జమాన్‌ 200 చేరుకోనివ్వకుండా.. డికాక్‌ ట్రిక్‌ 

తాజా వార్తలు

Updated : 05/04/2021 14:36 IST

జమాన్‌ 200 చేరుకోనివ్వకుండా.. డికాక్‌ ట్రిక్‌ 

మరోసారి తెరపైకి క్రీడాస్ఫూర్తి వివాదం..

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌లో క్రీడాస్ఫూర్తి అనేదానికి ఎంతో విలువుంటుంది. ఆటలో ఏ జట్టుకైనా గెలుపోటములు సహజం. కానీ ఆటగాళ్లు ఎలా ఆడారనేదే చాలా ముఖ్యం. అందుకు సంబంధించి ‘ఫెయిర్‌ ప్లే’ నియమ నిబంధనలూ ఉన్నాయి. అయితే, తాజాగా పాకిస్థాన్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఫకర్‌ జమాన్‌(193; 155 బంతుల్లో 18x4, 10x6)ను రనౌట్‌ చేసిన విధానం క్వింటన్‌ డికాక్‌కు చెడ్డపేరు తెచ్చేలా ఉంది. అది నిజంగానే క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా కనిపిస్తోంది.

తొలుత ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 341 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. డికాక్‌(80), కెప్టెన్‌ బవుమా(92), వాండర్‌ డసెన్‌(60), మిల్లర్‌(50) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్‌ 120 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. ఒకవైపు ఓపెనర్‌ జమాన్‌ వికెట్‌ కాపాడుకుంటూ ఒంటరిపోరాటం చేస్తుండగా మరోవైపు వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్లు పెవిలియన్‌ చేరారు. ఈ నేపథ్యంలోనే చివరి ఓవర్‌లో 31 పరుగులు చేయాల్సిన స్థితిలో జమాన్‌(192) పరుగులతో ద్విశతకానికి చేరువలో ఉన్నాడు.

అయితే, ఎంగిడి వేసిన తొలి బంతికి డబుల్‌ రన్‌ తీయబోయిన జమాన్‌ రెండో పరుగు పూర్తి చేసే సమయంలో రనౌటయ్యాడు. ఫీల్డర్‌ మార్‌క్రమ్‌ డైరెక్ట్‌ త్రో విసరడంతో పెవిలియన్‌ చేరాడు. కానీ, ఇక్కడే దక్షిణాఫ్రికా కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ ఓ మాయ చేశాడు. జమాన్‌ రెండో పరుగు కోసం క్రీజులోకి వస్తుండగా ఫీల్డర్‌ త్రో విసిరిన బంతి నాన్‌ స్ట్రైకర్‌ వైపు వెళ్తున్నట్లు సైగలు చేశాడు. దాంతో పాక్‌ బ్యాట్స్‌మన్‌ అటువైపు తిరిగి చూశాడు. ఈలోపే బంతి వికెట్లకు తాకడంతో అతడు రనౌటయ్యాడు. కాగా, రీప్లేలో డికాక్‌ ఉద్దేశపూర్వకంగా జమాన్‌ను మాయ చేసే విధంగా కనిపించింది. చివరికి పాక్‌ 50 ఓవర్లలో 324/9తో నిలిచింది. దక్షిణాఫ్రికా 17 పరుగులతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే జమాన్‌ వన్డేల్లో రెండో ద్విశతకం చేజార్చుకున్నాడు. దీన్ని పాక్‌ అభిమానులు, మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ తప్పుబట్టారు. డికాక్‌ చేసింది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని