిగాయి. కానీ, అసలు ఆట మొదలైంది అక్కడి నుంచే. గ్రేమ్‌స్మిత్‌(90; 55 బంతుల్లో 13x4, 2x6), హర్షలె గిబ్స్‌(175; 111 బంతుల్లో 21x4, 7x6) కంగారూ బౌలర్లను చితకబాదారు. ఇద్దరూ బౌండరీలతో విరుచుకుపడడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. దాంతో 22 ఓవర్లకు దక్షిణాఫ్రికా 190/1తో పటిష్ఠస్థితిలో నిలిచింది. కానీ, తర్వాత వాళ్లిద్దరూ ఔటవ్వడం, వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆస్ట్రేలియా మ్యాచ్‌పై పట్టు సాధించింది. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ మార్క్‌ బౌచర్‌(50*; 43 బంతుల్లో 4x4) చివర్లో టెయిలెండర్లతో కష్టంమీద పోరాడి మ్యాచ్‌ను గెలిపించాడు. ఒక బంతి మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికాకు చిరస్మరణీయ విజయం అందించాడు.


గిబ్స్‌ హ్యాంగోవర్‌..

ఇలా ఒకేరోజు రెండు జట్లూ 400కి పైగా స్కోర్లు సాధించడమే కాకుండా దక్షిణాఫ్రికా రికార్డు ఛేదన నమోదుచేయడంతో ఈ మ్యాచ్‌ అప్పట్లో సంచలనం సృష్టించింది. కాగా, ఈ మ్యాచ్‌ జరిగి నేటికి 15 ఏళ్లు గడిచిన సందర్భంగా గిబ్స్‌ నాటి విశేషాలను గుర్తుచేసుకున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో నాటి విజయోత్సవ ఫొటో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే దానికి #Hangoverfromhell అనే హ్యాష్‌ట్యాగ్‌ కూడా జతచేశాడు. దానికి కూడా ఓ అర్థం ఉంది. అదేంటంటే.. ఆ మ్యాచ్‌కు ముందురోజు రాత్రి ఈ దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ అర్ధరాత్రి వరకూ పూటుగా మద్యం తాగి ఉన్నాడట. ఈ విషయాన్ని గిబ్స్‌ తన ఆత్మకథలో పేర్కొన్నాడు. అంటే మ్యాచ్‌ జరిగేటప్పుడు, బ్యాటింగ్‌ చేసేటప్పుడు అతడు మద్యం మత్తులోనే ఉన్నాడని స్పష్టం చేశాడు.

-ఇంటర్నెట్‌డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని