దుమారం రేపిన సన్నీ!

తాజా వార్తలు

Published : 25/12/2020 01:55 IST

దుమారం రేపిన సన్నీ!

టీమ్‌ఇండియాలో ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయం

అశ్విన్‌, నటరాజన్‌ బాధితులని వ్యాఖ్య

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియాలో ఒక్కో క్రికెటర్‌కు ఒక్కో నిబంధన, న్యాయం అమలవుతోందని మాజీ సారథి సునిల్‌ గావస్కర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. ముక్కుసూటిగా మాట్లాడే రవిచంద్రన్‌ అశ్విన్‌, కొత్త కుర్రాడు నటరాజన్‌ ఇందుకు బాధితులుగా మారారన్న ఆయన మాటలు సరికొత్త వివాదానికి తెరలేపాయి. కొన్ని అంశాలపై వ్యతిరేకత ఉన్నా జట్టు సమావేశాల్లో ఆటగాళ్లు తలవంచుకొనే ఉంటున్నారని ‘స్పోర్ట్స్‌సర్‌’కు రాసిన కాలమ్‌లో సన్నీ తెలిపారు.

ప్రస్తుతం జట్టులో ఒక్కొక్కరికీ ఒక్కో నిబంధన అమలవుతోందని సన్నీ విమర్శించారు. విరాట్‌ కోహ్లీకి పితృత్వపు సెలవులు మంజూరు చేసిన బీసీసీఐ నెట్‌బౌలర్‌గా ఆసీస్‌కు వెళ్లిన నటరాజన్‌కు మాత్రం సెలవులు నిరాకరించిందని పేర్కొన్నారు. ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ సమయంలోనే అతడు తండ్రయ్యాడని కనీసం బిడ్డను చూసేందుకూ అవకాశం ఇవ్వకుండా ఆసీస్‌ విమానం ఎక్కించారని ఆరోపించారు. టెస్టు సిరీస్‌ ముగిసేవరకు అతడు బిడ్డను చూసుకోలేడని అన్నారు. కెప్టెన్‌ మాత్రం భారత్‌కు వచ్చేస్తున్నాడని విమర్శించారు.

ముక్కుసూటితనం వల్ల అశ్విన్‌ ఎంతో నష్టపోయాడని సన్నీ తెలిపారు.  ‘టెస్టుల్లో 350+ వికెట్లు, నాలుగు శతకాలు చేసిన ఏ బౌలర్‌కైనా ఆయా దేశాలు అండగా నిలుస్తాయి. అలాంటిది ఒక్క టెస్టులో వికెట్లు తీయకపోతే చాలు తర్వాత మ్యాచులో యాష్‌ను పక్కనపెట్టేస్తారు. అదే బ్యాట్స్‌మెన్‌కు మాత్రం అవకాశాలు ఇస్తూనే ఉంటారు. అశ్విన్‌కు మాత్రమే ఈ నిబంధనలు వర్తించవు’ అని ఆయన తెలిపారు. పొట్టి క్రికెట్లో విజేతగా అవతరించిన నటరాజన్‌ను నెట్ బౌలర్‌గా తీసుకొని తన బిడ్డను చూసుకొనేందుకు అవకాశమివ్వలేదని విమర్శించారు. కానీ సారథికి మాత్రం తన తొలి బిడ్డను చూసేందుకు సెలవులు ఇచ్చారని ఆరోపించారు. తన మాట నమ్మకపోతే అశ్విన్‌, నట్టూనే ప్రశ్నించండని పేర్కొన్నారు.

గావస్కర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపాయి. కోహ్లీ పితృత్వపు సెలవులు తీసుకొని స్వదేశానికి రావడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. అతడా పని చేసి ఉండకూదని మాట్లాడుతున్నారు. మరికొందరేమో సన్నీ అభిప్రాయంతో విభేదిస్తున్నారు. సచిన్‌ స్థాయికి చేరిన విరాట్‌, కొత్త పేసర్ నటరాజన్‌కు తేడా ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఆరు నెలల ముందుగానే కోహ్లీ సెలవుల గురించి బీసీసీఐకి అర్జీ పెట్టుకున్నాడని గుర్తుచేస్తున్నారు.

ఇతర ఆటగాళ్లను విభేదించే సన్నీ.. మరెందుకు ముంబయి ఆటగాళ్లను విమర్శించడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. రోహిత్‌ సహా చాలామంది ఇలాగే సెలవులు తీసుకున్నారు కదా అని గుర్తు చేస్తున్నారు. కాగా ఇప్పుడు అన్ని సిరీసులూ బయో బుడగలో జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో మాదిరిగా విమాన ప్రయాణం చేసి వెంటనే ఆడే పరిస్థితులు లేవు. 14 రోజుల క్వారంటైన్‌ వంటి నిబంధనలు ఉన్నాయి. ఏవైనా మార్పులు చేయాలన్నా ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తోంది. తన తండ్రి చనిపోయాడని తెలిసినా మహ్మద్‌ సిరాజ్‌ ఆసీస్‌లోనే ఉండిపోయిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి
చాహల్‌-ధనశ్రీ.. మధురస్మృతులు
పంత్‌ను తీసుకుంటే సాహాకేం చెప్తారు?

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని